
పూర్తి మెజారిటీ సాధిస్తాం: వైఎస్ జగన్
సీమాంధ్రలో తమ పార్టీ పూర్తి మెజారిటీ సాధిస్తుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు.
పులివెందుల: సీమాంధ్రలో తమ పార్టీ పూర్తి మెజారిటీ సాధిస్తుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ప్రజలు ఏకపక్షంగా తీర్పు ఇవ్వబోతున్నారని చెప్పారు. సీమాంధ్రలో వచ్చే ప్రజా తీర్పు కెరటంలా ఉంటుందని అన్నారు. సీమాంధ్రలో ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. ఓటేసిన ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. నాలుగున్నరేళ్లుగా తనతో పాటు నడిచిన వారికి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పారు. దేవుడి దయ ప్రజల ఆశీస్సులు మెండుగా ఉన్నాయని అన్నారు.
ఈ సారి భారీ పోలింగ్ బాగా జరిగిందన్నారు. 75 శాతానికి పైగా ఓటింగ్ జరగడం హర్షణీయమన్నారు. తెలుగు జాతి పౌరుషం నిలబెట్టుకోవాలని, అలాంటివారినే గెలిపించాలని తాను కోరినట్టు చెప్పారు. రాష్ట్రాన్ని కాంగ్రెస్ దారుణంగా విభజించిందని గుర్తు చేశారు. బీజేపీ, టీడీపీ కూడా విభజనను సమర్థించాయన్నారు. సీమాంధ్రకు అన్ని రకాలుగా అన్యాయం జరిగిందన్నారు. ఏ విషయంలోనూ కేంద్రానికి స్పష్టత లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాలను అసలు పట్టించుకోలేదని దుయ్యబట్టారు. దీన్ని సీమాంధ్ర ప్రజలు కూడా గుర్తించారని అందుకే ఏకపక్షంగా తీర్పునివ్వబోతున్నారని జగన్ చెప్పారు. కేంద్రమే దిగివచ్చేలా ప్రజలు తీర్పు ఉంటుందన్నారు.
జమ్మలమడుగులో ఎన్నికల నియమావళిని టీడీపీ అభ్యర్థి రామసుబ్బారెడ్డి అతిక్రమించారని, దాన్ని ప్రశ్నించినందుకే తమ వారిపై దాడి చేశారని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తనపై ఈనాడు ఎంతో దుష్ప్రచారం చేసిందని, ఎందరో కక్ష కట్టి వేధించారన్నారు. అందరితో పోరాటం చేశానని చెప్పారు. ఇంత మందితో పోరాటం చేశానంటే తనకు దేవుడు, ప్రజలు అండగా నిలిచారన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించే వారితోనే తమ పొత్తు ఉంటుందని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.