amp pages | Sakshi

తెలంగాణను ఆదర్శంగా తీసుకొండి: ఉప రాష్ట్రపతి

Published on Wed, 09/13/2017 - 12:42

సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే విద్యాసంవత్సరంలో ఒకటో తరగతి నుంచి ఇంటర్‌ వరకు తెలుగు బోధనను తప్పనిసరి చేస్తూ తెలంగాణ సీఎం కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయాన్ని ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు అభినందించారు. ఇదే విధంగా మిగతా రాష్ట్రాలు తెలంగాణను ఆదర్శంగా తీసుకొని తమ మాతృభాషకు తొలి ప్రాధాన్యతనివ్వాలని సూచించారు.  త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కూడా ఇదే నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
 
తెలంగాణలో తొలిసారిగా తెలుగు మహాసభలు నిర్వహిస్తున్న సందర్భంగా తెలుగు భాషను పరిరక్షించే రెండు కీలక నిర్ణయాలను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మంగళవారం ప్రకటించిన విషయం తెలిసిందే. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తెలంగాణలోని అన్ని రకాల పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకు కచ్చితంగా తెలుగు భాషను ఒక సబ్జెక్టుగా బోధించాలని విద్యాసంస్థలకు సూచించారు. తెలుగును సబ్జెక్టుగా బోధించే పాఠశాలలకు మాత్రమే తెలంగాణలో అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. మంగళవారం ప్రగతి భవన్‌లో తెలుగు మహాసభలపై జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. ఉర్దూ కోరుకునే విద్యార్థులకు ఉర్దూ భాష కూడా ఆప్షనల్‌ సబ్జెక్టు ఉండాలని నిర్ణయించారు.