amp pages | Sakshi

నేనేం క్షుద్ర పూజలు చేయలేదు..

Published on Sun, 01/31/2021 - 10:17

‘‘ప్రెసిడెంట్‌ గారూ... ప్రెసిడెంట్‌ గారూ...’’ ఆయాసపడుతూ పిలిచింది యాభైయేళ్ళ లలిత.
‘‘ఏమైంది? ఎందుకిలా కట్ట కట్టుకొచ్చారంతా?’’ సైన్యంలా దండెత్తినట్లు వచ్చిన కాలనీ స్త్రీలను అడిగాడు ఆ కాలనీ ప్రసిడెంట్‌ ప్రసాదరావు.
‘‘అంత సింపుల్‌గా ఏమైందంటారేంటండి? మీకు చీమైనా కుట్టినట్లు లేదు...’’ అంది గృహిణి నీలిమ.
‘‘ఈయన పట్టించుకోడని నేనెప్పుడో అన్నా... మీరు ఇంటేగా!’’ గుంపుల్లోంచి అన్నారెవరో.
‘‘దేని గురించో చెప్తేనే కదా తెలిసేది’’ తన్నుకొస్తున్న ఆవేశాన్ని తమాయించుకుని అడిగాడు ప్రసాదరావు.
‘‘దిష్టి తీసిన నిమ్మకాయల్ని ఎవడో ఇంట్లో విసిరేస్తున్నాడని చెప్తే పట్టించుకున్నారా? ఇవాళేం జరిగిందో తెలుసా...’’అంటూ భద్రకాళి అయిపోయింది లలిత.
‘‘ఏం జరిగిందండి?’’ విస్మయం చెందాడు ప్రసాదరావు.
‘‘మా మందార చెట్టు వాడిపోయిందండీ... మా పిల్లలకు జ్వరం కూడా వచ్చింది...’’ అంటూ భోరుమంది.

నిమ్మకాయను నాలుగు భాగాలుగా కోసి అందులో పసుపు, కుంకుమ, ఉప్పు, ఎండు మిరపకాయలను కలిపి ఎవరో రోజూ కొన్ని బాల్కనీల్లో విసిరేసి వెళ్తున్నారు. లలిత ఈ విషయాన్ని కాలనీ ప్రెసిడెంట్‌ ప్రసాదరావు కు ఫిర్యాదు చేసింది. అదేమంత సమస్య కాదనుకొని పట్టించుకోలేదతను.
‘‘ఏ మూల నిమ్మకాయలు విసిరేశాడోనని పొద్దున్నే లేవాలంటే భయం వేస్తుంది’’ కన్నీళ్లు తెచ్చుకుందో బామ్మ.
‘‘ఏ మంత్రాలు చదువుతున్నాడో, క్షుద్ర పూజలు చేస్తున్నాడో తెలీక వణుకొచ్చేస్తుందనుకోండి. మా పని మనిషైతే రాలేనని మొండికేసింది.’’ తన బాధ చెప్పుకుంది ఒకామె.
‘‘ఇదిట్టా తేలే వ్యవహారం కాదుగాని పోలీస్‌ కంప్లయింట్‌ ఇద్దాం...’’ అన్న మాటకు కంగుతిన్నాడు ప్రసాదరావు. 
‘‘మన మోడల్‌ కాలనీకో సంఘం ఉందని మర్చిపోయారా? ఏ సమస్యొచ్చినా విచారణ జరిపి, తగిన చర్యలు తీసుకుంటామన్న సంగతి తెలుసుకదా?’’ అంటూ గుర్తు చేశాడు.
‘‘అవన్నీ మాటలకేనండి... ఇవాళ మా ఇంట్లో చెట్టు వాడిపోయింది, పిల్లలకి జ్వరం వచ్చింది. రేపు ఇంకెవరన్న ఇంట్లో ఏదన్నా జరిగితే ఎవరు బాధ్యులు?’’ పైట కొంగును బొడ్డులో దోపుకుంటూ కోప్పడింది లలిత.

