వద్దన్నా వినరే...! | Sakshi
Sakshi News home page

వద్దన్నా వినరే...!

Published Tue, Jul 28 2015 1:05 AM

వద్దన్నా వినరే...! - Sakshi

 చిన్న తప్పులే మన కొంప ముంచుతాయి. ఏముందిలే..ఏమౌతుందిలే అనుకుంటే పప్పులో కాలేసినట్లే..ప్రతి తప్పుకు శిక్షలున్నాయి. అవి అమలు చేయడానికి చట్టాలున్నాయి. అయితే గోటితో పోయేదాన్ని గొడ్డలిదాకా తెచ్చుకోవద్దన్న సత్యం అందరూ గ్రహించడం లేదు.  క్షేత్రస్థాయిలో చట్టాలు సక్రమంగా అమలు చేయకపోవడం వల్ల కూడా పౌరుల్లో ఉదాశీనత ఏర్పడుతోంది. దీనికి ఈ కింది చట్ట ఉల్లంఘనలే నిదర్శనాలు. ఈ విధానం నుంచి నగరవాసుల్లో మార్పు రావాలని, అప్పుడే నగర జీవనం సాఫీగా సాగుతుందనే విషయమై అవగాహనకు ఈ కథనం.
-విజయనగరం క్రైం
 
 మోటారు వాహన చట్టం నిబంధనలు పాటించని వాహనాలపై 2014లో 1,22,066 కేసులు నమోదయ్యాయి. ఇందులో 25 శాతం వరకు డ్రైవింగ్ లెసైన్సు లేని వాహనాలున్నాయి.
 
 మద్యం తాగి వాహనాలను నడిపిన కేసులు ఏటా విజయనగరం ట్రాఫిక్ పోలీసు స్టేషన్‌లో 220, జిల్లా వ్యాప్తంగా ఏటా వెయ్యి వరకు నమోదవుతున్నాయి.
 
 ఈ ఏడాది జనవరి 19న బాబామెట్ట రింగురోడ్డు పెట్రోల్‌బంక్ వద్ద మద్యం తాగిన డ్రైవర్ లారీ నడిపి ద్విచక్ర వాహనాన్ని, ఆటోను ఢీకొనడంతో నలుగురు మృతి చెందారు. 2014 జూన్ 19న విజయనగరం ఆర్టీఓ కార్యాలయంలో సమీపంలో వేకువజామున ఒడిశా నుంచి వస్తున్న బొలెరో వాహనం ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. బొలెరో డ్రైవరు మద్యం తాగి వాహనం నడపడం వల్ల  ప్రమాదం జరిగింది.
 
 ఎన్‌సీఎస్ థియేటర్ సమీపంలో ఒక ద్విచక్రవాహన చోదకుడు సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ ఢీకొనడంతో పాదచారికి తీవ్రగాయాలయ్యాయి.
 
 విజయనగరం పట్టణంలో ప్లాస్టిక్ నిషేధం పాటించని 8 దుకాణాలపై మున్సిపల్ అధికారులు కేసు నమోదు చేశారు
 
 వాల్టా ఉల్టా
 వాల్టా చట్టాన్ని అక్రమార్కులు ఉల్లంఘిస్తున్నారు. నగరంలో ఎక్కడిబడితే అక్కడ ఇష్టానుసారంగా అనుమతులు లేకుండా భూగర్భ జలాలు తోడేస్తున్నారు. బోర్లు వేస్తున్నారు. జిల్లాల్లో వాగులు, వంకలు, నదులు, పొలాల్లో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. ఫలితంగా భూగర్భజలాలు అడుగంటి పోతున్నాయి. పచ్చని చెట్లను సైతం బుగ్గిపాలు చేస్తున్నారు. అయితే అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదు. అందుకే అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. కానీ పట్టించుకుంటే జైలే గతన్న విషయం తెలుసుకోవాలి.
 
 ఇదీ రూలు..
 సొంత ఇంట్లో బోరు వేయాలన్నా, పొలంలో తవ్వకాలు జరపాలన్నా, అధికారుల అనుమతి తీసుకోవాలి. అతిక్రమిస్తే వాల్టా చట్టం ప్రకారం శిక్ష కఠినంగా ఉంటుంది. అనుమతి లేకుండా ఇసుక తవ్వితే రూ.5వేలు నుంచి రూ.లక్ష వరకు జరిమానా ఉంటుంది. దీంతో వాహనాల సీజ్, జైలుశిక్ష పడే అవకాశాలూ ఉన్నాయి. కానీ దురదృషమేమిటంటే ఈ చట్టం అమలు క్షేత్రస్థాయిలో అంతంత మాత్రంగానే ఉంది.
 
