amp pages | Sakshi

నాన్నా.. ఎందుకిలా చేశావ్ నాన్నా..?

Published on Sun, 06/29/2014 - 10:07

"నాన్నా.. ఈ ప్రపంచంలో నేను అత్యంతగా ప్రేమించేది మిమ్మల్నే. మీరేది చేసినా నా మంచికే అనుకుని, మీ మాటకే కట్టుబడి ఉన్నా. నాకు పెళ్లి సంబంధం తెచ్చినప్పుడు, 'నాకు అతను నచ్చలేదు నాన్నా..' అని చెప్పినా వినిపించుకోకుండా అతనికే ఇచ్చి చేశారు! అతను నన్ను చిత్ర హింసలు పెడుతున్నా చూస్తూ ఊరుకున్నారే గానీ, అతన్ని ఒక్క మాట అనలేదు. ఎందుకు నాన్నా ఇలా చేస్తున్నారు ? నాకంటే అతనే ఎక్కువయ్యాడా ?" అంటూ తన ఆవేదనను ఫేస్‌బుక్ ద్వారా తెలిపింది ఓ యువతి. ఈ వీడియో నిజమైనదో లేదా నటించి చేసినదో ఇంకా తెలియలేదు. అయితే ఆ యువతి చెప్తున్న తీరు, ఆ వీడియోలో ఆమె చెప్పే విషయాలు చూస్తే మాత్రం ఈ వీడియో నిజమైనదేననే ఆలోచన బలపడుతుంది.

సభ్య సమాజంలో ఒక మహిళ ఎంత అవమానానికి గురవుతుందో, కన్న తండ్రే కూతురు పట్ల ఇంత కఠోరంగా ప్రవర్తించే పరిస్థితి ఏర్పడిందో  ఈ వీడియోలో అవగతమవుతుంది..ఈ వీడియో నిజమైనదే అయితే ఆ మహిళ పడే బాధ ఎవరినైనా కలచి వేయకతప్పదు. ఎంత వేదనకు గురయ్యుంటే.. ఆ మహిళ, "మీ పక్క గదిలోనే అతను నన్ను రేప్ చేస్తుంటే.. ఎలా చూస్తూ ఊరుకున్నారు నాన్నా?" అంటుంది. ఇది నిజంగా దయనీయకరమైన పరిస్థితే.

ఒకవేళ ఈ వీడియో అబద్ధమనే అనుకున్నా.. ఇలాంటి సంఘటనలు ఎన్ని జరగడంలేదు. చెప్పుకోలేక కొందరు, చెప్పుకున్నా పట్టించుకోక మరికొందరు.. ఇలా ఎంతమంది ఇంకా అదే వేదనను అనుభవిస్తున్న వారు లేరు. చట్టం వీరందరికీ కఠిన శిక్షలు వెయ్యాలి. చట్టం శిక్షలు వేస్తుంది సరే.. ఇలాంటివి మళ్లీ మళ్లీ జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి ? ఇది తప్పు, ఇలా చేయకూడదు అన్న వివేకం ఎవరు కల్పించాలి ? గౌరవం మాటున జరిగే ఈ దుర్ఘటనలను ఆపడం మన బాధ్యతలో ఓ భాగం కాదా?

ఇటువంటి ఘటనలపై సమాజం ఒక అడుగు ముందుకేసి స్పందించాల్సిన అవసరం మాత్రం ఎంతైనా ఉంది.