amp pages | Sakshi

హోంగార్డులకు తీపి కబురు

Published on Fri, 02/17/2017 - 00:23

కానిస్టేబుల్‌ నియామకాల్లో హోంగార్డులకు 10 శాతం రిజర్వేషన్‌!
భారీగా జీతభత్యాల పెంపు.. ఇతర సౌకర్యాలు, అలవెన్సులు కూడా
మూడు కీలక ప్రతిపాదనలను పరిశీలిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం



హైదరాబాద్‌: తమ సమస్యలు పరిష్కరిం చాలంటూ కొన్ని నెలలుగా డిమాండ్‌ చేస్తున్న హోంగార్డులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించనుంది. కానిస్టేబుల్‌ నియామకాల్లో 10%  రిజర్వేషన్‌ కల్పించడంతోపాటు జీతభ త్యాలను ఆశించిన స్థాయిలో పెంచాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. వీటితోపాటు పలు అలవెన్సులు కూడా అందజేయాలని భావిస్తున్నట్లు సమాచారం.

కొంత వరకు ఊరట
ప్రస్తుతం కానిస్టేబుల్‌ నియామకాల్లో హోంగార్డులకు 5 శాతం రిజర్వేషన్‌ ఉంది. అర్హత, వయసు ఉన్న అభ్యర్థులకు మరింత తోడ్పాటు అందించేందుకు ఈ కోటాను 10 శాతానికి పెంచాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. దానితో ప్రతి 100 పోస్టుల్లో 10 మంది హోంగార్డులు కానిస్టేబుళ్లుగా నియా మకం అవుతారని ఉన్నతాధికారులు చెబుతు న్నారు. ఇక హోంగార్డుల జీతభత్యాల్లోనూ ఆశాజనకమైన పెంపు ఉంటుందని పేర్కొం టున్నారు. హోంగార్డులకు ప్రస్తుతమున్న వేతనాలను రూ.18 వేలకు పెంచే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది. దీనికి తోడు పదవీ విరమణ ప్రయోజనంగా కొంత నగదు అందించాలని కూడా యోచిస్తున్నట్లు సమాచా రం. ఇక పోలీస్‌ శాఖలోని ఆరోగ్య భద్రత స్కీంలో హోంగార్డులకు అవకాశం, మహిళా హోంగార్డులకు సగం జీతంతో కూడిన మెటర్నిటీ సెలవుల అంశాలపైనా ఓ నిర్ణయా నికి వచ్చినట్టు తెలిసింది. డ్యూటీ అలవెన్స్, యూనిఫాం అలవెన్స్, పరేడ్‌ చార్జీలు, బందోబస్తు అలవెన్స్‌లను పెంచాలన్న ప్రతిపాదనపైనా ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్టు పోలీసు వర్గాలు తెలిపాయి.

బడ్జెట్‌కు ముందే ప్రకటన
హోంగార్డులకు జీతభత్యాల పెంపు, ఇతరత్రా సౌకర్యాలను వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమలు చేసేలా ఆదేశాలుంటాయని తెలిసిం ది. బడ్జెట్‌ సమావేశాలకు ముందే ప్రభుత్వం హోంగార్డుల సమస్యలపై ప్రకటన వెలువరిం చే అవకాశముందని, ఇందుకోసం బడ్జెట్‌లోనే ప్రత్యేక నిధులు కేటాయించేందుకు చర్యలు చేపట్టనున్నారని పోలీసు వర్గాలు తెలిపాయి.

క్రమబద్ధీకరణ కష్టమే!
కానిస్టేబుళ్లుగా క్రమబద్ధీకరించాలం టూ హోంగార్డులు చేస్తున్న డిమాండ్‌పై ప్రభుత్వం న్యాయసలహా తీసుకున్నట్టు తెలుస్తోంది. అది అంత సులభం కాదని, అనేక నిబంధనలు అడ్డుగా ఉన్నాయని న్యాయ నిపుణులు ప్రభుత్వానికి స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో హోంగార్డులకు తగిన న్యాయం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టినట్లు సమాచారం. ఈ మేరకు పోలీస్‌ శాఖ నుంచి మూడు కీలక ప్రతిపాదనలు సర్కారుకు అందినట్లు తెలిసింది.