 రైల్వే రక్షణ...
 రైలు వస్తుంది...గేటు వేస్తారు. అది కళ్లముందు వస్తూనే ఉంటుంది కానీ వెంటనే దాటవచ్చులే అన్న ధీమాతో ముందుకు కదులుతారు. క్షణంలో ప్రమాదానికి గురవుతుంటారు. అయినా ఇంకా ఎందరిలోనో మార్పు రావడం లేదు. ఒక్కక్షణం ఆగితే వచ్చే నష్టమేమిటి..? రైలు పట్టాలు అడ్డంగా దాటడం, గేటు వేసినా కింది నుంచి వెళ్లడం, ద్విచక్రవాహనాలు తీసుకెళ్లడం, ప్లాట్‌ఫారం టి క్కెట్ లేకుండా స్టేషన్‌లోకి ప్రవేశించడం చట్టపరంగా రైల్వే ఉల్లంఘనల కిందికి వస్తాయి.
 
 అతిక్రమిస్తే..
 రైల్వే రక్షణ చట్టం ప్రకారం ప్లాట్‌ఫారం టిక్కెట్ లేకుండా స్టేషన్‌లో తిరిగితే సెక్షన 137 ప్రకారం రూ.200 నుంచి రూ.వెయ్యి వరకు జరిమానా, ఏడాది వరకు జైలుశిక్ష విధించవచ్చు. ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఉన్నా పట్టాలు దాటితే సెక్షన్ 147, రైల్వే లెవల్ దాటేప్పుడు నిబంధనలు ఉల్లంఘిస్తే  సెక్షన్ 161 ప్రకారం మూడేళ్ల వరకు జైలు శిక్ష పడవచ్చు.
 
 జరభద్రం
 ద్విచక్రవాహనంపై వెళ్లే వ్యక్తి హెల్మెట్ ధరించాలి. దీని వల్ల రెండు ఉపయోగాలున్నాయి. ప్రమాదం జరిగినప్పుడు మనకు ప్రాణానికి రక్షణగా ఉంటుంది. రెండోది సెల్‌ఫోన్ మోగినప్పుడు ఆగి హెల్మెట్ తీసి మాట్లాడాల్సి ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరు హెల్మెట్ తప్పక ధరించాలి. సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ ద్విచక్రవాహనంపై ప్రయాణం, హెల్మెట్ ధరించకుండా వాహనం నడపడం నేరం. అందేకాదు మద్యం తాగి వాహనం నడపరాదు. ఇలాంటి తప్పులన్నీ ఎంవీ యాక్టు కిందికి వస్తాయి. అయితే పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేస్తున్నా ఫలితం ఉండడం లేదు. వాహనచోదకల్లో మార్పు మాత్రం కనిపించడం లేదు.
 
 శిక్ష తెలుసా..
 ఎంవీ చట్టాన్ని (మోటార్ వెహికల్ యాక్ట్) అతిక్రమిస్తే రూ.1000 నుంచి ఆపైన ఎంతైనా జరిమానా విధించవచ్చు.  పరిస్థితిని బట్టి శిక్ష పడవచ్చు కూడా. హెల్మెట్ లేకపోతే మొదటిసారి రూ.100, రెండోసారి రూ.500 విధిస్తారు. ఆపై పట్టుపడితే రూ. 1000 వరకు జరిమానా విధించే అవకాశం ఉంది.
 
 పొగతాగడం నేరం
 పొగతాగడంవల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. అంతేకాదండోయ్ పొగతాగే వారి కంటే వారు విడిచిపెట్టిన పొగను పీల్చే వారికి శ్వాసకోశవ్యాధులు వచ్చే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. అందుకని ప్రభుత్వం ఆర్టీసీ బస్టాండ్ రైల్వే స్టేషన్, పాఠశాలలు, జనసంచార ప్రదేశాలు, బహిరంగ ప్రదేశాల్లో పొగ తాగడం నిషేధించింది. అయినా స్మోకర్లు వెరవడం లేదు.
 
 ఉల్లంఘస్తే..
 ప్రజా పోలీసు యాక్టు మేరకు స్మోకింగ్ జోన్లు ఉన్నాయి. వాటి ని మాత్రమే ఉపయోగించుకోవాలి. అతిక్రమించిన వారికి రూ. 200 వరకు జరిమానా విధించవచ్చు.
 
 ప్లాస్టిక్ భూతం
 ప్లాస్టిక్ కాలుష్యం నగరానికి ప్రధాన ముప్పుగా మారింది. ప్లాస్టిక్ ఎక్కడా వాడవద్దని చెబుతూ వా డితే రూ.500 ఫైన్ కట్టించుకుంటునే ఉన్నారు. కానీ సాధారణ కూరగాయలకు, వివిధ రకాల సరకులకు బజారుకు వెళ్లే ప్రతి ఒక్కరూ ఇప్పటికీ ప్లాస్టిక్ కవరునే వాడుతున్నారు.
 
 శిక్ష ఇదీ..
 ప్రజారోగ్య చట్టం కింద 20 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ సంచులు వాడడాన్ని ప్ర భుత్వం  నిషేధించింది. వాడి తే రూ. 100 నుంచి రూ.2 వేల వరకు జరిమా నా విధించే అవకాశం ఉంది. వీటిని మా ర్కెట్లో విక్రయిం చే వ్యాపారులు, వినియోగదారులు కూడా శిక్షార్హులే.
 

Advertisement
Advertisement