amp pages | Sakshi

ఆటో ‘షీటు’.. ఏమైనట్టు?

Published on Mon, 12/24/2018 - 10:10

సాక్షి, సిటీబ్యూరో: నార్త్‌జోన్‌ పరిధికి చెందిన ఓ జంట ఆటోలో ప్రయాణిస్తూ తమ బ్యాగ్‌ అందులో మర్చిపోయారు. పోలీసులు సీసీ కెమెరాల ద్వారా ఆటో నంబర్‌ గుర్తించినా... డ్రైవర్‌ సరైన చిరునామా లభ్యంకాకపోవడంతో కేసు కొలిక్కి రాలేదు.  సిటీలో సంచరిస్తున్న ఆటోలు ఏటా లక్షన్నరకు పైగా ఉల్లంఘనలకు పాల్పడుతున్నాయి. వీటికి సంబంధించి పోలీసులు జారీ చేస్తున్న ఈ–చలాన్లలో చాలా వరకు పెండింగ్‌లో ఉండిపోతున్నాయి.  ఆటోలకు సంబంధించి అధికారిక రికార్డుల్లో ఉన్న చిరునామాలు, ప్రస్తుతం వాటి యజమానులు/డ్రైవర్లు అడ్రస్‌లకు సంబంధం లేని కారణంగానే ఈ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకున్న నగర ట్రాఫిక్‌ విభాగం అధికారులు ఆటోలకు సంబంధించిన డేటాబేస్‌ ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి వాహనానికీ ప్రత్యేకంగా క్యూఆర్‌ కోడ్‌తో కూడిన పోలీస్‌ నంబర్‌ కేటాయించాలని కొన్నాళ్ల క్రితమే నిర్ణయించారు. వీటితో పాటు లోపలి భాగంలో నేమ్‌షీట్ల ఏర్పాటుకు సన్నాహాలు చేశారు. అయితే వీరికంటే వెనుక ప్రయత్నాలు ప్రారంభించిన రాచకొండలో ఈ విధానం అమలులోకి వచ్చినా...నగరంలో మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారింది.

సగం వేరే చిరునామాలే...
రాజధానిలో దాదాపు లక్షన్నరకు పైగా ఆటోలు ఉండగా... ఆర్టీఏ రికార్డుల్లో కనీసం 50 శాతం కూడా అసలైన చిరునామాలపై లేవు. ఫలితంగా ఏదైనా ఉదంతం జరిగినప్పుడు దర్యాప్తులో చిక్కులు ఎదురవుతున్నాయి. ఆటోవాలాల ఉల్లంఘనల విషయానికి వస్తే నగరంలోని వాహనాల్లో వీటి వాటా నాలుగు శాతం లోపే కాగా... పెండింగ్‌లో ఉన్న ఈ–చలాన్ల సంఖ్య మాత్రం 20 శాతం దాటుతోంది. మూడు కమిషనరేట్లలో ఎన్ని ఆటోలు ఉన్నాయి..? ఎన్ని సంచరిస్తున్నాయి? అంటూ ఆర్టీఏ అధికారులను అడిగితే సమాధానం చెప్పలేని పరిస్థితి. నగరంలో డబుల్‌ రిజిస్ట్రేషన్‌ నంబర్, బోగస్‌ నెంబర్‌ ప్లేట్లతో తిరుగున్న వాహనాలు 40 శాతం వరకు ఉండవచ్చునని పోలీసుల అంచనా. ఆర్టీఏలో రిజిస్ట్రేషన్‌ చేయించుకుంటున్న ఆటోడ్రైవర్లు, యజమానులు అందిస్తున్న పత్రాల విశ్వసనీయత, చిరునామా పక్కానా? కాదా? అనేవి క్రాస్‌ చెక్‌ చేసేందుకు ఆర్టీఏ వద్ద వనరులు లేవు. నగర వ్యాప్తంగా విస్తృత దాడులతో ఇలాంటి వాటికి చెక్‌ చెప్పాలన్నా... ఉన్న సిబ్బందితో రోటీన్‌ పనులే కష్టంగా మారాయి. 

