ఈసారికి వదిలేద్దామా! | Sakshi
Sakshi News home page

ఈసారికి వదిలేద్దామా!

Published Tue, Oct 21 2014 12:36 AM

ఈసారికి వదిలేద్దామా! - Sakshi

సాక్షి, హైదరాబాద్: భారత పర్యటనను అర్ధాంతరంగా రద్దు చేసిన వెస్టిండీస్ బోర్డుపై ఆగ్రహంతో ఉన్న బీసీసీఐ కాస్త తగ్గినట్లు కనిపిస్తోంది. దాదాపు రూ. 400 కోట్ల నష్ట పరిహారం కోరాలని ముందుగా భావించిన బోర్డు, తాజాగా దీనిపై పునరాలోచనలో పడినట్లు సమాచారం. విండీస్ సిరీస్ తదనందర పరిణామాలను చర్చించడంతో పాటు శ్రీలంకతో వన్డే సిరీస్ ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసేందుకు బీసీసీఐ వర్కింగ్ కమిటీ మంగళవారం ఇక్కడ సమావేశమవుతోంది.

ప్రస్తుతం నష్టపరిహారం కోరకుండా, ద్వైపాక్షిక సిరీస్ నిబంధనలు ఉల్లంఘించినందుకు ఎందుకు జరిమానా విధించరాదో కోరుతూ విండీస్ బోర్డుకు లీగల్ నోటీసు పంపించే అవకాశం ఉంది. అసలే ఆ బోర్డు ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండటం కూడా బీసీసీఐని ఆలోచనలో పడేయటానికి కారణమని తెలుస్తోంది. వర్కింగ్ కమిటీ సమావేశానికి ముందే ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ కూడా భేటీ కానుంది. ఐపీఎల్ ఫ్రాంచైజీలు వెస్టిండీస్ క్రికెటర్లకు మద్దతు పలుకుతుండటం, బోర్డు సభ్యుల్లో ఎక్కువ మంది ఆటగాళ్ల తప్పేమీ లేదనడాన్ని బట్టి చూస్తే ఐపీఎల్‌లో విండీస్ ఆటగాళ్లను నిషేధించే ప్రతిపాదనకు కూడా ఆమోదం లభించకపోవచ్చు.

Advertisement
Advertisement