amp pages | Sakshi

‘మత్తు’... ఓ మారణహోమం

Published on Wed, 08/09/2017 - 00:47

విశ్లేషణ
భారత్‌ వంటి ప్రజాస్వామ్య దేశాల్లో నిషిద్ధ డ్రగ్స్‌ చలామణిలాంటి సమస్యలను పరిష్కరించ డానికి కఠినమైన చట్టాలను అమలు చేయాలి. నిజానికి అలాంటి మాఫియా ఆట కట్టించడానికి కఠినమైన నార్కోటిక్‌ డ్రగ్స్‌ అండ్‌ సైకో ట్రాఫిక్‌ సబ్‌స్టాన్సెస్,1985 (ఎస్‌డీపీఎస్‌) లాంటి పదునైన చట్టాలు మనకున్నాయి. కేవలం చట్టాలు చేసి చేతులు దులుపుకోవడంతోనే మాదక ద్రవ్యాల విషవలయం బలహీనపడదు. ఒకవైపు కఠిన చట్టాలను అమలుచేస్తూనే పిల్లలను మాదకద్రవ్యాల నుంచి రక్షించుకొనేందుకు ప్రజాచైతన్య కార్యక్రమాలు చేపట్టాలి.

తెలుగునాట మాదకద్రవ్యాల వినియోగం, వ్యాపారం చాప కింద నీరులా విస్తరించాయి. అమెరికా తదితర విదేశాల నుంచి అతిపెద్ద ‘డార్క్‌ నెట్‌వర్క్‌’తో, ఇంటిదొంగల సహకారంతో మత్తు పదార్థాలు సినిమా, ఐ.టి. సహా అనేక రంగాల్లోకి ప్రవేశించాయి. ఇటీవల పలువురు సినీ ప్రముఖులను విచారించడం సంచలనం సృష్టించింది. పోలీస్, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ తదితర నిఘా వ్యవస్థల కళ్లు గప్పి, ఎల్లలుదాటి మత్తు పదార్థాలు యథేచ్ఛగా దిగుమతి కావడం, వాటి సరఫరా వెనుక సాదాసీదా నేరగాళ్లతోపాటు అంతర్జాతీయ ముఠాల ప్రమేయం ఉండటం ప్రభుత్వాలకు పెనుసవాలుగా మారింది.

‘మత్తు’కు బానిసలు
యువతీ యువకులు, పాఠశాల విద్యార్థులు సైతం ఈ మాదకద్రవ్యాలకు బానిసలు కావడం చూస్తే ఈ ‘మత్తు’ ఎంతగా విస్తరించిందో అర్థమవుతుంది. పిల్లలు ఇష్టంగా తినే చాక్లెట్లలో మత్తుమందు కలిపి అమ్ముతున్నారు. గంజాయి కలిపిన చాక్లెట్లు నిజామాబాద్‌ లాంటి జిల్లాల్లో పట్టుబడ్డాయి. ఐదు రూపాయలకు లభిస్తుండటంతో పేదలు కూడా వీటిని కొనుగోలు చేస్తున్నారు. చెత్త ఏరుకొనే వీధి బాలలు, యువకులు సైతం మార్కెట్‌లో తేలిగ్గా దొరికే ‘వైట్‌నర్‌’ వాడుతూ మత్తులో మునిగి తేలుతున్నారన్న వార్తలు ఎంతో కాలంగా వినిపిస్తున్నాయి. అంటే వారివారి సామాజిక, ఆర్థిక స్థాయి, పరిస్థితులననుసరించి యువత మత్తు పదార్థాలకు బానిసలుగా మారుతున్నారు. దర్యాప్తు సంస్థల వివరాల ప్రకారం ఒక్క హైదరాబాద్‌లోనే డ్రగ్స్‌కు బానిసలైన విద్యార్థుల సంఖ్య ఇటీవల వందల నుంచి వేలకు చేరింది. నేడు ప్రతి తల్లిదండ్రులు పిల్లల చదువుల కోసం ఆదాయంలో సగటున 12.22% ఖర్చు చేస్తున్నారు. అధిక ఫీజులు చెల్లిస్తున్నంత మాత్రాన తమ పిల్లల చదువులు, బాగోగుల బాధ్యతను విద్యా సంస్థల యాజమాన్యాలకే వదిలిపెట్టడం సరి కాదు. పిల్లల దైనందిన వ్యవహారాలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ ఎంతో అవసరం. విద్యా సంస్థలు కూడా నిబద్ధతతో వ్యవహరించాలి.

బహుముఖ వ్యూహం అవసరం
మాదక ద్రవ్యాల సమస్య జటిలమైనది. దీనిని బహుముఖ వ్యూహంతోనే ఎదుర్కోవాలి. ముఖ్యంగా లభ్యతను నియంత్రించాలి. కానీ నేడు భారత్‌ మత్తుపదార్థాలకు అతిపెద్ద మార్కెట్‌గా రూపొందింది. పాకిస్తాన్‌ నుంచి చాలాకాలంగా రాజస్తాన్, పంజాబ్‌ రాష్ట్రాలకు విచ్చలవిడిగా డ్రగ్స్‌ సరఫరా అవుతున్నాయి. సుదీర్ఘమైన మన దేశ సరిహద్దు డ్రగ్స్‌ మాఫియాకు అనుకూలంగా మారింది. భూ, జలమార్గాల ద్వారా, గస్తీదళాల కన్నుగప్పి డ్రగ్స్‌ను చేరవేస్తున్నట్లు చాలా సంవత్సరాల క్రితమే కేంద్ర నిఘా వర్గాలు ధృవీకరించాయి. నిజానికి మత్తు పదార్ధాలను పంపి, భారత యువతను నిర్వీర్యం చేయాలన్న కుట్రపూరిత వ్యూహం పాకిస్తాన్‌ది.

