2జీ నుంచి రంజిత్ ఔట్ | Sakshi
Sakshi News home page

2జీ నుంచి రంజిత్ ఔట్

Published Fri, Nov 21 2014 3:44 AM

2జీ నుంచి రంజిత్ ఔట్

కేసు దర్యాప్తు నుంచి సీబీఐ డెరైక్టర్‌ని తప్పించిన సుప్రీంకోర్టు
సంబంధిత అన్ని కేసులకూ దూరంగా ఉండాలని ఆదేశాలు
సిన్హా తర్వాత సీనియర్ మోస్ట్ అధికారికి బాధ్యతలు
వివరణాత్మక ఆదేశాలివ్వలేమన్న ధర్మాసనం
పదవీ విరమణకు ముందు సిన్హాకు ఎదురుదెబ్బ

 
న్యూఢిల్లీ: పదవీ విరమణకు కేవలం 12 రోజులు మిగిలి ఉండగా సీబీఐ డెరైక్టర్ రంజిత్ సిన్హాకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం కేసు దర్యాప్తు నుంచి సుప్రీంకోర్టు ఆయన్ను తప్పించింది. ఈ కేసులో కొందరు నిందితులను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆయనపై వచ్చిన ఆరోపణలు ప్రాథమికంగా విశ్వసనీయమైనవిగా కనపడుతున్నాయని పేర్కొంది. 2జీ స్కామ్‌కు సంబంధించిన ఏ కేసులోనూ జోక్యం చేసుకోవద్దంటూ సిన్హాను ఆదేశించింది. సిన్హా తర్వాత అత్యంత సీనియర్ అధికారికి బాధ్యతలు అప్పగించింది. అయితే ఈ విషయమై వివరణాత్మక ఆదేశాలు వెలువరించేందుకు చీఫ్ జస్టిస్ హెచ్.ఎల్.దత్తు నేతృత్వంలోని ధర్మాసనం నిరాకరించింది. ఉన్నత దర్యాప్తు సంస్థ ప్రతిష్టను ఇది మసకబారుస్తుందని పేర్కొంది. సిన్హా 2జీ కేసును నీరుగారుస్తున్నారంటూ సెంటర్ ఫర్ పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ (సీపీఐఎల్) అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ మదన్ బీ లోకుర్, జస్టిస్ ఏకే సిక్రీలతో కూడిన ధర్మాసనం గురువారం మరోమారు విచారించింది. ఈ ఆరోపణల్లో నిజం లేదని ఆయన తరఫు న్యాయవాది వికాస్ సింగ్ గట్టిగా వాదించారు.

ఆ ఆదేశాలు పాటిస్తే కేసు నాశనం: ఎస్పీపీ

ఈ కేసులో సీబీఐ చీఫ్ పాత్రను సుప్రీంకోర్టు నియమిత ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఎస్పీపీ) ఆనంద్ గ్రోవర్‌తోపాటు సీబీఐ తరఫు న్యాయవాది కె.కె.వేణుగోపాల్‌లు దుయ్యబట్టారు. దర్యాప్తు బృందంలోని ఓ సీనియర్ ఐపీఎస్ అధికారిని వేగుగా సిన్హా పేర్కొనడాన్ని ప్రశ్నించారు. సిన్హా విశ్వసనీయతపైనా, న్యాయశాఖ మాజీ మంత్రి పాత్రపైనా ఎస్పీపీ తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తారు. విచారణలో కనుక సిన్హా ఆదేశాలు పాటించి ఉన్నట్లైతే కొందరు నిందితులకు సంబంధించి కేసు యావత్తూ నాశనమై పోయేదన్నారు. ఈ కేసులో సిన్హా వైఖరి.. సీబీఐ వైఖరికి పూర్తి భిన్నంగా ఉందని గ్రోవర్ చెప్పారు. కేసు తుది దశలో ఉండగా, ప్రాసిక్యూషన్ తరఫు సాక్ష్యాల నమోదు దాదాపు పూర్తై దశలో జోక్యం చేసుకునేందుకు సీబీఐ డెరైక్టర్ ప్రయత్నించారన్నారు. కేసుకు సంబంధించిన అన్ని ఫైళ్లను కూలంకషంగా పరిశీలించిన తర్వాత తాను సేకరించిన సమాచారం దిగ్భ్రాం తిని కలిగించేదిగా ఉందని, బహిరంగ కోర్టులో దాన్ని తాను వెల్లడించలేనని ఎస్పీపీ అన్నారు.

