హుజురాబాద్‌: ప్రతి గడప తొక్కుదాం.. ఒక్క ఓటు వదలొద్దు

Published on Thu, 09/30/2021 - 08:33

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: హుజూరాబాద్‌ ఉప ఎన్నిక షెడ్యూల్‌ విడుదలైన నేపథ్యంలో ఒక్కసారిగా కరీంనగర్‌ జిల్లా రాజకీయాలు వేడెక్కాయి. అక్టోబరు 1వ తేదీన నోటిఫికేషన్‌ విడుదల కానుండడంతో ప్రచార వ్యూహాలపై ప్రధాన పార్టీలైన టీఆర్‌ఎస్‌- బీజేపీ కసరత్తు ప్రారంభించాయి. ప్రతీ ఓటరును నేరుగా కలిసేలా పక్కాగా ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. కోవిడ్‌ నిబంధనల నేపథ్యంలో రోడ్‌షోలు, ర్యాలీలకు కేంద్ర ఎన్నికల సంం అనుమతించలేదు. ఫంక్షన్‌హాళ్లలో పెట్టుకునే సభలకు 200 మంది, ఆరుబయట నిర్వహించే సభకు 1000 మందిని మాత్రమే అధికారులు అనుమతిస్తారు.
చదవండి: జీ‘హుజుర్‌’ ఎవరికో.. వారిద్దరి మధ్యే తీవ్ర పోటీ

కానీ.. ఇంటింటి ప్రచారానికి ఈసీ షరతులతో అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. అందుకే.. ప్రధాన పార్టీలు ఇంటింటి ప్రచారానికి మొగ్గుచూపుతున్నాయి. కోవిడ్‌ నిబంధనలు తప్పకుండా పాటించాల్సిన వేళ భారీ బహిరంగ సభలు, ఇండోర్‌ సభల కంటే ఇంటింటి ప్రచారం ప్రభావవంతంగా పనిచేస్తుందన్న నిర్ణయానికి పార్టీలు వచ్చాయి. అందుకే.. ఒకటో తేదీ నుంచి  ప్రతీ గడపకు వెళ్లేలా మండల, గ్రామ, వార్డు ఇన్‌చార్జీలను సన్నద్ధం చేస్తున్నారు. మొత్తం 28 రోజులపాటు ప్రచారం చేసుకునే వీలుంది. నియోజకవర్గంలో ఐదు మండలాలు, రెండు మున్సిపాలిటీలలోని ప్రతీ ఇంటికి కనీసం వారంలో రెండుసార్లు అయినా వెళ్లాలని, ప్రతీ ఓటరును కలవాలని నిర్ణయానికి వచ్చాయి. 
చదవండి: పత్తి ఏరాల్సిన చోట.. చేనులో చేపల వేట

రెండుసార్లు సీఎం సభ..!
ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైన అనంతరం టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రచారాన్ని హోరెత్తించనుంది. ఇప్పటికే పార్టీలో ట్రబుల్‌ షూటర్‌గా పేరొందిన మంత్రి హరీశ్‌రావు ఇన్‌చార్జి బాధ్యతలు తీసుకున్నారు. దాదాపు 16 వారాలుగా హరీశ్‌రావు హుజూరాబాద్‌లోనే మకాం వేశారు. ఆయనకు తోడుగా మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, నారదాసు లక్ష్మణరావు, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, సతీశ్‌బాబు, బాల్క సుమన్, కోరుకంటి చందర్‌తోపాటు స్థానిక మున్సిపల్‌ చైర్మన్లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, మండల-గ్రామ-వార్డు కార్యకర్తలతో మెగా బృందమే పనిచేస్తోంది.

సంఖ్యాపరంగా, ప్రచారం పరంగా టీఆర్‌ఎస్‌ చాలా దూకుడుగా ఉంది. ఆగస్టు 11వ తేదీన అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ను ప్రకటించి అదేరోజు నుంచి అభ్యర్థితో ప్రచారం ప్రారంభించింది. ఆగస్టు 16వ తేదీన హుజూ రాబాద్‌ మండలం శాలపల్లి సభలో సీఎం కేసీఆర్‌ సభతో పార్టీకి కొత్త ఉత్సాహం వచ్చింది. అందుకే.. అక్టోబర్‌లో రెండుసార్లు ముఖ్యమంత్రి సభకు ప్రణాళికలు రచిస్తున్నారు. అక్టోబర్‌ 2వ వారంలో తొలి, అక్టోబర్‌ 25 తేదీకి కాస్త అటుఇటుగా రెండో సభ ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి.