ఇంతలో, ‘‘ఏవండీ...’’ అనే గావుకేక వినిపించడంతో ఇంట్లోకి పరిగెత్తాడు ప్రసాదరావు. ఏమైందోనని ఆడవాళ్ళంతా అతను వెళ్ళినవైపే అయోమయంగా చూస్తుండిపోయారు. ఈశాన్యం దిక్కు చూస్తూ నిలబడిన భార్యవైపు దృష్టి సారించాడు. అక్కడ దిష్టి తీసిన దండ ఒకటి పడుండడాన్ని చూసి భీతిల్లాడు.
దేవుని పటానికి పెట్టిన పువ్వు కింద పడినప్పుడో, పటం కొద్దిగా పగిలినప్పుడో, దిష్టి తీయడానికి వేరుగా పెట్టిన నిమ్మకాయల్ని తన భార్యకు తెలీకుండా వాడినప్పుడో అతని భార్య కీడుని శంకించిన సంఘటనలు అతని స్మృతిపథంలో మెదిలాయి. వాళ్ళ ప్రమేయం లేకుండా దిష్టి తీసిన నిమ్మకాయలు ఇంట్లో కనిపించడంతో ఈ సమస్యెంత జటిలమైందో అర్థమైందతనికి.
‘‘నేనిలా అవుతుందనుకోలేదు. మన సమస్యను మనమే పరిష్కరించు కుందాం.’’ స్థిర నిర్ణయానికొస్తూ చెప్పాడు.
‘‘ఆడెవడో కచ్చితంగా పట్టుకుని తీరాలి. ఏం చేద్దామో చెప్పండి...’’ అంది నీలిమ.
‘‘ఉదయమే నాలుగు గంటలకల్లా లేచి పేపర్‌ బాయ్స్‌పై కన్నేసి ఉంచుదాం. ఇంటి అద్దెల కోసమంటూ తిరిగే వాళ్ళ మీద నిఘా పెడదాం. రోజూ మన కాలనీ స్ట్రీట్‌ కెమెరాల డేటా చూద్దాం. అప్పుడు వాడెవడో తెలిసిపోతుంది.’’ ఎవరెవరు ఏమేమి చేయాలో ప్రసాదరావు పురమాయించడంతో మహిళలంతా అక్కణ్ణుంచి నిష్క్రమించారు.

