బాబు సభలో రైతు ఆత్మహత్యాయత్నం | Sakshi
Sakshi News home page

బాబు సభలో రైతు ఆత్మహత్యాయత్నం

Published Thu, May 7 2015 2:02 AM

బాబు సభలో రైతు ఆత్మహత్యాయత్నం - Sakshi

  • ‘నీరు- చెట్టు’లో కలకలం
  • సాక్షి, పార్వతీపురం:  రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తున్న సభలో ఓ రైతు క్రిమి సంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ‘నీరు-చెట్టు’ కార్యక్రమంలో భాగంగా బుధవారం సీఎం చంద్రబాబు విజయనగరం జిల్లా పార్వతీపురం సమీపంలోని నర్సిపురం వద్ద బహిరంగ సభలో మాట్లాడారు. అదే సమయంలో ఆ సభలో సీతానగరం మండలం చినభోగిలి గ్రామానికి చెందిన గుణుపూరు రాము అనే  రైతు క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం విజయనగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఆత్మహత్యాయత్నానికి దోహదపడిన కారణాలను కప్పిపుచ్చేందుకు గ్రామ టీడీపీ నాయకులు, కార్యకర్తలు జాగ్రత్తవహించారు. పలువురు గ్రామస్తులు అందించిన వివరాలిలా ఉన్నాయి..
     
     డ్వాక్రా రుణం భారమై..
     గుణుపూరు రాము టీడీపీ ఆవిర్భావం నుంచీ చురుకైన కార్యకర్తగా పనిచేస్తున్నారు. గ్రామంలో కుట్టు పనిచేసుకొంటూ.. తనకున్న 60 సెంట్ల పొలంలో సాగు చేస్తూకుటుంబ జీవనం సాగిస్తున్నాడు. రాము భార్య శారద తీసుకున్న డ్వాక్రా రుణాన్ని పూర్తిగా చెల్లిస్తే తర్వాత మాఫీ వర్తిస్తుందన్న మహిళా సంఘాల హామీతో ప్రైవేటుగా అప్పు చేసి బ్యాంకు రుణం తీర్చాడు. ఈ నేపథ్యంలో రుణం మాఫీ కాక, ప్రైవేటు అప్పు భారమై.. దాన్ని తీర్చలేక ఆర్థికంగా ఇబ్బందులు పడ్డాడు. మెరిట్ జాబితాలో ఉన్న ఆయన భార్యకు అంగన్వాడీ ఆయా ఉద్యోగమూ రాలేదు. బీసీ రుణాల కోసం ఎంపీడీఓ, డీఆర్‌డీఏ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేసినా అధికారులు స్పందించలేదు. కనీసం కుట్టుయంత్రం కొనుగోలుకు రుణం కోసం ప్రయత్నించినా ఫలితందక్కలేదు.


     భూమిని అమ్ముకోలేక..: అప్పులు తీర్చేందుకు తన తల్లికి చెందిన 1.20 ఎకరాల పొలాన్ని ఇటీవల రాము అమ్మకానికి పెట్టాడు. భూమి కొలతల్లో, రికార్డుల్లో తేడాలుండడంతో కొనుగోలుకు ఎవరూ ముం దుకు రాలేదు. వాటిని సరిచేసుకునేందుకు తహసీల్దారు కార్యాలయం చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. మంగళవారం తహసీల్దారు కార్యాలయానికి వెళ్లి వచ్చిన రాము తనకు ఇదే విషయాన్ని చెప్పాడని తల్లి సోములమ్మ విలేకరులకు తెలిపింది.  
     
    చుట్టుముట్టిన ఆర్థిక ఇబ్బందులు...
    ఎటు చూసినా ప్రతికూల పరిస్థితులు ఎదురవడం, ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడం, తన 60 సెంట్ల పొలంలో వరి సరిగా పండకపోవడం అతడిని కలిచివేసింది. చేస్తున్న కుట్టుపని ఆదుకోలేకపోయింది. చివరికి పిల్లల స్కూల్ ఫీజు కూడా చెల్లించలేకపోయాడు. పార్టీ ఆదుకోలేకపోయింది. ఇవన్నీ ఆయన్ని తీవ్ర మనస్థాపానికి గురిచేశాయి.  
     
    లేఖ రాసి.. బాబు సభ వైపు విసిరి..

    సభలో చంద్రబాబు మాట్లాడుతుండగా అక్క డే ఓ లేఖ రాసాడని సమీపంలో ఉన్న గ్రామస్తులు తెలిపారు. ఆయన సమస్యలన్నీ లేఖలో ప్రస్తావించి చంద్రబాబుై వెపు విసిరి క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని చెప్పారు. ఆ లేఖను అక్కడున్న పోలీసులు స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. కాగా, లేఖ విషయమై స్థానిక సీఐ చంద్రశేఖర్‌ను ‘సాక్షి’ ప్రతినిధి సంప్రదించగా.. తమకు ఎలాంటి లేఖ అందలేదన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement