రాఖీ పండుగ.. మృత్యుపాశమైన బావి

Published on Mon, 08/03/2020 - 11:24

కొణిజర్ల: అక్కా రాఖీ పండుగకు మా అమ్మ వాళ్లింటికి పోతున్నా, తొందరగా నాటు పూర్తి చేద్దాం, రాఖీ కట్టడానికి మీ ఇంటికి పోతున్నావా వదినా, కరోనా ఉంది జాగ్రత్త అంటూ అప్పటి వరకు ఆనందంగా మాట్లాడుకున్న మహిళా కూలీలు అంతలోనే వ్యవసాయ బావి రూపంలో కానరాని లోకాలకు తరలిపోయారు. వ్యవసాయ బావిలో ప్రమాద వశాత్తు ఇద్దరు మహిళా కూలీలు పడి మృతి చెందిన విషాద సంఘటన ఖమ్మం జిల్లా కొణిజర్ల మండల కేంద్రంలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కొణిజర్లకు చెందిన తద్దె నాగేశ్వరరావు అనే కౌలు రైతు పొలంలో నాటు వేసేందుకు 9 మంది మహిళలు వెళ్లారు, మధ్యాహ్నానికి నాటు పూర్తి చేసారు.

భోజనం చేసి వేరే రైతుకు చెందిన పొలంలో నాటు వేయాలని నిర్ణయించుకుని పక్కనే ఉన్న షేక్‌ చిన సైదబాబు అనే రైతు వ్యవసాయ బావి వద్దకు కాళ్లు కడుక్కోవడానికి వెళ్లారు. 9 మంది కూలీలలో బండారు మల్లిక (30), తుప్పతి రమాదేవి (35), చింతల మమత, తద్దె నాగమణి, తద్దె మౌనికలు బావిలో ఉన్న మెట్లపై ఉండి కాళ్లు కడుకొంటున్నారు. ఈ క్రమంలో  మెట్టు కూలడంతో ఐదుగురు ఒకేసారి బావిలో పడిపోయారు. వారు పడిపోవడం చూసిన ముఠామేస్త్రి చింతల యల్లమ్మ తన వద్ద ఉన్న చీర విసిరి మమత, నాగమణి, మల్లికలను బయటకు లాగింది.

ఈ లోగా మల్లిక, రమాదేవి బావిలో మునిగి చనిపోయారు. మహిళల కేకలు విని సమీప పొలాల్లో పని చేస్తున్న రైతులు పరిగెత్తుకొచ్చారు. బావిలో నీరు నిండుగా ఉండటంతో మోటార్ల సాయంతో నీరు బయటకు వెళ్లదీసి మృతదేహాలను బయటకు తీశారు. అప్పటి వరకు సంతోషంగా నాటు వేసిన తోటి మహిళలు అంతలోనే విగత జీవులుగా మారి పోవడంతో కూలీలు నిశ్చేష్టులయ్యారు. సంఘటనా స్థలంలో స్థానికుల రోదనలు మిన్నంటాయి. మృతి చెందిన రమాదేవికి భర్త నరసింహారావు, కూతురు మౌనిక, కుమారుడు మధు ఉన్నారు. మల్లికకు భర్త భాస్కరరావు, ఇద్దరు చిన్నారి కూతుళ్లు జస్మిత, దివ్య ఉన్నారు. ఎస్‌ఐ మొగిలి సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

‘యల్లమ్మ’ తల్లి
కొణిజర్ల: తన కళ్ల ముందే ఐదుగురు తన తోటి మహిళలు బావిలో పడగా ముగ్గురిని కాపాడుకోగలిగాను.. మరో ఇద్దరు బావిలో మునిగి పోయారని ముఠా మేస్త్రి చింతల యల్లమ్మ వాపోయింది. బావిలోపడ్డ మహిళలను ధైర్యంగా తన చీరతో ముగ్గురిని బయటకు లాగిన యల్లమ్మను పలువురు దేవతగా కొనియాడారు. ఆమె మాటల్లోనే.. నాటు పూర్తి చేసుకుని కాళ్లు చేతులు కడుక్కొని అన్నం తినడానికి సిద్ధమయ్యాం.. బండారు మల్లిక, తుప్పతి రమాదేవి, చింతల మమత, తద్దె మౌనిక, తద్దె నాగమణి బావిలోకి దిగి మెట్టుమీద నిలుచుని ముఖం కడుక్కుంటున్నారు. ఒక్కసారిగా మెట్టు కూలి పోవడంతో ఐదుగురు బావిలో పడిపోయారు. వెంటనే నా చేతిలో ఉన్న కండువా విసరడంతో మౌనిక పట్టుకుని బయటకు వచ్చింది. తర్వాత నా చీర తీసి బావిలోకి విసిరాను దాని సాయంతో మమత, నాగమణిని బయటకు లాగ గలిగాను. అప్పటికే రమాదేవి, మల్లిక రెండు సార్లు పైకి తేలి మునిగి పోయారు. నాతో పాటు మరో ఇద్దరి చీరలు కలిపి బాలిలోకి విసిరినా వారు పట్టుకోలేక పోయారు. దీంతో కళ్ల ముందే బావిలో మునిగి పోయారు. మా పక్కనే ఉన్న పొలం యజమాని కుమారుడు బావిలోకి దూకి ప్రయత్నించినా నీళ్లు బాగా ఉండటంతో బయటకు తీయలేక పోయాడు. 

ముగ్గురిని ధైర్యంగా కాపాడిన యల్లమ్మను పలువురు ప్రశంశిస్తున్నారు.ధైర్యంగా చీరవేసి బయటకు లాగి కాపాడిన యల్లమ్మను పొలీసులు,స్థానికులు అభినందించారు. 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