వాడెవడో పట్టుకోవాలని, వాడెందుకు ఈ పని చేస్తున్నాడో తేల్చేయ్యాలన్న కసితో కాలనీ స్త్రీలు వారం రోజులపాటు కాపలా డ్యూటీ చేశారు. వారి నిరీక్షణకు తెర దించుతూ అతను సుబ్బారెడ్డిగారి స్ట్రీట్‌ కెమెరాలో చిక్కాడు. అతన్ని గుర్తుపట్టిన సుబ్బారెడ్డి గారు, ఎవరింట్లో అద్దెకు ఉంటాడో సమాచారం ఇచ్చారు. అతని రెక్క పట్టుకుని కమ్యూనిటీ భవనం వద్దకు తీసుకురావడంతోఆత్రుతగా కమ్యూనిటీ భవనం దగ్గరకు జనం చేరుకున్నారు.
హరీష్‌ అనే పాతికేళ్ల కుర్రాడు ఈ పని చేస్తున్నాడంటే కాలనీ వాసులెవ్వరికీ నమ్మబుద్ధి కాలేదు. అతని వెనక ఎవరో ఉండి చేయిస్తున్నారనే అనుమానం మొగ్గ తొడిగింది. 
నిమ్మకాయలు విసురుతున్న దృశ్యాలను అతనికి చూపించారు. వాటి వంక చూసి నవ్వాడు హరీష్‌. అతనెందుకు నవ్వాడో అర్థంకాక, ‘‘దొంగ సచ్చినోడా! నిమ్మకాయలు విసురుతావా?’’ అంటూ లెంపకాయ వేసింది లలిత.
‘‘నీ పాడె కట్ట! కుక్కలు నీ పీనుగెత్తుకెళ్ళ! నాశనమైపోతావురా...’’ అంటూ శాపనార్థాలు పెట్టింది ఒకామె.
ఆవేశపడొద్దని వాళ్లని శాంతపరిచిన ప్రసాదరావు, ‘‘అందరూ ఎంత కోపంగా ఉన్నారో చూశావుగా... నేను ‘ఊ’ అంటే వీళ్లందరూ నిన్ను కొట్టి చంపేస్తారు. చెప్పు, ఎవరు చేయిస్తున్నారు? ఎందుకు చేయిస్తున్నారు?’’ అని బెదిరించాడు.
‘‘ఎవ్వరూ చేయించలేదండి! నేనే చేశానండి!’’ బెదరకుండా నిర్భయంగా చెప్పాడు హరీష్‌.
‘‘చేతబడి ఏమైనా చేస్తున్నావా? లేక క్షుద్ర పూజలు చేస్తున్నావా? నిజం చెప్పు... ఈ కాలనీ వాళ్లేం చేశారు?’’ ద్వేషంతో సాధించలేనిది ప్రేమతోనే సాధించగలమని భుజంపై చేయి వేసి, ప్రేమగా హరీష్‌ కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు సుబ్బారెడ్డి.
‘‘మీరందరూ చేస్తే తప్పు లేదుకాని నేను చేస్తే తప్పొచ్చిందా?’’ హరీష్‌ మాటలు వాళ్ళను ఆశ్చర్యపోయేలా చేశాయి.
‘‘అంటే...’’ అర్థంకాక అడిగాడు సుబ్బారెడ్డి.
‘‘ఏదన్నా శుభకార్యం జరిగినా, పండుగొచ్చినా, కారు కొన్నా, బైక్‌ కొన్నా, హాస్పిటల్‌ నుంచి తిరిగొచ్చినా ఎందుకు గుమ్మడి కాయల్ని పగలగొడతారు? పసుపు, కుంకుమ కలిపిన నిమ్మకాయల దండను బయటెందుకు పారేస్తారు?’’ప్రశ్నించాడుహరీష్‌.
‘‘దిష్టి తీయడానికలా చేస్తారు... ఆ మాత్రం తెలీదా?’’ అన్నాడు సీనియర్‌ సిటిజన్‌ నారాయణ. 
‘‘ఎందుకు తీస్తారు తాతగారు?’’ చేతులు కట్టుకుని అడిగాడు హరీష్‌.
‘‘ఎందుకు తీయడమేంటిరా... చెడు జరక్కూడదని, పాపిష్టి కళ్లు మన మీద పడకూడదని, అంతా మంచే జరగాలని చేస్తారు. నీకెవ్వరూ చేయలేదా ఏంటి?’’ కఠినంగా స్పందించాడు నారాయణ.
‘‘నేను చేసిందీ అదే కదండీ! నాకు చెడు జరగకూడదని దిష్టి తీసుకున్నాను.’’ వినయంగా అన్నాడు హరీష్‌.
‘‘ఒరేయ్‌ వెధవా! నీ దిష్టి మీ ఇంట్లో తీసుకో... అంతేకాని నిమ్మకాయలు విసురుతావా? నువ్వు చేసే క్షుద్ర పూజలకు మాఇంట్లో మందార చెట్టు వాడిపోయిందిరా...’’ అంటూ హరీష్‌ జుట్టు పట్టుకున్నాడు లలిత భర్త సూర్యం. 

