22 నెలలు! | Sakshi
Sakshi News home page

22 నెలలు!

Published Wed, Oct 28 2015 12:21 AM

22 నెలలు! - Sakshi

ఎస్తేరు అనూహ్య హత్య కేసు కొలిక్కి..
టాక్సీ డ్రైవర్ చంద్రభానే దోషి
ముంబై కోర్టు తీర్పుతో బందరులో కలకలం

 
మచిలీపట్నం : బందరుకు చెందిన  సాఫ్ట్‌వేర్ ఇంజినీరు అనూహ్య (23) హత్యకేసులో చిక్కుముడి వీడింది. 22 నెలల అనంతరం ఈ కేసులో ముంబై కోర్టు తీర్పు ఇవ్వడం చర్చనీయాంశమైంది. ఇప్పటివరకు నిందితుడిగా అనుమానిస్తున్న టాక్సీ డ్రైవర్ చంద్రభాన్‌నే దోషిగా తేల్చారు. బుధవారం అతడికి శిక్షను ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసు వివరాల్లోకి వెళితే.. మచిలీపట్నానికి చెందిన శింగవరపు జోనతాన్ ప్రసాద్ కుమార్తె  ఎస్తేరు అనూహ్య ముంబైలోని టీసీఎస్ కార్యాలయంలో ఇంజినీరు. ఆమె 2013 డిసెంబరులో క్రిస్మస్ వేడుకలు జరుపుకొనేందుకు బందరు వచ్చారు. 2014 జనవరి నాలుగున విజయవాడ రైల్వేస్టేషన్ నుంచి ముంబై బయలుదేరి వెళ్లారు. అక్కడి ఎల్‌టీటీ స్టేషన్‌లో రైలు దిగిన ఆమెను ట్యాక్సీ డ్రైవర్ చంద్రభాన్ మాయమాటలు చెప్పి వెంట తీసుకువెళ్లాడు. అప్పటి నుంచి ఆమె ఆచూకీ లభించలేదు. జనవరి 16వ తేదీన బాండూస్‌లోని ఈస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ రహదారి సమీపంలో అనూహ్య మృతదేహం లభ్యమైంది. పోస్టుమార్టం అనంతరం 18వ తేదీన మృతదేహాన్ని మచిలీపట్నం తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించారు.  ఆ తర్వాత అనూహ్య హత్యకేసులో నిందితులను శిక్షించాలని కోరుతూ పెద్దఎత్తున ఉద్యమాలు జరిగిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో 22 నెలల తర్వాత ఈ హత్యకేసులో చంద్రభాన్‌ను ముంబై కోర్టు దోషిగా నిర్ధారించింది.  

శిక్ష.. భయం గొలిపేలా ఉండాలి
ముంబై కోర్టు తీర్పు నేపథ్యంలో అనూహ్య తండ్రి జోనతాన్ ప్రసాద్ మంగళవారం బందరులోని తన నివాసంలో విలేకరులతో  మాట్లాడారు. దేశవ్యాప్తంగా ఈ సంఘటన సంచలనం కలిగించడం వల్లే పోలీసులు స్పందించారని తెలిపారు.  22 నెలల్లో దోషిని నిర్ధారించడం న్యాయ వ్యవస్థపై నమ్మకాన్ని పెంచిందన్నారు. నిందితుడు చంద్రభాన్‌కు కోర్టు విధించే శిక్ష నేరప్రవృత్తి ఉన్న వారికి భయం గొలిపేలా ఉండాలని సూచించారు. మీడియా, ప్రజాప్రతినిధుల సహకారం వల్లే తన కుమార్తె హత్య కేసు ఓ కొలిక్కి వచ్చిందన్నారు. ముంబైకి చెందిన జోన్-7 డీసీపీ వెంకట్‌పాటిల్  దర్యాప్తు అంశాలను తనకు ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చేవారని వివరించారు.    
 - జోనతాన్ ప్రసాద్, అనూహ్య తండ్రి
 

Advertisement
Advertisement