amp pages | Sakshi

ఫుల్‌​ క్లారిటీ ఇచ్చేసిన ఆజాద్‌!

Published on Tue, 01/17/2017 - 15:49

ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల పొత్తుకు ఇంకా సమయముందంటూ ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ ఆచితూచి స్పందిస్తుండగా.. కాంగ్రెస్‌ పార్టీ మాత్రం మౌనాన్ని వీడింది. యూపీలో ఎస్పీతో పొత్తు పెట్టుకోబోతున్నామని విస్పష్టంగా తెలిపింది. ఎస్పీలో కుటుంబ తగాదాకు తెరపడి.. అఖిలేశ్‌ వర్గానికి సైకిల్‌ గుర్తు కేటాయించిన నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ ఈ మేరకు ప్రకటన చేసింది.

’రానున్న యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌-ఎస్పీ పొత్తు పెట్టుకోనున్నాయి’ అని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు గులాం నబీ ఆజాద్‌ స్పష్టం చేశారు. ఈ పొత్తుకు సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయని తెలిపారు. అఖిలేశ్‌ యాదవ్‌ నాయకత్వంలో కాంగ్రెస్‌-ఎస్పీ కూటమి ఎన్నికలను ఎదుర్కొంటుందని, కూటమి నాయకుడైన అఖిలేశ్‌ సీఎం అభ్యర్థిగా ఉంటారని ఆయన సంకేతాలు ఇచ్చారు. అయితే, ఈ కూటమిలో మరిన్ని చిన్న పార్టీలను చేర్చుకునే విషయమై ఆయన ఏమీ చెప్పలేకపోయారు. మహాకూటమి ఏర్పాటు గురించి మున్ముందు ఆలోచిస్తామని, ప్రస్తుతానికి కాంగ్రెస్‌-ఎస్పీ పొత్తు కుదిరిందని ఆయన అన్నారు. ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీ యూపీ సీఎం అభ్యర్థిగా షీలా దీక్షిత​ను  ప్రకటించినప్పటికీ.. సీఎం అభ్యర్థిగా తప్పుకొనేందుకు ఆమె సంసిద్ధత వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.