amp pages | Sakshi

‘ఈ అన్యాయం ఎక్కువరోజులు నిలబడదు’

Published on Wed, 02/15/2017 - 17:55

హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు ప్రలోభాలు పెట్టి ఎమ్మెల్యేలను లాక్కుంటున్నారని.. ఈ అన్యాయం ఎక్కువరోజులు నిలబడదని ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి అన్నారు. అధర్మం గెలిచినట్టుగా కనిపించినా చివరకు ధర్మమే గెలుస్తుందని వ్యాఖ్యానించారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గానికి చెందిన టీడీపీ సీనియర్‌ నాయకుడు గంగుల ప్రభాకర్‌ రెడ్డి... వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌ సీపీలో చేరారు.

ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ.. ‘గుంగుల ప్రభాకర్‌ రెడ్డి మా పార్టీలో చేరడం ఆనందాన్ని కలిగిస్తోంది. గంగులన్నను వైఎస్సార్‌ సీపీ కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నాం. అన్నిరకాలుగా ఒకరికొకరు తోడుగా ఉంటాం. రాజకీయాలను ఎంత అన్యాయమైన స్థాయిలోని తీసుకుపోయారన్నది మనం చూస్తున్నాం. ప్రతిపక్షంలో ఉన్నాం కదా అని మాపై అన్యాయాలు చేస్తున్నారు. మూడేళ్లు గడిచిపోయింది. ఇంకో ఏడాది గడిస్తే ఎన్నికల సంవత్సరం వస్తుంది. ఆ తర్వాత వచ్చేది మనందరి ప్రభుత్వమే. రామాయణం, మహాభారతం, ఖురాన్‌, బైబిల్ లలో ఎక్కడైనా సగం వరకు అధర్మం, అన్యాయం గెలిచినట్టు కనిపిస్తుంది కానీ చివరకు ధర్మం, న్యాయమే గెలుస్తుంద’ని అన్నారు. గంగుల నాని, టీడీపీ స్థానిక ప్రజాప్రతినిధులు, అనుచరులు పెద్ద ఎత్తున వైఎస్సార్ సీపీలో చేరడంతో పార్టీ కేంద్ర కార్యాలయంలో సందడి వాతావరణం నెలకొంది.