కాళేశ్వరంలానే పాలమూరులోనూ వేగం

Published on Sat, 07/21/2018 - 01:18

సాక్షి, హైదరాబాద్‌: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కొన్ని రాజకీయ పక్షాలు కోర్టు కేసులతో అడ్డుకుంటున్నాయని, ఈ కేసులు ఓ కొలిక్కి వస్తే కాళేశ్వరం ప్రాజెక్టు తరహాలోనే పాలమూరు–రంగారెడ్డి నిర్మాణ పనులను పరుగెత్తిస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు చెప్పారు.

కోర్టు కేసులతో పనులకు ఆటంకం కలుగుతున్నా.. సమస్యలన్నింటినీ అధిగమించి పనులు పూర్తి చేస్తామన్నారు. శుక్రవారం జలసౌధలో పాలమూరు–రంగారెడ్డి పనులపై మంత్రి సమీక్ష జరిపారు. ఈ ప్రాజెక్టులోని 18 ప్యాకేజీల్లో పనులను ప్యాకేజీల వారీగా సమీక్షించారు. ప్యాకేజీ–1లో 66 లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టి పనికిగానూ 18 లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టిపని పూర్తి చేసినట్లు ఇంజనీర్లు మంత్రికి వివరించారు.

ఈ ప్యాకేజీలోని అండర్‌ గ్రౌండ్‌ పంప్‌ హౌస్, టన్నెల్, గ్రావిటీ కెనాల్‌ పనులు వేగంగా పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ ప్యాకేజీ పనులు పూర్తి చేస్తే మహబూబ్‌నగర్‌ జిల్లా వాసులకు వచ్చే వేసవిలో దాహార్తి తీర్చేందుకు తాగునీటిని అందించే అవకాశం ఉంటుందన్నారు. ఈ ప్రాజెక్టు పరిధిలోని అటవీ భూముల సేకరణకు అవసరమైన రూ.49 కోట్లను వెంటనే చెల్లించాలని ఆదేశించారు.

రాక్‌ ఫిల్‌ డామ్‌ విధానంలో పనులు
ప్యాకేజీ–2లో అంజనగిరి రిజర్వాయర్‌ పరిధిలోని రీచ్‌–1లో పనులు వేగంగా జరుగుతున్నాయని, రీచ్‌–2, రీచ్‌–3ల్లో రిజర్వాయర్‌ బండ్‌ పనులు నిర్వహిస్తున్నామని, రీచ్‌–2లో మట్టి సమస్య నెలకొందని ఇంజనీర్లు మంత్రికి తెలిపారు. బండ్‌ మట్టిలో సమస్య ఏర్పడినపుడు ర్యాక్‌ ఫిల్‌ డామ్‌ విధానం ద్వారా అక్కడి రాళ్లు, మట్టితో నిర్మించడం మంచిదని మంత్రి సూచించారు.

డైవర్షన్‌ రోడ్స్‌ నిర్మాణ పనులను ప్రస్తుతం పనులు చేస్తున్న ఏజెన్సీలకు అప్పగించాలా? లేక ఆర్‌అండ్‌బీ శాఖతో చేయించాలా? అన్న దానిపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. ఈ ప్యాకేజీలో ఎలక్ట్రికల్‌ టవర్స్‌ను మార్చేందుకు అవసరమైన రూ.18 కోట్ల నిధుల మంజూరుకు సైతం ప్రతిపాదనలు పంపాలని చెప్పారు. ఈ ప్యాకేజీలో ఇప్పటికే 199 ఇళ్లకు ఆర్‌అండ్‌ఆర్‌ కింద చెల్లింపులు పూర్తయ్యాయని, మిగతా 110 ఇళ్లకు ఇవ్వాల్సి ఉందని ఇంజనీర్లు తెలిపారు.

దీనిపై హరీశ్‌రావు స్పందిస్తూ, సంబంధిత జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికారులతోపాటు భూసేకరణ ప్రత్యేకాధికారి మనోహర్‌తో సంప్రదించి సమస్య పరిష్కరించాలని సూచించారు. ప్యాకేజీ–3 పనులతోపాటు ప్యాకేజీ–4లో 15 కిలోమీటర్ల టన్నెల్‌ నిర్మాణాన్ని ప్రాధాన్యతా క్రమంలో చేపట్టాలని, ముందుగా నీరు ఇచ్చేందుకు అవకాశం ఉన్న టన్నెల్‌పై దృష్టి పెట్టి పనులు వేగం పెంచాలని సూచించారు.


పనుల నాణ్యతలో రాజీ వద్దు
ప్యాకేజీ–13, 14, 15 కింద కర్వెన రిజర్వాయర్‌ నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నట్లు ఇంజనీర్లు మంత్రికి తెలిపారు. రిజర్వాయర్ల పనుల్లో అప్రమత్తత పాటించాలని, పెద్ద రిజర్వాయర్లు కావడం వల్ల ఎలాంటి నాణ్యతా లోపాలున్నా ఇబ్బందులు తలెత్తుతాయని, ప్రాజెక్టు ఇంజనీర్లు, ఏజెన్సీలు, క్వాలిటీ కంట్రోల్‌ ఇంజనీర్లు పూర్తి అప్రమత్తతతో పని చేయాలని మం త్రి ఆదేశించారు.

రిజర్వాయర్ల పనుల నాణ్యత విషయంలో రాజీ పడవద్దని సూచించారు. టన్నెల్‌ పనుల్లో భద్రత విషయంలోనూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని, అన్ని రక్షణ ఏర్పాట్లతోనే పనులు జరి పేలా సిబ్బందికి సూచనలు ఇవ్వాలని ఆదే శించారు. సమీక్షలో ఈఎన్‌సీ మురళీధర్, ఇరిగేషన్‌ ఓఎస్డీ శ్రీధర్‌ దేశ్‌ పాండే, సీఈ లింగరాజు, ఎస్‌ఈ రమేశ్‌ పాల్గొన్నారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