amp pages | Sakshi

ఇది న్యాయం కోసం దంగల్‌

Published on Fri, 01/20/2023 - 00:31

ఒలింపిక్స్, కామన్వెల్త్‌ క్రీడల లాంటి అంతర్జాతీయ వేదికలపై దేశానికి పతకాలు సాధించి వార్తల్లో వ్యక్తులుగా నిలవడం ఆ కుస్తీ ప్రవీణులకు అలవాటు. కానీ, ఇప్పుడు పూర్తి భిన్నమైన పరిస్థితుల్లో వారు, వారి ఆట వార్తల్లోకి ఎక్కాయి. భారత రెజ్లింగ్‌ సమాఖ్య పైన, దాని అధ్యక్షుడైన పాలక బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌ సింగ్‌ వికృత వ్యవహారశైలి పైన ధ్వజమెత్తుతూ ఢిల్లీ నడిబొడ్డున బుధవారం నుంచి రెండు రోజులుగా 30 మందికి పైగా మహిళా రెజ్లర్లు నిరసనకు దిగేలా చేశాయి. 

అంతా కలిపి 200 మందికి పైగా అథ్లెట్లు నిరసనకు దిగడం, అనేక సంగతులు బయటపెట్టడం భారత క్రీడా చరిత్రలో మునుపెన్నడూ చూడని దృశ్యం. ముక్కున వేలేసుకొనేలా సందర్భం.

కామన్వెల్త్‌ క్రీడోత్సవాల్లో మూడుసార్లు స్వర్ణాలు సాధించిన వినేశ్‌ ఫోగాట్‌ కన్నీరు పెట్టుకుంటూ మహిళా అథ్లెట్లు ఎదుర్కొంటున్న దారుణాల్ని వివరిస్తుంటే గుండె మండిపోతుంది. అన్షూ మలిక్‌ లాంటి వారు బయటపెట్టిన సంగతులు ఆవేదన రేపుతాయి. సాక్షీ మలిక్, బజ్‌రంగ్‌ పునియా – ఇలా స్త్రీ పురుష తేడా లేకుండా అందరూ జరుగుతున్న అన్యాయాలను  కెమెరాల సాక్షిగా ఏకరవు పెట్టాల్సి వచ్చింది.

మహిళా రెజ్లర్లుండే హోటల్‌లోనే బస చేయడం, వారు గది దాటి స్వేచ్ఛగా బయటకు రావడానికైనా వీల్లేకుండా తన గది తలుపులు సదా తీసి ఉంచి, తన రోజువారీ పనులు చేసుకోవడం– ఇదీ సమాఖ్య అధ్యక్షుడి తీరు. ఇది నియమానుసారమే కాదు నైతికంగానూ సరికాదు.

బ్రిజ్‌ గత చరిత్రా గొప్పదేమీ కాదు. గతంలో ఆయన నేరసామ్రాజ్య నేత దావూద్‌ ఇబ్రహీమ్‌ బృందానికి సాయపడ్డారట. ఆ కేసులో తీవ్రవాద కార్యకలాపాల నిరోధక చట్టం కింద అరెస్టయ్యారు. దౌర్జన్యానికి మారుపేరై, ఇప్పటికి 6 సార్లు ఎంపీగా గెలిచారు. 2011 నుంచి పుష్కర కాలానికి పైగా కుర్చీలో ఉంటూ, కుస్తీ సమాఖ్యను సొంత జాగీరుగా మార్చుకొన్నారు.

ఆటను అడ్డంపెట్టుకొని అవి నీతి, అక్రమాలు, వేదికపై ఆటగాళ్ళను చెంపదెబ్బ కొట్టిన దౌర్జన్యాలు, అథ్లెట్లతో అనుచితవర్తనలు... ఇలా ఈ రాజకీయవాది ఘనతల చిట్టా సుదీర్ఘమైనది. సొంత ఊరు లక్నోలో, స్వగృహానికి దగ్గర లోనే సదా మహిళా అథ్లెట్ల శిబిరం పెట్టి, తానూ హాజరయ్యే మనోడి గురించి ఎంత చెప్పినా తక్కువే. 

క్రీడావ్యవస్థలో ఇలాంటి దుష్టసంస్కృతి చిరకాలంగా ఉన్నదే. ఇటీవల ఏడు నెలల క్రితం కూడా అగ్రశ్రేణి భారత సైక్లింగ్‌ క్రీడాకారిణి ఒకరు తమ నేషనల్‌ టీమ్‌ కోచ్‌ నుంచి ఇలాంటి వేధింపులే ఎదుర్కొన్నారు. స్లొవేనియాలో క్రీడా శిక్షణా శిబిరంలో కోచ్‌ అనుచిత ప్రవర్తనపై ఆమె ఏకంగా ‘భారత క్రీడా ప్రాధికార సంస్థ’ (శాయ్‌)కు ఫిర్యాదు చేయాల్సి వచ్చింది.

ఇటీవలే హర్యానాలో ఓ మహిళా కోచ్‌ స్వయానా ఆ రాష్ట్ర క్రీడా మంత్రి లైంగిక అత్యాచార పర్వాన్ని బట్టబయలు చేయడం గమనార్హం. ఇంకెన్నో వెలుగులోకి రాని ఫిర్యాదులున్నాయి. ఓ సినీ నటుడి అనుచిత ప్రవర్తనను ఒక హిందీ నటి బయటపెట్టే సరికి, తీగ లాగితే డొంకంతా కదిలినట్టు భారత్‌లో ‘మీ టూ’ ఉద్యమస్థాయికి చేరిన సంగతి 2018లో చూశాం. ఇప్పుడు కుస్తీ సమాఖ్య సారథి సహా కోచ్‌లపై లైంగిక వేధింపుల ఆరోపణ ఆట వెనుక దాగిన చీకటి కోణాన్ని బయటపెట్టింది. 

నాలుగు పర్యాయాలు ఒలింపిక్‌ పతకాలు తెచ్చిపెట్టిన కుస్తీలోనే ఇలాంటి దారుణమైన పరిస్థితి ఉందంటే, ఇతర క్రీడల్లో పరిస్థితిని ఇట్టే ఊహించుకోవచ్చు. 72 గంటల్లో సమాధానం చెప్పాలంటూ కుస్తీ సమాఖ్యకు క్రీడాశాఖ తాఖీదు ఇచ్చింది. కానీ, బ్రిజ్‌ను తొలగించాలి, అథ్లెట్లతో మర్యాదగా ప్రవర్తించాలి, సమాఖ్యను సమూలంగా మార్చాలి లాంటి ఆటగాళ్ళ కనీస డిమాండ్లు తీర్చలేనివేమీ కావు.

ఆ మాటకొస్తే సమాఖ్యలో ఇష్టారాజ్యంగా నియమాలు మారుస్తున్నారనీ, తమపై అనవసరమైన అధిక నిఘా ఉంచుతున్నారనీ అథ్లెట్లు చేస్తున్న ఆరోపణలకు బ్రిజ్‌ బృందం జవాబివ్వాల్సి ఉంది. కానీ, వేధింపుల బాధితులు బాహాటంగా చెప్పాలనీ, సాక్ష్యాలతో నిరూపిస్తే ఉరిశిక్షకైనా సిద్ధమనీ ఆయన అనడం చట్టం ముందూ నిలవని బుకాయింపే. ఇదంతా కాంగ్రెస్‌ నిర్వాకమనే ఆరోపణ, యూపీ వర్సెస్‌ హర్యానా వాదన అలాంటివే.

ఆరోపణలు హోరెత్తుతున్నా బ్రిజ్‌ రాజీనామా చేయకపోవడం విడ్డూరం. ఇక స్వయంగా క్రికెట రైన క్రీడామంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ రెండోరోజు రాత్రి దాకా నోరెందుకు విప్పలేకపోయారో అర్థం కాదు. ఇన్నేళ్ళుగా కుస్తీ సమాఖ్య సహా అనేక చోట్ల లైంగిక వేధింపుల విచారణ కమిటీలు పెట్టకున్నా ఎలా చూస్తూ కూర్చున్నారో తెలీదు. పాలకులు పతకాల విజేతలతో ఫోన్‌లో మాట్లాడుతూ, ఫోటోలకు పోజులిస్తే చాలదు. బేటీ బచావో... మాటల్లో కాదు, చేతల్లో చూపాలి. దేశవ్యాప్తంగా బ్రిజ్‌ కనుసన్నల్లో సాగుతున్న సమాఖ్య కార్యవర్గాలన్నిటినీ రద్దు చేయాలి. నిపుణులు సారథ్యం వహించాల్సిన క్రీడాసంస్థల్ని ఇకనైనా రాజకీయాలకూ, ఇలాంటి రాజకీయవాదులకూ దూరంగా ఉంచాలి.  

అథ్లెట్ల నిరసనకు తలొగ్గి, సమాఖ్యలో అక్రమాలను విచారించడానికి క్రీడాశాఖ త్రిసభ్య సంఘం వేసిందట. అయితే, అది చాలదు. వేధింపులతో వ్యవహారం బరి దాటి నేరాల గిరిలోకి చేరింది. దీనిపై సీబీఐతో సమగ్ర దర్యాప్తు జరపించాల్సిందే, వ్యవస్థను సమూలంగా ప్రక్షాళించాల్సిందే. ధర్మం కోసం, న్యాయం కోసం... కడకు కనీసపాటి గౌరవం కోసం మహిళలు ఇవాళ్టికీ వీధికెక్కాల్సి వస్తోందంటే అది మన దేశానికే అవమానం.

అంతర్జాతీయ బరిలో విజేతలైన ఈ వీరాంగనలు ఈ ఆత్మగౌరవ దంగల్‌లోనూ విజయం సాధించాలి. సమాజంలో పురుషోన్మాద దృక్పథాన్ని మార్చాలి. ఆటల గద్దెపై రాజకీయ గద్దలకు పని లేకుండా క్రీడాసంస్థలకు స్వేచ్ఛ, స్వాతంత్య్రాలు రావాలి. నిజా యతీ ఉంటే... ఎప్పుడో కాదు, ఇప్పుడే ఆ విధానపరమైన మార్పులకు పాలకులు నడుం బిగించాలి. 

Videos

Watch Live: పాయకరావుపేటలో సీఎం జగన్ ప్రచార సభ

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మన పాలన ఉంది

వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం..హారతులతో స్వాగతం పలికిన మహిళలు

మాటలు చెప్పే ప్రభుత్వం కాదు...చేసి చూపించే ప్రభుత్వం..

కూటమి మేనిఫెస్టో పై ఉష శ్రీ చరణ్ సంచలన వ్యాఖ్యలు..

కూటమి మేనిఫెస్టో పై కొమ్మినేని కామెంట్స్

టీడీపీ మేనిఫెస్టో పై పేర్నినాని పంచులు

ఢిల్లీలో కలకలం.. 50 స్కూళ్లకు బాంబు బెదిరింపులు

జనసంద్రమైన బొబ్బిలి

ఇది అబద్దాల మేనిఫెస్టో..లెక్కలేసి భయపడుతున్న చంద్రబాబు..

Watch Live: బొబ్బిలిలో సీఎం జగన్ ప్రచార సభ

పవన్ కళ్యాణ్ కు ముద్రగడ సవాల్

సీఎం జగన్ ను చంపేందుకు కుట్ర..!

శ్రీశైలం టీడీపీ అభ్యర్థి బండ బూతులు..

గుండె నిండా కేసీఆర్..

అట్టర్ ఫ్లాప్..

జనసేన పరువు తీసిన చింతమనేని

పవన్ కళ్యాణ్, చిరంజీవి కుట్ర బయటపెట్టిన కేఏ పాల్

వాసుపల్లి గణేష్ కుమార్ ఎన్నికల ప్రచారం

YSRCP ఎమ్మెల్యే అభ్యర్థి కావటి మనోహర్ నాయుడిపై దాడికి యత్నం

Photos

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)