
'చంద్రబాబు హోదా అమ్మేశారు.. అందరం పోరాడదాం': వైఎస్ జగన్
ప్రత్యేక హోదాను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమ్మేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు.
హైదరాబాద్: తన కేసుల నుంచి బయటపడేందుకు ప్రత్యేక హోదాను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమ్మేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఐదు కోట్ల ప్రజలు, నిరుద్యోగులు, విద్యార్థుల ఆశలపై నీళ్లు చల్లారని ఆవేదన వ్యక్తం చేశారు. శంకుస్థాపనకు వచ్చిన ప్రధాని ప్రత్యేక హోదాపై ప్రకటన చేస్తారని ప్రజలంతా ఆశించారని, మోదీ వస్తారు, చంద్రబాబు ఒత్తిడి తెస్తారని అనుకున్నారని అన్నారు. మోదీ వచ్చారు, పార్లమెంటు ప్రాంగణం నుంచి మట్టిని తెచ్చారు, ఢిల్లీ పక్కన ప్రవహించే యమునా నది నుంచి కూడా నీళ్లు తెచ్చారని, గుర్తుచేశారు.
కానీ హోదా విషయంపై రాష్ట్రాన్ని విడగొడుతూ ఇచ్చిన మాట మాత్రం మరిచిపోయారని తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ నోట వెంట వస్తుందనుకున్న ప్రకటన రాలేదని, తన కేసుల నుంచి బయటపడేందుకు ప్రత్యేక హోదాను చంద్రబాబు నాయుడు అమ్మేశారని చెప్పారు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు తెలపాలని వైఎస్ జగన్ సూచించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆవేదనను చంద్రబాబుకు, మోదీకి ఈ నిరసనల ద్వారా తెలియజేయాలని కోరారు. ప్రత్యేక హోదా విషయంలో మనమంతా కలిసి పనిచేద్దామని రాష్ట్ర ప్రజలకు సూచించారు. ప్రత్యేక హోదాపై నోరు విప్పని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసనగానే రేపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియజేయాలని అన్నారు.
అమరావతి శంకుస్థాపనకు వచ్చిన నరేంద్రమోదీ ప్రత్యేక హోదాపై ప్రకటన చేస్తారని అందరూ ఆశించారు. కానీ ఆయన అసలు ఆ ఊసే ఎత్తకుండా వెళ్లిపోవడం అందరికీ దిగ్బ్రాంతిని కలిగించింది. ప్రత్యేక హోదాపై తన ప్రాణాన్ని కూడా లెక్కచేయకుండా దాదాపు ఏడురోజులపాటు వైఎస్ జగన్ నిరవధిక నిరాహార దీక్ష కూడా చేసిన విషయం తెలిసిందే. అయినా కేంద్రంలో ఏమాత్రం చలనం రాకపోగా.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా కనీసం మోదీకి ఆ విషయం గుర్తు చేయకపోవడం పల్ల ఆవేదనను వ్యక్తం చేస్తూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం సాయంత్రం ప్రత్యేక హోదా కోసం మరో పోరుకు అందరం సిద్ధం కావాలంటూ ఓ లేఖ విడుదల చేశారు.