న్యాయ శాఖను తప్పుబట్టిన గ్రోవర్

2జీ కేసులో విచారణ ఎదుర్కొంటున్న కొన్ని సంస్థలకు అనుకూలంగా ఉన్న న్యాయ శాఖ అభిప్రాయాన్ని ఎస్పీపీ గ్రోవర్ తప్పుబట్టారు. న్యాయశాఖ పని తీరును ఓ విచారకరమైన కథగా పేర్కొన్నారు. మంత్రి (అప్పటి) ఫైల్ నోట్‌లో పేర్కొన్నదాని ఆధారంగా అలా చేసినట్లు ఓ అధికారి సాక్ష్యం చెప్పారని, అయితే ఆ మంత్రి వెనుక ఉన్న వ్యక్తి ఎవరనేదే ప్రశ్న అన్నారు. ఈ దశలో విచారణ కొత్త మలుపు తీసుకుంది. ఈ కేసులో వాదించవద్దని సీబీఐ న్యాయవాది కె.కె.వేణుగోపాల్‌ను సిన్హా ఆదేశించినట్లు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఆరోపించారు. దీంతో ఇలాంటి ఆదేశాలు ఎవరిచ్చారని కోర్టు ప్రశ్నించింది. ఆ సమయంలో కోర్టు హాల్లోనే ఉన్న సీబీఐ జేడీ అశోక్ తివారీ.. వేణుగోపాల్ సీబీఐ న్యాయవాదిగా కొనసాగుతున్నారని గుర్తుచేస్తూ, తన బాస్‌ను రక్షించేందుకు ఆయన కూడా ప్రయత్నించారన్నారు. దీనిపై కోర్టు  అభ్యంతర ం వ్యక్తం చేసింది. తివారీ తన బాస్‌ను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొంది.
 
సీబీఐ అధికారులపై కోర్టు ఆగ్రహం

కోర్టు హాల్లో సుమారు తొమ్మిది మంది సీనియర్ సీబీఐ అధికారులు ఉండటంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘మీరు డెరైక్టర్ ఏజెంట్లు కాదు.. మీకు ఇక్కడేం పని? కోర్టు గదిని విడిచి వెళ్లి విచారణపై దృష్టిపెట్టండి’’ అని ఆదేశించింది. ఆ తర్వాత.. ప్రశాంత్ భూషణ్‌కు ఉప్పందించిన వేగుగా డీఐజీ ర్యాంకు అధికారి సంతోష్ రస్తోగిని సిన్హాను పేర్కొనడానికి సంబంధించిన మీడియా రిపోర్టులను సీబీఐ న్యాయవాది వేణుగోపాల్ కోర్టు దృష్టికి తెచ్చారు. ఆ ప్రకటనను ఉపసంహరించుకోవాల్సిందిగా ఆయన్ను ఆదేశించాలంటూ కోర్టును కోరారు. సీబీఐ అధికారిని వేగుగా పేర్కొనడానికి సంబంధించిన సాక్ష్యం ఏదైనా ఉంటే ప్రవేశపెట్టాలన్నారు. ప్రశాంత్ భూషణ్ మాట్లాడుతూ ఆ అధికారిని తానెన్నడూ కలవలేదని, మరొక వ్యక్తి తనకు పత్రాలు ఇచ్చారని చెప్పారు. దీంతో కేసు విచారణ సమయంలో ఆ అధికారి పేరును ప్రస్తావించడం తప్పని కోర్టు... సిన్హా తరఫు న్యాయవాదిని ఉద్దేశించి వ్యాఖ్యానించింది. అలాగే సిన్హా నివాసంలోని సందర్శకుల డైరీతో పాటు పలు డాక్యుమెంట్లు అందజేసిన వ్యక్తి పేరును వెల్లడించాల్సిందిగా గతంలో తాము సీపీఐఎల్‌ను ఆదేశిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను ధర్మాసనం ఉపసంహరించుకుంది.
 
