ఓవర్‌ టు చెన్నై | Sakshi
Sakshi News home page

ఓవర్‌ టు చెన్నై

Published Mon, Dec 17 2018 9:37 AM

Thief Karri Satish Case Transfer to Chennai - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: కరుడుగట్టిన అంతరాష్ట్ర దొంగ కర్రి సతీష్‌ను తమిళనాడు పోలీసులు తీసుకెళ్లారు. ఇతడితో పాటు ప్రధాన అనుచరుడైన నరేంద్రనూ ప్రిజనర్స్‌ ట్రాన్సిట్‌ వారెంట్‌పై చెన్నై తరలించారు. హైదరాబాద్‌ సహా మొత్తం మూడు రాష్ట్రాల్లో 56 చోరీలు చేసిన ఈ ఘరానా దొంగలను సిటీ నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు గత నెలలో అరెస్టు చేసిన విషయం విదితమే. రాష్ట్రాల్లోని ఖరీదైన ప్రాంతాలను టార్గెట్‌గా చేసుకుని చేసిన ఏడు దొంగతనాల్లో ఈ ముఠా రూ.1.05 కోట్ల సొత్తు ఎత్తుకుపోయింది. ఓ ఇంట్లోకి ప్రవేశించినప్పుడు కేవలం ప్లాటినం, బంగారు, వజ్రాలు పొదిగిన ఆభరణాలు మాత్రమే ఎత్తుకుపోవడం వీరి నైజం. ‘సతీష్‌ అండ్‌ కో’ చెన్నైలోని నాలుగు చోట్ల దొంగతనాలు చేసినట్లు తేలింది. విశాఖపట్నంలోని కొత్తగాజువాకకు చెందిన కర్రి సతీష్‌ 13 ఏళ్లుగా చోరీలకు పాల్పడుతున్నాడు. ఇతడిపై సిటీ పోలీసులు 2016లో పీడీ యాక్ట్‌ ప్రయోగించి చంచల్‌గూడ జైలుకు పంపారు. ఈ నేపథ్యంలో అప్పటికే జైల్లో ఉన్న నల్లగొండ వాసి నున్సావత్‌ నరేంద్ర నాయక్‌ సహా మరొకరితో కలిసి ముఠా కట్టాడు. ఈ ఏడాది మార్చ్‌లో జైలు నుంచి విడుదలైన ఈ గ్యాంగ్‌ వరుసపెట్టి చోరీలు చేసింది. హైదరాబాద్‌తో పాటు చెన్నై, బెంగళూరు, ఏపీల్లోనూ పంజా విసిరింది. 

గూగుల్‌ మ్యాప్‌లో ‘గుర్తుపెట్టుకుని’...
సతీష్, నరేంద్ర ఖరీదైన ప్రాంతాలు, ప్రముఖులనే టార్గెట్‌గా చేసుకుని రెచ్చిపోయారు. జూన్‌లో తమిళనాడుకు వెళ్లిన వీరు లాడ్జిలో మకాం వేశారు. స్థానికంగా అద్దెకు తీసుకున్న బైక్‌పై పగటిపూట సంచరిస్తూ అక్కడి అనువైన ప్రాంతాల్లో తాళం వేసున్న ఇళ్లను గుర్తించారు. రాత్రి చోరీ చేయడానికి వచ్చినప్పుడు ఆ ఇంటిని మర్చిపోకుండా ఉండేందుకు దాని లోకేషన్‌ను గూగుల్‌ మ్యాప్‌ ద్వారా ఒకరి నుంచి మరొకరి సెల్‌కు షేర్‌ చేసుకునే వారు. దీని సాయంతో రాత్రి వేళ మళ్లీ ఇంటి వద్దకు వెళ్లి తమ ‘పని’ పూర్తి చేసుకునే వారు. ఈ పంథాలో మొత్తం నాలుగు చోరీలు చేశారు. చెన్నై, నుంగంబాకం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నివసించే డాక్టర్‌ కౌసిఖ్‌ ఇంట్లో పంజా విసిరి 146.6 గ్రాముల ప్లాటినం నగలు ఎత్తుకుపోయింది. ఆ తర్వాత తైనంపేట్, ముంబాలమ్, మైలాపూర్‌ల్లోనూ మూడు ఇళ్లల్లో దొంగతనాలు చేసింది. చెన్నైలో చోరీ చేసిన ప్లాటినం నగలను అమ్మడానికి హైదరాబాద్‌తో పాటు కడప, పొద్దుటూరుల్లోనూ ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమైంది. చివ రకు ముంబైలో అమ్ముదామనే ప్రయత్నాల్లో అక్కడకు పట్టుకుని వెళ్తూ సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఉత్తర మండల టాస్క్‌ఫోర్స్‌ బృందానికి సొత్తుతో సహా చిక్కేసింది. అప్పట్లో వీరి నుంచి టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు రూ.1.05 కోట్ల విలువైన 1712 గ్రాముల బరువున్న ప్లాటినం, బంగారం, వజ్రా లు పొదిగిన ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. 

చెన్నై పోలీసులకు సమాచారం...
సతీష్, నరేంద్రల విచారణ నేపథ్యంలోనే వారిపై ఉన్న కేసులు, నాన్‌–బెయిలబుల్‌ వారెంట్ల నేపథ్యంలో సత్తిబాబు ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు పోలీసులకు వాంటెడ్‌గా ఉన్నారని తేలింది. దీంతో వెంటనే సిటీ పోలీసులు ఆయా అధికారులకు సమాచారం ఇచ్చారు. చెన్నై నుంచి వచ్చిన ప్రత్యేక బృందం గురువారం వీరిద్దరినీ పీటీ వారెంట్‌పై అక్కడకు తీసుకువెళ్లింది. మొత్తం నాలుగు కేసుల్లోనూ అరెస్టుల పరంపర పూర్తి చేసి సోమవారం నాటికి తిరిగి హైదరాబాద్‌ తీసుకురావాలని భావిస్తోంది. కేవలం సీసీ కెమెరాలు లేని ఇళ్లను మాత్రమే టార్గెట్‌ చేసే ఈ గ్యాంగ్‌ నేరం స్థలంలో తమ వేలిముద్రలు సైతం దొరక్కుండా గ్లౌజులు ధరిస్తుంది. డాక్టర్‌ కౌశిఖ్‌ ఇంటి సమీపంలో ఉన్న సీసీ కెమెరాల్లో వీరి కదలికలు స్పష్టంగా రికార్డు అయ్యాయి. సతీష్‌ ముఠా బెంగళూరులోని ఇందిరానగర్‌లో ఉంటున్న కర్ణాటక రిటైర్డ్‌ డీజీ శ్రీనివాసులు అల్లుడు ప్రభు ఇంట్లోనూ చోరీ చేసింది. అక్కడి సదాశివనగర్‌లో ఉంటున్న చిత్తూరు మాజీ ఎంపీ, టీటీడీ మాజీ ఛైర్మన్‌ ఆదికేశవులు నాయుడు ఇంట్లో చోరీకి యత్నించారు. ఈ నేపథ్యంలో అక్కడి పోలీసులూ ఈ గ్యాంగ్‌ను పీటీ వారెంట్లపై తరలించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. 

Advertisement
Advertisement