‘‘నేనేం క్షుద్ర పూజలు చేయలేదు. నీళ్లు లేకే వాడిపోయిందది.’’ విడిపించుకునే ప్రయత్నం చేశాడు హరీష్‌. 
‘‘సూర్యం గారూ! మీరాగండి! వాడి మాటల వెనకేదో ఆంతర్యం ఉంది. చూడు హరీష్‌... నా కొడుకూ నీయంతే ఉంటాడు. వాడిలాగే చేస్తే నేనెంతో బాధపడతాను. మనం చేసిన పనికి కన్నవాళ్ళను దోషుల్ని చేస్తుంది సమాజం. ఇలా ఎందుకు చేస్తున్నావో చెప్పు హరీష్‌...’’ సూర్యం బందీ నుంచి అతన్ని విడిపించి ప్రేమగా అడిగాడు ప్రసాదరావు. ఉత్కంఠగా చూడసాగారు జనం. హరీష్‌ నోరు విప్పాడు.
‘‘ఈ కాలనీలో రెండేళ్ల నుంచి ఉంటున్నా సార్‌. హైదరాబాదుకు రాగానే చిన్న ప్రైవేటు కంపెనీలో జాయిన్‌ అయ్యాను. జీతాలు సరిగ్గా ఇవ్వడం లేదని సంవత్సరం తర్వాత మానేశాను. ప్రభుత్వ ఉద్యోగం మా అమ్మ కల! అందుకనే దాచుకున్న జీతం డబ్బులతో పరీక్షలకు సిద్ధమవుతున్నాను. కోచింగు కోసమని వీధిగుండా వెళ్ళేటప్పుడు దిష్టి తీసిన దండలు కాళ్లకు అడ్డంగా తగిలేవి. నాకెందుకొచ్చిందని మరో వీధిగుండా వెళ్ళేవాడిని. ఏ వీధిగుండా వెళ్లినా రోజూ ఇలానే ఉండేది.
మొన్న పండక్కయితే ప్రతి ఇంటిముందు, షాపుముందు బోల్డన్ని గుమ్మడికాయలు నేలకేసి కొట్టి ఉన్నాయి. అందరి ఇళ్లల్లోని కార్లు నిమ్మకాయాల్ని తొక్కేశాయి. రోడ్డును రెండుపక్కలా వాటి చెత్తతో నింపేశారు. అంటే మీ ఇళ్లల్లో ఉండే దిష్టేమో బయటికి పోవాలి. మీరు మాత్రం హ్యాపీగా ఉండాలి. బయటోడు ఏమైపోయినా ఫర్వాలేదు, అంతేగా...’’ అన్న హరీష్‌ మాటలకు కొంతమంది భుజాలు తడుముకున్నారు.

‘‘తర్వాతి రోజైనా వాటిని డ్రైనేజీలోగాని, పబ్లిక్‌ డస్ట్‌బిన్‌లోగాని వేస్తారా? లేదే! మున్సిపాలిటి వాళ్లొచ్చి తీసేంత వరకు ఎవ్వరికీ పట్టదు. అవి మీ ఇంట్లో కనిపిస్తే భయపడిపోతున్నారే... నాలాగా రోడ్డు మీద తిరిగేవాళ్లెంత భయపడాలి? మీ చెడు అంతా బయటోళ్లకు అంటుకుపోవాలి. ఇవేం తెలీనట్లు మీరు కార్లలో తిరుగుతారు!’’ చుట్టూ చూశాడు హరీష్‌.
జనం గుసగుసలాడుకోసాగారు. ‘నిజమే కదా’ అనికొందరు,‘ఈ విషయం ఆలోచించదగినదే’ అని కొందరు అనుకోవడంతో వాతావరణమంతా అతనికి అనుకూలంగా మారింది.
‘‘సంవత్సరం నుంచి గవర్నమెంట్‌ జాబ్‌ కోసం ట్రై చేస్తున్నా సార్‌. సెలెక్ట్‌ కావడం లేదు. నా నెత్తిమీద ఏదో దరిద్రం తిష్ట వేసుకుని కూర్చొంది. ఆ దరిద్రాన్ని తరిమేయ్యాలని, నాకు మంచి గవర్నమెంట్‌ జాబ్‌ రావాలని రోజూ దిష్టి తీసుకుంటున్నా సార్‌’’ అతనెందుకలా చేస్తున్నాడో వివరించాడు హరీష్‌.
సమాజాన్ని పీడించే సమస్య అందరిళ్లల్లో జరుగుతున్నప్పుడు ఎవ్వరూ నోరు మెదపరు. ఏదో ఒక సందర్భంలో దిష్టి తీసి గుమ్మడికాయల్ని పగలకొట్టడమో, నిమ్మకాయల్ని తొక్కించడమూ చేసిన వాళ్లే కావడంతో వాదించడానికి ధైర్యం చేయలేదెవరూ...
హరీష్‌ చెప్పింది విన్నాక, ‘‘చూడు హరీష్‌! నీకు నీవు మీ ఇంటిముందు దిష్టి తీసుకో! ఎవ్వరూ కాదనరు. ఎప్పుడో ఒకసారి దిష్టి తీసుకుంటారుకాని ఎవరూ రోజూ తీసుకోరు. ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు ఇంకోసారి చేశావంటే కటకటాల వెనక్కి వెళ్తావ్, గుర్తుంచుకో!’’ అంటూ హెచ్చరించాడు ప్రసాదరావు. 
‘‘మీకింకా అర్థంకాలేదు సార్‌! నేను దిష్టి తీసుకుని, ఆ నిమ్మకాయల్ని మీ ఇళ్లల్లో వేయడం లేద్సార్‌. ఎవరింటి ముందు వాళ్లు దిష్టి తీసి పడేసిన వాటినే మళ్లీ వాళ్ల ఇంట్లోకే విసిరేస్తున్నాను. అదృష్టమైనా, దురదృష్టమైనా ఎవరిది వారిదే కదా సార్‌!’’ అసలు రహస్యం చెప్పడంతో అందరూ మిన్నుకుండిపోయారు. 
వాళ్ళ ఇంట్లో తీసిన దిష్టే మళ్లీ వాళ్లింట్లోకి వస్తుందనేసరికి తమ గతాన్ని తడుముకున్నారు. కొందరిలో పశ్చాత్తాప భావన గోచరించి అతనిని పనిని అభినందించారు.
‘‘నువ్వు చెప్పెంతవరకూ నాకూ తట్టలేదు. ఇంత ధైర్యానికెలా ఒడిగట్టావ్‌?’’ అడిగాడు సీనియర్‌ సిటిజన్‌ నారాయణ.
‘‘తాతయ్యగారూ! నేనే డైరెక్ట్‌గా చెప్తే ఎవ్వరూ నా మాట వినరు. తిట్టి పంపించేస్తారు. అందుకే ఇలా చేయాల్సి వచ్చింది. అందరూ నన్ను క్షమించండి. కాని నేను చెప్పింది మాత్రం ఆలోచించండి...’’ చేతులు రెండూ జోడిస్తూ అభ్యర్థించాడు హరీష్‌. 