కోర్టు ఆదేశాలను శిరసావహిస్తా: సిన్హా

 
న్యూఢిల్లీ: 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం కేసుల దర్యాప్తు నుంచి తప్పుకోవాలంటూ సుప్రీంకోర్టు వెలువరించిన ఆదేశాలను శిరసావహిస్తానని సీబీఐ చీఫ్ రంజిత్‌సిన్హా తెలిపారు. ఈ ఆదేశాలపై రివ్యూ పిటిషన్ దాఖలు చేయబోనన్నారు. ఈ కేసు దర్యాప్తును తాను పక్కదారి పట్టిస్తున్నట్లు ఆరోపించిన న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌కు కీలక పత్రాలను ‘ఇంటి దొంగే’ (సీబీఐ డీఐజీ సంతోష్ రస్తోగీ) ఇచ్చారంటూ సుప్రీంకోర్టుకు తాను చెప్పినట్లు వచ్చిన వార్తలను సిన్హా తోసిపుచ్చారు. తాను ఎవరి పేరునూ ‘ఇంటి దొంగ’గా ప్రస్తావించలేదన్నారు. కోర్టు ఉత్తర్వులు అందుకున్నాక భవిష్యత్తు కార్యాచరణ గురించి ఆలోచిస్తానన్నారు.

నిప్పులేనిదే పొగ రాదు: సీబీఐ మాజీ చీఫ్ జోగిందర్‌సింగ్

2జీ కేసు నుంచి రంజిత్‌సిన్హాను సుప్రీంకోర్టు తప్పించడంపై సీబీఐ మాజీ చీఫ్‌లు విచారం వ్యక్తం చేశారు. అయితే నిప్పు లేనిదే పొగ రాదని.. సిన్హా విశ్వసనీయతపై ఎన్నో ఆరోపణలు ఉన్నాయని సీబీఐ మాజీ డెరైక్టర్ జోగిందర్‌సింగ్ చెప్పారు. ఈ ఆరోపణల్లో పసలేకుంటే సుప్రీంకోర్టు ఆషామాషీగా ఆదేశాలు జారీ చేయదన్నారు. కేసులో స్పష్టత కోసం సీబీఐ చీఫ్ నిందితులను కలవడం తప్పనిసరన్న వాదనను మరో సీబీఐ మాజీ డెరైక్టర్ ఆర్.కె. రాఘవన్ తోసిపుచ్చారు. తాజా పరిణామాల నేపథ్యంలో రంజిత్‌సిన్హా వ్యవహారంపై కేంద్రం తగు రీతిలో స్పందిస్తుందని భావిస్తున్నట్లు మరొక సీబీఐ మాజీ డెరైక్టర్ విజయ్ శంకర్ తెలిపారు.

స్వాగతిస్తున్నాం... కానీ ఉత్తర్వులు గందరగోళం: కాంగ్రెస్

2జీ కేసు నుంచి రంజిత్‌సిన్హాను తప్పించడాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతించింది. అయితే ఇంత కీలక కేసులో మెరుగైన పనితీరు కనబరచని అధికారిని.. ఇతర కేసులు చూసుకోవాలని కోర్టు ఆదేశించడం పరస్పర భిన్న సంకేతాలను ఇస్తోందని అభిప్రాయపడింది. కాగా, సిన్హాను 2జీ కేసు నుంచి తప్పుకోవాలని సుప్రీం ఆదేశించడం సరైనదని లోక్‌సత్తా అధినేత జయప్రకాష్‌నారాయణ్ గురువారం పేర్కొన్నారు.
 
