amp pages | Sakshi

‘ర్యాలీ ఫ్లాప్.. కాదు సూపర్‌ హిట్‌’

Published on Thu, 02/23/2017 - 12:33

హైదరాబాద్‌: ‍నిరుద్యోగ ర్యాలీ విజయవంతం అయిందని తెలంగాణ జేఏసీ కన్వీనర్‌ కోదండరామ్‌ అన్నారు. ర్యాలీ నేపథ్యంలో జరిగిన పరిణామాలు, అరెస్టుల పర్వం తదితర అంశాలపై గురువారం ఉదయం ఆయన నివాసంలో జేఏసీ నేతలు, నిరుద్యోగ జేఏసీ, విద్యార్థి నాయకుల మధ్య చర్చల అనంతరం కోదండరామ్‌ మీడియాతో మాట్లాడారు. విద్యార్థులు, నిరుద్యోగులు స్వచ్ఛందంగా ర్యాలీకి వచ్చారని చెప్పారు. దాదాపు 5వేలమందిని పోలీసులు అరెస్టు చేసిన విషయం అందరికీ తెలుసని, దీన్ని బట్టే ర్యాలీ విజయవంతం అయిందని చెప్పవచ్చని అభిప్రాయపడ్డారు.

ర్యాలీ కార్యక్రమం అత్యద్భుతంగా జరిగిందని, తాము ఏం చెప్పాలనుకున్నామో అది చాలా విస్తృతంగా చెప్పగలిగామని, ర్యాలీ విజయవంతమైందని చెప్పడానికి ఇదే గీటురాయని అన్నారు. ఆయా విశ్వవిద్యాలయాల్లో నిరుద్యోగులు, యువత నిరసనలు తెలిపేందుకు తరలిన విధానం ప్రతి మీడియా గమనించిందని గుర్తు చేశారు.

మరోపక్క అంతకుముందు బాల్క సుమన్‌ మీడియాతో మాట్లాడుతూ నిరుద్యోగ ర్యాలీ అట్టర్‌ ఫ్లాప్ అయిందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి కోదండరామ్‌ ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు కోదండరామ్‌ కుట్రలు చూస్తున్నారని, నిరుద్యోగులు, యువత ర్యాలీలో పాల్గొనకుండా కేసీఆర్‌పై విశ్వాసం చూపించారని అన్నారు.