నీ చాలెంజ్‌కి నేను సిద్దం | Sakshi
Sakshi News home page

నీ చాలెంజ్‌కి నేను సిద్దం

Published Thu, Aug 25 2016 10:57 PM

నీ చాలెంజ్‌కి నేను సిద్దం

  •    యరపతినేనికి పీఆర్కే సవాల్‌ 
  • మాచర్ల: ‘నేను నీ ఛాలెంజ్‌ స్వీకరిస్తున్నా. నాకు దమ్ముంది.. నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడి వస్తా.. నీ సొంతూరులో వేదిక పెట్టినా వస్తా.. నువ్వు సీబీఐ చేత నువ్వు చేసిన అక్రమాలపై విచారణకు సిద్ధమవుతూ లేఖ రాయ్‌.. తప్పు చేయనప్పుడు భయమెందుకు? రాష్ట్ర ప్రభుత్వ అధికారులైతే నువ్వు మేనేజ్‌ చేస్తావ్‌.. సీబీఐ విచారణకు సిద్ధమని లేఖ రాసి సిద్ధమవ్వు.. నేను వారికి ఆధారాలు అందిస్తా.. నువ్వు సీబీఐ విచారణకు సిద్ధం కాలేకపోతే వచ్చే నెల ఎనిమిదో తేదీన ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశంలో నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలు తీసుకురా.. నేను వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అనుమతితో ఎన్నికల్లో పోటీ చేస్తా.. ఇదే నా ఛాలెంజ్‌. దీనికి సిద్ధమౌతావా.. లేకుంటే నీ అక్రమాలు ఒప్పుకొని 840గా మారతావో నువ్వే తేల్చుకో..’ అంటూ వైఎస్సార్‌సీపీ విప్, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకష్ణారెడ్డి గురజాల ఎమ్మెల్యే యరపతినేనికి సవాల్‌ విసిరారు.
     
    గుంటూరు జిల్లా మాచర్లలో నియోజకవర్గ కార్యకర్తల సమావేశాన్ని గుంటూరు రోడ్డులోని మహాలక్ష్మి కోల్డ్‌స్టోరేజ్‌లో నిర్వహించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘అధికారం చేపట్టినప్పటి నుంచి అన్ని వర్గాల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడుతూ సొంత పార్టీ వ్యక్తులనూ వదలని నీ గురించి వాస్తవాలు చెబితే.. దాని నుంచి తప్పించుకునేందుకు నానా తంటాలు పడుతూ వ్యక్తిగత విమర్శలతో దిగజారుడు రాజకీయాలను నిర్వహిస్తున్న ఘనత నీది’ అంటూ యరపతినేనిపై ధ్వజమెత్తారు. ‘ఎందుకు మీ పార్టీ నిర్వహించిన సర్వేలోనే 2019 ఎన్నికల్లో ఓడిపోయే వారిలో నువ్వే మొదటి స్థానంలో ఉన్నావు? నీ జాతకాన్ని మీ అధినాయకుడిని అడిగితే చెప్తాడు. ఈ నెల 29న నడికుడిలో.. లేక నీ సొంతూరు మంచికల్లులో ప్రజా వేదిక ఏర్పాటుచేసి సీబీఐ విచారణకు సిద్ధమవ్వు.. నేను ఆధారాలు అందిస్తా.. నీకు చేతకాకపోతే నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలు తెప్పించు.. మీరిచ్చిన హామీలు, జనాన్ని మోసగించిన తీరు, నువ్వు చేసిన అక్రమాలు అన్నీ చెప్పి నేను గురజాల నియోజకవర్గంలో పోటీ చేస్తా.. ఎవరి దమ్ము ఎంతో ఇక్కడే తెలిసిపోతుంది’ అని ఎమ్మెల్యే పీఆర్కే అన్నారు. 
     
    పుష్కర పనులపై మాట మార్చుతున్నారు...
    ‘నిన్నటి వరకు రూ.150 కోట్లతో పుష్కర ఘాట్లు నిర్మించి పనులు చేశామన్నారు. తీరా మేము అవినీతి జరిగిందని చెబుతుంటే లేదు లేదు రూ.75 కోట్లతోనే పుష్కర ఘాట్లు నిర్మించామని, మిగతా నిధులతో త్వరలో అభివద్ధి పనులు చేపడతామని మాటమార్చి చెబుతున్నారు.. ప్రజల సొమ్ముపై పెత్తనం చేస్తూ అన్ని వర్గాలను మోసగించే నీకు గురజాల నియోజకవర్గ ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు..’ అని పీఆర్కే హెచ్చరించారు. ‘పోలీసులను అడ్డంపెట్టుకుని రాజకీయాలు చేస్తూ నువ్వు అన్ని వర్గాలను దోచుకునే పనిలో ముందంజలో ఉన్నావన్న విషయం నీ పార్టీ వారే చెబుతున్నారు.
     
    అక్రమ మైనింగ్, మద్యం షాపుల వద్ద నగదు వసూళ్లు, పొందుగల వద్ద అనధికారిక పార్కింగ్‌ పేరుతో, ఇసుక మాఫియా, రేషన్‌ బియ్యంతో పాటు అనేక అక్రమాలు చేస్తూ చివరికి సొంత పార్టీ వారి వద్ద కూడా మామూళ్లు వసూలు చేస్తున్న విషయాన్ని మీ పార్టీ వారే చెప్పే పరిస్థితి ఉంది.’ అని తెలిపారు. ‘ఇన్ని అక్రమాలు చేస్తూ ధనార్జనే ధ్యేయంగా బతుకుతున్న నువ్వు వ్యక్తిగత విమర్శలతో నాపై బురద చల్లాలని చూసినా సాధించేదేమీ లేదు.. నీ చెంచాగాళ్లు పోలీసుల అండ ఉన్నంతసేపే మాట్లాడతారు.. జనబలమున్న మేము ఎక్కడైనా ఎప్పుడైనా ఆధారాలు సహా నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం.
     
    లేనిపోని ఆరోపణలతో బతుకుతున్న నీకు జనం బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు’ అని చెప్పారు. సీబీఐ విచారణకు సిద్ధపడతావా లేక ఉప్ప ఎన్నికలకు సిద్ధమవుతావా తేల్చుకో అని యరపతినేనికి సవాల్‌ చేశారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిన్నెల్లి వెంకటరామిరెడ్డి, మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌ తాడి వెంకటేశ్వరరెడ్డి, పురపాలక సంఘ ఫ్లోర్‌లీడర్‌ బోయ రఘురామిరెడ్డి, పార్టీ యువజన విభాగం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మార్తాల ఉమామహేశ్వరరెడ్డి, రెంటచింతల జెడ్పీటీసీ సభ్యుడు నవులూరి భాస్కరరెడ్డి, మాచర్ల ఎంపీపీ ఓరుగంటి జైపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement