‘వచ్చేవారంలో స్వాతిని అరెస్ట్ చేస్తారు’

Published on Sat, 08/27/2016 - 20:18

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వంపై ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ మరోసారి విరుచుకుపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌ జంగ్... ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ స్వాతి మలివాల్‌ను అరెస్టు చేయించి, ఆమెను పదవి నుంచి తొలగించాలనుకుంటున్నారని ఆరోపించారు. స్వాతి మలివాల్ చక్కగా పని చేస్తున్నందువల్ల ఆమెను పదవి నుంచి తొలగించాలని ప్రధాని కార్యాలయం, ఎల్‌జీ కార్యాలయం యోచిస్తున్నట్లు తనకు అనధికారిక వర్గాల ద్వారా తెలిసిందని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. వచ్చే వారం ఆమెను అరెస్టు చేసి పదవి నుంచి తప్పిస్తారంటూ ఆయన పేర్కొన్నారు.

కేజ్రీవాల్ మరో ట్వీట్‌లో ఎల్‌జీ, ఆయన కార్యాలయంపై ఆరోపణలు చేశారు. మొహల్లా క్లినిక్‌లు ఏర్పాటుచేసిన వారిని, ఫ్లై ఓవర్ల నిర్మాణంలో సొమ్ము ఆదా చేసినవారిని కూడా పదవుల నుంచి తొలగించాలని ఎల్‌జీ పట్టుదలతో ఉన్నారని వ్యాఖ్యలు చేశారు. ఆప్ సర్కారు చేసిన తప్పిదాలను తాను చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తానని ఎల్‌జీ అన్నట్లుగా పత్రికలలో వచ్చి న వార్తలను కూడా ఆయన ట్విటర్‌పై ఉంచారు.