గతంలోనూ పలు మరకలు
 
రంజిత్‌సిన్హా 1974 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. సీబీఐ డెరైక్టర్‌గా బాధ్యతలు స్వీకరించకముందు ఐటీబీపీ డీజీపీగా, ఆర్‌పీఎఫ్ డీజీగా, సీఆర్‌పీఎఫ్ ఐజీగా పనిచేశారు. 1996లో సీబీఐలో డీఐజీగా పనిచేశారు. దాణా కుంభకోణం కేసు దర్యాప్తులో నిందితుడైన ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌యాదవ్‌కు అనుకూలంగా వ్యవహరించారని, ఆ కేసుకు సంబంధించి కోర్టుకు సమర్పించిన నివేదికను మార్చారని తేలడంతో ఆయనను కేసు దర్యాప్తు నుంచి కోర్టు తప్పించింది. 2013, మేలో బొగ్గు కుంభకోణం దర్యాప్తు ముసాయిదా నివేదికను సుప్రీంకు సమర్పించడానికి ముందే.. నాటి న్యాయ మంత్రి అశ్విన్ కుమార్‌కు సిన్హా చూపారని తేలింది. దీంతో కేంద్రప్రభుత్వంపై మండిపడిన సుప్రీంకోర్టు సీబీఐ కేంద్రప్రభుత్వ చెప్పే మాటలే పలికే పంజరంలోని చిలుకలా మారిందని ఆక్షేపించింది. ఆర్పీఎఫ్‌లో డీజీగా పనిచేస్తున్న సమయంలో సిన్హా అవినీతి కార్యకలాపాలపై విజిలెన్స్ కమిషన్‌కు ఫిర్యాదు చేసిన వారిపై కక్ష సాధింపుకు దిగేవారని రైల్వే పోలీస్ సంఘం ఆరోపించింది. ఆ కక్ష సాధింపులో భాగంగానే మహేశ్‌కుమార్ ఫోన్ ట్యాపింగ్‌కు సిన్హా ఆదేశించడం, ఆ క్రమంలోనే రైల్వే శాఖలో ‘క్యాష్ ఫర్ పోస్ట్స్’ కుంభకోణం బయటపడటం విశేషం. రైల్వే మంత్రి పదవి వదిలేసిన తర్వాత కూడా ఆర్పీఎఫ్ కమాండోల భద్రతను మమత బెనర్జీకి కొనసాగించడాన్ని ఆర్పీఎఫ్ డీజీగా సిన్హా అభ్యంతరం వ్యక్తం చేశారు. దాంతో మమత ఆయనను ఐటీబీపీ డీజీగా బదిలీ చేశారు. సిన్హాకు రాజకీయ నేతల్లో లాలు అత్యంత సన్నిహితుడు. ఆర్పీఎఫ్ డీజీగా ఆయనను నియమించేందుకు ఆ పోస్ట్‌ను మూడు నెలల పాటు రైల్వే మంత్రిగా లాలు  ఖాళీగా ఉంచారు.
 
 ‘సీపిల్’ విజయం
 
 2014, సెప్టెంబర్ 2: 2జీ కేసు నిందితులను సీబీఐ డెరైక్టర్ రంజిత్ సిన్హా తన నివాసంలో పలుమార్లు కలిశారని, ఆయనను కేసు దర్యాప్తు నుంచి తొలగించాలని స్వచ్ఛంద సంస్థ ‘సీపిల్(సెంటర్ ఫర్ పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్)’ సుప్రీం ను ఆశ్రయించింది. అందుకు సిన్హా ఇంటి  విజిటర్స్ డైరీ రుజువని పేర్కొంది. సెప్టెంబర్ 8: ‘సీపిల్’ ఆరోపణలు తీవ్రమైనవని, వాటిపై రాతపూర్వకంగా స్పందించాలని సిన్హాకు సుప్రీం ఆదేశాలు. సెప్టెంబర్ 18: సిన్హా ఇంటి సందర్శకుల వివరాలు అందించినవ్యక్తి పేరును వెల్లడించేందుకు సీపిల్ నిరాకరణ. అక్టోబర్ 15: మొత్తం వివాదంపై నివేదిక సమర్పించాలంటూ ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్(ఎస్‌పీపీ) ఆనంద్‌గ్రోవర్‌ను నియమించిన సుప్రీం అక్టోబర్ 16: సీపిల్ ఆరోపణలకు ఎస్‌పీపీ సమర్థన నవంబర్ 18: తాము అందించిన సమాచారం తప్పని తేలితే విచారణకు సిద్ధమని సీపిల్ స్పష్టీకరణ నవంబర్ 19: 2జీ స్కామ్ దర్యాప్తును పర్యవేక్షిస్తున్న సీబీఐ డీఐజీ సంతోశ్ రస్తోగీనే న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌కు కేసు సమాచారం అందించి ఉండొచ్చని కోర్టుకు తెలిపిన సిన్హా. నవంబర్ 20: ‘2జీ’ దర్యాప్తు నుంచి సిన్హాను తప్పిస్తూ సుప్రీంకోర్టు తీర్పు

Advertisement
Advertisement