ప్రత్యేక నంబరింగ్‌కు సన్నాహాలు...
ఈ పరిణామాలను పరిగణలోకి తీసుకున్న నగర ట్రాఫిక్‌ విభాగం అధికారులు ఆటో డ్రైవర్లు, యజమానుల తాజా వివరాలతో ప్రత్యేక డేటాబేస్‌ ఏర్పాటు చేయాలని భావించారు. ఇందులో వాహనం ఎవరి పేరుతో ఉన్నప్పటికీ ప్రస్తుత యజమాని ఎవరు? ఎవరు డ్రైవర్‌గా వ్యవహరిస్తున్నారు? వారి చిరునామా, సెల్‌ నంబర్‌ తదితరాలను పొందుపరచాలని యోచించారు. ఈ ప్రక్రియకు తొలుత ఆటోడ్రైవర్లే స్వచ్ఛందంగా ముందుకు వచ్చేలా ప్రయత్నాలు చేయాలని, దీనికోసం ఓ యాప్‌ను క్రియేట్‌ చేయడంతో పాటు ప్రధాన జంక్షన్లు, కీలక ప్రాంతాల్లో వివరాల నమోదు కేంద్రాలను ఏర్పాటు చేయాలని భావించారు. ఈ వివరాలను సర్వర్‌లో నిక్షిప్తం చేసి పీడీఏ మిషన్లను అనుసంధానించి క్షేత్రస్థాయిలో ఉండే ట్రాఫిక్‌ అధికారులు తనిఖీ చేయించాలని అనుకున్నారు. అసలు వివరాలు ఇవ్వని, తప్పుడు వివరాలు అందించిన వారిని గుర్తించి అప్పటికప్పుడు అప్‌డేట్‌ చేసేలా చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేశారు. డేటాబేస్‌ రూపొందిన తర్వాత ఒక్కో ఆటోకు ప్రత్యేకంగా పోలీసు నెంబర్, క్యూర్‌ కోడ్‌ కేటాయించాలని భావించారు.

ఒక్క అడుగూ ముందుకు పడలేదు...
నగర కమిషనరేట్‌ పరిధిలో సంచరించే ఆటోల్లో డ్రైవర్లు తమ వివరాలతో పాటు పోలీసు హెల్ప్‌లైన్‌తో కూడిన బోర్డును (నేమ్‌షీట్‌) ఏర్పాటు చేయాలని ట్రాఫిక్‌ విభాగం అధికారులు యోచించారు. దీనిని ఆటోలో కూర్చున్న వారికి కనిపించేలా డ్రైవర్‌ సీటు వెనుక ఏర్పాటు చేయించాలనుకున్నారు. దీనిపై ఆటోఓనర్‌ పేరు, రిజిస్ట్రేషన్‌ నెంబర్, ట్రాఫిక్‌ హెల్ప్‌లైన్, కంట్రోల్‌రూమ్‌ నంబర్లు అందుబాటులో ఉండేలా  ప్రణాళికలు సిద్ధం చేశారు. అయితే ఏళ్లుగా ఈ ప్రతిపాదన  కాగితాలకే పరిమితమైంది. నగరం కంటే వెనుక ప్రతిపాదనలు సిద్ధం చేసిన సంగారెడ్డి జిల్లాతో పాటు రాచకొండ కమిషనరేట్‌లోనూ ఇప్పటికే అమలు మొదలైంది. సిటీలో మాత్రం ఈ షీట్లు దస్త్రాలను దాటి బయటకు రాలేదు. ఇప్పటికైనా ట్రాఫిక్‌ పోలీసులు చర్యలు తీసుకుని వీటిని ఏర్పాటు చేయించాలని నగర వాసులు కోరుతున్నారు. అయితే ఈ ప్రక్రియలో ఎక్కడా ఆటో డ్రైవర్లపై భారం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