విషయమంతా బహిర్గతం కావడంతో, ‘‘హరీష్‌ చెప్పిన దాంట్లోనూ నిజముంది. చిన్న వాడైనా చాలా చక్కగా చెప్పాడు. ఇప్పుడేం చేద్దాం చెప్పండి!’’ కాలనీవాసుల అభిప్రాయాన్ని అడిగాడు కాలనీ ప్రెసిడెంట్‌ ప్రసాదరావు. 
తమ తప్పును ఎవరైనా వేలెత్తి చూపితే భుజబలం చూపించడం మానవ నైజం! అదే మానవుడు, సమాజంవైపు వేలెత్తి చూపితే మౌనమే సమాధానమవుతుంది. ‘తెలిసో తెలియకో చేస్తున్న పనిని తప్పుగా పసిగట్టిన హరీష్‌ మాటలను అనుసరించాలా? లేక తమ అభిమతాల్నే నేరవేర్చుకోవాలా?’ అనేది చాలామంది తేల్చుకోలేకపోయారు.
‘‘మన నమ్మకాలను వదలొద్దు. మూఢనమ్మకాలను వదిలేద్దాం. ఏమంటారు?’’ హరీష్‌కి సపోర్ట్‌ చేశాడు నారాయణ.
‘‘ఈరోజు నుంచి ఎవరికున్న పరిధిలలో వారు పూజలూ, శుభకార్యాలు చేసుకుందాం. విశాలమైన మన వీధుల్ని అపవిత్రం చేయకుండా ఉందాం.’’ అంటూ ముందుకొచ్చాడు సుబ్బారెడ్డి.
‘‘దిష్టి తీసుకున్నాక వాటిని మన ఇంటి ఆవరణలోనే ఓ మూలాన చిన్న గొయ్యి తవ్వి అందులో వేసుకుందాం. అప్పుడు ఎవ్వరికీ ఇబ్బంది ఉండదు.’’ పరిష్కారం సూచించాడు సూర్యం.
‘‘మన కాలనీ సఖ్యత దృష్ట్యా ఇతనికే నా ఓటు! నాతోపాటు ఓటు వేసే వాళ్లెవరో చేయి ఎత్తండి...’’ అన్న ప్రసాదరావు అభ్యర్థనకు కాలనీ వాసులంతా తమ సమ్మతిని తెలియజేయడంతో మార్పుకు సంకేతంగా హరీష్‌ పెదవులు విచ్చుకున్నాయి.
- దొండపాటి కృష్ణ

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)