'కొత్త అసెంబ్లీలోనైనా మాట్లాడే అవకాశం ఇవ్వండి'

'కొత్త అసెంబ్లీలోనైనా మాట్లాడే అవకాశం ఇవ్వండి' - Sakshi


ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నో సమస్యలున్నాయని, కొత్త అసెంబ్లీలోనైనా సభను సజావుగా నడిపించి తమకు మాట్లాడే అవకాశం కల్పించాలని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ వైఎస్ఆర్ సీపీ ప్రధాన కార్యాలయంలో శనివారం మీడియాతో ఆయన మాట్లాడారు. సీఎం చంద్రబాబునాయుడు మూడేళ్ల పాలనలో విపక్షానికి మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం దారుణమన్నారు. ఇప్పటివరకూ ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ సీపీ నేతలు ప్రస్తావించిన ఏ అంశం పైనా సభలో అధికార పక్షం క్లారిటీ ఇవ్వలేదని పేర్కొన్నారు. కేవలం మేం చెప్పిందే మీరు వినండి అనేలా అధికారపక్షం ప్రవర్తిస్తుందని విమర్శించారు. కొత్త అసెంబ్లీలోనైనా సాంప్రదాయాన్ని పాటించాలని, సభను సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలన్నారు. అధికార పక్షం చేసే తప్పులను ఎత్తిచూపడమే విపక్షంగా తమ బాధ్యత అని చెప్పారు.



ఏపీలో తాగునీటి సమస్యలు, నిరుద్యోగ భృతి, మహిళలు, ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు లాంటి ఎన్నో సమస్యలున్నాయని తెలిపారు. సాగునీటి ప్రాజెక్టుల పేరిట ప్రభుత్వం చేసిన అక్రమాలు, పార్టీ ఫిరాయింపులు అంశం, స్విస్ ఛాలెంజ్ విధానం, రాజధాని కోసం చేపట్టిన భూ సేకరణ, సమీకరణపై ప్రశ్నించాల్సి ఉందన్నారు. అయితే హైదరాబాద్ లో జరిగిన సమావేశాలలో కనీసం ఒక్క రోజు.. ఒక్క సెషన్ కూడా సభ సజావుగా సాగనివ్వలేదని, ప్రతిపక్షాలకు సమస్యలపై మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. పల్లెలకు పల్లెలు వలసలు వెళ్లిపోతున్నా ఏపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. వ్యవస్థలను సర్వనాశనం చేస్తూ అధికారులపై టీడీపీ నిందలు మోపుతోందని విమర్శించారు. కొంతమంది అధికారులు ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఏపీ శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు వెలగపూడిలో మార్చి 6వ తేదీన ప్రారంభం కానున్నాయి. మార్చి 13న ఆర్థిక మంత్రి యనమల బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top