బాల సంస్కార్ | Sakshi
Sakshi News home page

బాల సంస్కార్

Published Sat, Nov 29 2014 1:00 AM

బాల సంస్కార్ - Sakshi

‘సదా మీ సేవలో..’ అంటూ సాక్షి సిటీప్లస్ ఇచ్చిన పిలుపునకు స్వచ్ఛంద సంస్థల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. సిటీ జీన్స్‌లోనే చారిటీ ఉందంటూ.. నగరం వేదికగా తాము నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాల వివరాలను పంపిస్తున్నాయి. సదా మీ సేవలో మేము సైతం అంటూ చేతులు కలిపి... తమ చేతల వివరాలను పంచుకుంటున్నాయి. ఈ వరుసలో ప్రచురితమవుతున్న ఎనిమిదవ కథనమిది...
 
మురికివాడలకు వెళ్లినపుడు మొదట మన చూపు పడేది అక్కడి పిల్లలపైనే. అక్కడి జీవన విధానం వారి భవిష్యత్తుపై ఏ స్థాయి ప్రభావం చూపుతుందో కనిపిస్తుంటుంది. అక్కడి వాతావరణం, మనుషులు, పరిసరాలు, వారి అలవాట్లు... వీటిని మార్చడం అంత సులువు కాదు. కానీ... ఆ మురికివాడల్లోని పిల్లలు, ఆలోచనలు... తద్వారా వారి జీవన విధానాన్ని మార్చగలం. ఇదే సంకల్పంతో గౌరుగారి గంగాధరరెడ్డి ఆ వాడల్లో అడుగుపెట్టారు. ‘శ్రీ శారదాధామం’ ఆధ్వర్యంలో ‘బాల సంస్కార కేంద్రాలు’ స్థాపించి రేపటి పౌరుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతున్నారు. రాజేంద్రనగర్ మండలం పరిధిలో 21 పాఠశాలల్లో ‘బాల సంస్కార కేంద్రాలు’ ఉన్నాయి. శ్రీశారదాధామం హైస్కూలు పరిధిలో నిర్వహించే ఈ కేంద్రాల్లో ప్రతిరోజూ యోగా, మెడిటేషన్, కరాటే
 
వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ‘శ్రీశారదాధామం పాఠశాల నెలకొల్పి ఇరవై ఏళ్లు దాటింది. బాల సంస్కార  కేంద్రాలు నెలకొల్పి నాలుగేళ్లయింది. వెనకపడ్డ గ్రామాల్లోని పాఠశాలల్లో మా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. ఏదో పాఠశాలకు వస్తున్నామంటే వస్తున్నాం అన్నట్టు కాకుండా... పిల్లల మనస్తత్వం, పాఠశాలకు పంపితే పనైపోతుందనుకునే తల్లిదండ్రుల ఆలోచనా తీరుని మార్చడాన్నే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు కదిలాం. తొలుత పాఠశాలలకు వెళ్లి మా సేవా కార్యక్రమాల గురించి చెప్పి, కొంత సమయం తీసుకున్నాం. ఆ సమయాల్లో మా టీం వెళ్లి వివిధ అంశాలను బోధిస్తుంది’ అని చెప్పారు గంగాధరరెడ్డి.
 
విద్యార్థుల సాయంతో...


21 సెంటర్లలో పేద విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస పాఠాలు, దేశభక్తి గీతాలు, కథలు నేర్పడానికి కాలేజీ విద్యార్థులు ముందుకొస్తున్నారు. కొందరు గృహిణులు కూడా బోధకులుగా చేరారు. ‘మా లక్ష్యాలు ఎంత గొప్పవైనా... వాటిని అమలు చేసేవారు ఉండాలి కదా. దాని కోసం మా ప్రాంతంలో ఉండే కాలేజీ విద్యార్థులు, కొందరు చదువుకున్న గృహిణులు ముందుకొచ్చారు.

దాంతో మా పరిధిలో ఉన్న అన్ని పాఠశాలల్లో ఉదయం పిల్లలకు యోగా, మెడిటేషన్ వంటివి క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నాం. సాయంత్రం డ్రిల్, కరాటే వంటి శిక్షణా తరగతులు ఉంటున్నాయి’ అని చెప్పారు గంగాధర్‌రెడ్డి. వీటితో పాటు బాల సంస్కార కేంద్రాల నిర్వాహకులు  నెలరోజులకోసారి మురికివాడల్లోని పిల్లలకు పాజిటివ్ హోమియోకేర్ ద్వారా ఉచితంగా మందులు కూడా ఇస్తున్నారు.
 
తల్లిదండ్రులకు కూడా...

చాలీచాలని సంపాదన వల్ల పిల్లల చదువులు మధ్యలోనే ఆగిపోయే జీవితాలను చూస్తూనే ఉంటాం. వీరి పరిస్థితే ఇలా ఉంటే సంపాదించిన నాలుగు డబ్బులను వ్యసనాలకు ఖర్చు పెట్టే పేద తల్లిదండ్రుల కడుపున పుట్టిన చిన్నారుల సంగతి ఎలా ఉంటుందో ఊహించగలం. దీని కోసం బాల సంస్కార కేంద్రం నిర్వాహకులు ఏడాదికి రెండుసార్లు మురికివాడల్లో ఉండే విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రత్యేక కౌన్సెలింగ్‌లు నిర్వహిస్తున్నారు. చదువుకున్న పిల్లల భవిష్యత్తును వారి ముందుంచుతూ వారి భవిష్యత్తు కోసం ఎలా కష్టపడాలి.. ఏ విధంగా నడుచుకోవాలో బోధిస్తోంది.

‘ఈ  కార్యక్రమం వల్ల చాలామంది తల్లిదండ్రుల్లో మార్పుని చూశాం. ముఖ్యంగా ఆడపిల్లల చదువును అర్ధంతరంగా ఆపేయడం తగ్గింది. అలాగే పదో తరగతి తర్వాత పిల్లల్ని కాలేజీకి పంపేవారి శాతం కూడా పెరిగింది’ అంటారు గంగాధర్. ఆర్థిక సాయంకన్నా అక్షర సాయం గొప్పదని నమ్మిన శ్రీ శారదాధామం పాఠశాల వ్యవస్థాపకుల లక్ష్యాలను ముందుకు తీసుకెళుతున్న బాల సంస్కార కేంద్రాల ఆశయం నెరవేరాలని మనసారా కోరుకుందాం.
 
 ప్రజెంటేషన్: భువనేశ్వరి
 bhuvanakalidindi@gmail.com
 

Advertisement
Advertisement