బీజేపీ గేరు మారుస్తుందా?
టీఆర్‌ఎస్‌ నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఈటల రాజేందర్‌ ఒకప్పుడు పార్టీలో అత్యంత కీలకమైన వ్యక్తుల్లో ఒకరు. కానీ.. ఈ వేసవిలో చోటుచేసుకున్న అనూహ్య పరిణామాల నేపథ్యంలో మంత్రి, ఎమ్మెల్యే, పార్టీ పదవులకు రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ వెంటనే బీజేపీలో చేరారు. ఆయన పార్టీలో చేరినప్పటికీ పార్టీ విధానాల కంటే వ్యక్తిగత చరిష్మాతోనే ముందుకు సాగే ప్రయత్నం చేస్తున్నారు. ఆయనకు మద్దతుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ అర్వింద్, ఎమ్మెల్యే రఘునందన్‌రావు, మాజీ ఎంపీలు వివేక్, జితేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ ప్రచారం చేశారు. ఇటీవల నిర్మల్‌ సభలోనూ కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తనమాటలతో ఈటల రాజేందర్‌ను ఆకాశానికెత్తేశారు.

ఏ రకంగా చూసినా టీఆర్‌ఎస్‌కు బీజేపీ ఢీ అంటే ఢీ అన్న స్థాయిలో పోరాడుతోంది. అయితే.. టీఆర్‌ఎస్‌ ఎలాగైనా ఈ స్థానాన్ని గెలవాలవాలని భారీబలగంతో సర్వశక్తులు ఒడ్డుతోంది. అదే సమయంలో జాతీయపార్టీ అయిన బీజేపీ నాయకత్వం ఆ స్థాయిలో మాత్రం నాయకులను రంగంలోకి ఇంకా దించడం లేదు. ప్రస్తుతం రాజేందర్‌ అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. సీఎం కేసీఆర్‌ విధానాలు, ప్రభుత్వం ఇతర మంత్రులను టార్గెట్‌ చేస్తూ ముందుకుసాగుతున్నారు. నోటిఫికేషన్‌ రాకపోయి ఉంటే కేంద్రమంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్, కర్ణాటక మంత్రి అరవింద్‌ లింబావలితో నియోజకవర్గంలో ప్రచారం చేయించాలని జిల్లా నాయకత్వం అనుకుంది. కానీ.. నోటిఫికేషన్‌తో వారి పర్యటన రద్దయింది. దీంతో బీజేపీ ప్రచారం స్పీడులో గేరు ఎప్పుడు మారుతుందన్న ఆసక్తి మొదలైంది.

అక్టోబరు 20న కరీంనగర్‌లో సభ
హుజూరాబాద్‌లో పోటీ చేయబోయే అభ్యర్థి విషయంలో కాంగ్రెస్‌ పార్టీ నేడు నిర్ణయానికి రానున్నట్లు సమాచారం. ఓ వైపు టీఆర్‌ఎస్‌, బీజేపీ నువ్వా-నేనా అన్నట్లుగా తలపడుతూ ప్రచారంలో దూసుకుపోతున్నాయి. మరోవైపు కాంగ్రెస్‌ ఇంతవరకూ ప్రచార రేసులో కాలు మోపనే లేదు. అభ్యర్థి ఎంపికలో కాంగ్రెస్‌ పార్టీకి ఇంకా బాలారిష్టాలు తప్పడం లేదు. సెప్టెంబరు మొదటివారంలో కొంత హడావిడి చేసినా ఆ తరువాత చల్లబడ్డారు.

అక్టోబరు 1వ తేదీన ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ రానున్న నేపథ్యంలో ఒకరోజు ముందుగానే అభ్యర్థిని ప్రకటించే యోచనలో కాంగ్రెస్‌ అధిష్టానం ఉందని సమాచారం. మరోవైపు రాష్ట్రంలో అక్టోబరు 2 నుంచి డిసెంబరు 9వ వరకు వివిధ సమస్యలపై పోరాటానికి కాంగ్రెస్‌ పిలుపునిచ్చింది. విద్యార్థి, నిరుద్యోగ జంగ్‌ రన్‌ పేరుతో ఉమ్మడి జిల్లాల వర్సిటీల్లో భారీ ఆందోళనలకు వ్యూహం రచించింది. ఇందులో భాగంగా అక్టోబరు 20వ తేదీన కరీంనగర్‌ శాతవాహన వర్సిటీలో విద్యార్థులు, నిరుద్యోగులతో ఈ నిరసన నిర్వహించనున్నట్లు తెలిసింది.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