వారిని సందర్భాన్ని బట్టి పరీక్షిస్తాం: కోహ్లి | Sakshi
Sakshi News home page

వారిని సందర్భాన్ని బట్టి పరీక్షిస్తాం: కోహ్లి

Published Fri, Jul 21 2017 3:55 PM

వారిని సందర్భాన్ని బట్టి పరీక్షిస్తాం: కోహ్లి

కొలంబో: ఇటీవల శ్రీలంక పర్యటనకు వెళ్లిన భారత క్రికెట్ జట్టులో ఓపెనర్ శిఖర్ ధావన్కు చివరి నిమిషంలో చోటు దక్కిన సంగతి తెలిసిందే. టెస్టుల్లో రెగ్యులర్ ఓపెనర్ అయిన మురళీ విజయ్ గాయం ఇంకా నయం కాలేకపోవడంతో శిఖర్ ధావన్ కు జట్టులో చోటు కల్పిస్తూ సెలక్టర్లు నిర్ణయం తీసుకున్నారు.  అయితే మరో ఓపెనర్ అభినవ్ ముకుంద్ కూడా శ్రీలంక పర్యటనకు వెళ్లిన జట్టులో ఉన్నాడు. దాంతో కేఎల్ రాహుల్ తో కలిసి ఆ ఇద్దరిలో ఎవరు ఓపెనింగ్ చేస్తారనే దానిపై కొంతవరకూ సందిగ్ధత ఉంది.  ఆ విషయంపై స్పందించిన కెప్టెన్ విరాట్ కోహ్లి.. ఆ ఇద్దర్నీ సందర్భాన్ని బట్టి రాహుల్ కు జతగా పంపిస్తామన్నాడు. ఆ ఇద్దర్నీ తుది జట్టులోకి తీసుకునే విషయం అప్పటి పరిస్థితిపై మాత్రమే ఆధారపడి ఉంటుందన్నాడు. ఈ ఇద్దరిలో ఎవరు ఓపెనింగ్‌ స్థానంలో బరిలోకి దిగినా ఒత్తిడిగా కాకుండా ఓ అవకాశంలా భావించాలని కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి కోరాడు.


'ప్రతీ ఒక్క ఆటగాడు జాతీయ జట్టులోకి సత్తా చాటేందుకు ఆరాటపడటమనేది సర్వసాధారణం. ఆటగాళ్లను ఎంపిక తరువాత అందరికీ అవకాశం కల్పించడానికే యత్నిస్తాం. అది అప్పటి పరిస్థితిని బట్టే ఉంటుంది. మురళీ విజయ్ పూర్తిగా ఫిట్ గా లేడని ఆఖరి నిమిషంలో తెలిసింది. ఆటగాళ్ల గాయాలనేవి గేమ్ లో దురదృష్టపు భాగం. అభినవ్ ముకుంద్ చాలా దేశవాళీ మ్యాచ్లు ఆడాడు. మరొకవైపు ఇక్కడ చివరిసారి శిఖర్ ధావన్ సెంచరీ చేశాడు. అదే సమయంలో చటేశ్వర పుజారా ధర్మశాలలో జరిగిన చివరి టెస్టులో ఓపెనింగ్ చేశాడు. ఇలా ప్రతీ ఒక్కరూ అందుబాటులో ఉన్నారు. దాంతో ఎటువంటి ఒత్తిడి లేకుండా ఆటగాళ్లను ఉపయోగించుకుంటాం'అని కోహ్లి పేర్కొన్నాడు.
 

Advertisement
Advertisement