డబుల్ బెడ్రూం ఇళ్లు ఏమయ్యాయి? | Sakshi
Sakshi News home page

డబుల్ బెడ్రూం ఇళ్లు ఏమయ్యాయి?

Published Thu, May 26 2016 4:45 PM

డబుల్ బెడ్రూం ఇళ్లు ఏమయ్యాయి? - Sakshi

తెలంగాణ ప్రజలకు కేసీఆర్ వరంగా ప్రకటించిన డబుల్ బెడ్‌రూం ఇళ్ల వ్యవహారంపై సర్కారు శ్వేతపత్రం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ పథకం పేరుతో ప్రజల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయని, కానీ రాష్ట్రం ఏర్పడి రెండేళ్లు అయినా, టీఆర్ఎస్ అధికారంలోనే ఉన్నా ఇప్పటికీ దీనిపై తగిన విధాన నిర్ణయం ఏమీ తీసుకోలేదని ఆయన విమర్శించారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోనూ 2015 దసరా రోజున 60వేల ఇళ్లకు శంకుస్థాపనలు చేశారని, వీటిని ఆరు నెలల్లో పూర్తి చేయాల్సి ఉండగా ఇప్పటికి వాటి పరిస్థితి తెలియడంలేదని ఆయన అన్నారు.

జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక.. ఏడాదిలోగా లక్ష ఇళ్లు కార్పొరేషన్ పరిధిలోను, మరో లక్ష ఇళ్లు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోను కడతామని కేసీఆర్ హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. అలా ఇచ్చి నాలుగు నెలలైందని, ఇప్పుడు వాటి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. రాబోయే నాలుగేళ్లలో డబుల్ బెడ్రూం ఇళ్లే తమ ప్రాధాన్యమని మంత్రి కేటీఆర్ కూడా చెప్పారన్నారు. టాటా హౌసింగ్ సంస్థ ఈ ఇళ్లను కట్టేందుకు ఆసక్తి చూపినట్లు ఆయన తెలిపారని, ఆ సంగతి ఏమైందని ప్రశ్నించారు. అసలు మొత్తం ఎన్ని ఇళ్లు కడుతున్నారని, ఎప్పటికి పథకం పూర్తవుతుందని అడిగారు. ఐడీహెచ్ కాలనీలో వాళ్లు జి+2 పద్ధతిలో కట్టారని, ఇప్పుడు ఎలా కడతారని, దానికి ఎంత ఖర్చవుతుందని మర్రి శశిధర్ రెడ్డి నిలదీశారు.

Advertisement
Advertisement