పంజాబ్‌లో నిషిద్ధ మాదక ద్రవ్యాల వాడకం దశాబ్దకాలంగా విపరీ తంగా పెరిగింది. ఆ రాష్ట్రంలో సామాన్యులు జరుపుకునే వేడుకలలో కూడా డ్రగ్స్‌ను చాక్లెట్ల రూపంలో అందజేస్తారని వార్తలు ఉన్నాయి. మద్యం, మాదక ద్రవ్యాలతో కూడిన విందులంటే పంజాబ్‌లో హోదాకు చిహ్నంగా పరిగణిస్తారు. అక్కడ డ్రగ్స్‌ మాఫియా వ్యాపార సామ్రాజ్య విలువ రూ. 60,000 కోట్లు అని అంచనా! పంజాబ్‌తో పోలిస్తే హరియాణాలో అవి కొంతవరకూ తగ్గుముఖంలో ఉన్నప్పటికీ, ‘హుక్కా’ను బహిరంగంగా వాడుతున్నారు. విదేశీ వికృత సంస్కృతికి అద్దం పట్టే ‘రేవ్‌ పార్టీ’లు దేశ రాజధాని శివారు ప్రాంతాల్లో జరుగుతున్నట్లు ఎన్నోసార్లు వెల్లడైంది. రాజస్తాన్‌ సంపన్న వర్గాల పిల్లల్లో 20% మంది డ్రగ్స్‌కి బానిసలైనట్లు కొన్ని స్వచ్ఛంద సంస్థలు పేర్కొం టున్నాయి.

ప్రపంచ సమస్యగా డ్రగ్స్‌
నిషిద్ధ మత్తుపదార్థాల సమస్య అనేక దేశాలను పట్టిపీడిస్తున్నది. ఐక్యరాజ్యసమితికి చెందిన మాదకద్రవ్యాల నేరాల లెక్కల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా మత్తుమందు వినియోగదారుల సంఖ్య కొన్ని కోట్లకు పెరిగింది. అంతర్జాతీయంగా ‘హెరాయిన్‌’వాడకం నాలుగు వందల టన్నులకు మించి ఉన్నదని ‘మాదక ద్రవ్యాల ప్రపంచ అధ్యయన నివేదిక (వరల్డ్‌ డ్రగ్‌ రిపోర్టు)’ స్పష్టం చేసింది. గత ఏడాది ఫిలిప్పీన్స్‌ దేశంలో జరిగిన అధ్యక్ష ఎన్నికలలో రొడ్రిగో డుటెర్టే అనే అభ్యర్థి తనను అధ్యక్షునిగా ఎన్నుకొంటే మత్తు పదార్ధాలను సేవించేవారిని నిర్దాక్షిణ్యంగా ప్రభుత్వమే అంతమొందించే చట్టాన్ని చేస్తానంటూ హామీ ఇచ్చి యావత్‌ ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. తన హామీని సమర్ధించుకొంటూ, తమ దేశ మానవ వనరులను కాపాడుకోవడానికి అంతకుమించిన మార్గం లేదని పేర్కొన్న రొడ్రిగోనే అధ్యక్షుడిగా ఎన్నుకోవడం చూస్తే ఫిలిప్పీన్స్‌ ప్రజలు ఆ సమస్యతో ఎంతగా విసిగిపోయారో అర్థమవుతుంది.

భారత్‌లో ‘హెరాయిన్‌’ వినియోగం గతంలో 20 టన్నులు. ఇప్పుడు అది ఐదారు రెట్లకు పెరిగినట్లు అంచనా. దశాబ్దం క్రితం నిర్వహించిన సర్వే ప్రకారం భారత్‌లో మత్తు పదార్థాలు సేవిస్తున్న వారి సంఖ్య 9 కోట్లు దాటింది. కొన్ని రోజుల క్రితం డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) అధికారులు చెన్త్నె శివార్లలో రూ. 71 కోట్ల విలువైన మాదక ద్రవ్యాల్ని పట్టుకొన్నారు. 2016 అక్టోబర్‌లో ఉదయ్‌పూర్‌లోని ఓ పరిశ్రమ నుంచి డీఆర్‌ఐ స్వాధీనపరచుకొన్న 23.5 టన్నుల నిషేధిత మండ్రాక్స్‌ మాత్రల విలువ రూ. 3,000 కోట్లు! ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు మత్తు పదార్థాల నియంత్రణకు తగిన వ్యవస్థను పటిష్టపర్చకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. మాదక ద్రవ్యాల సరఫరాను నియంత్రించడానికి ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఇప్పటికీ ప్రత్యేకమైన మత్తుపదార్ధాల నియంత్రణ వ్యవస్థే లేదు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) విభాగం ఒకటి హైదరాబాద్‌లో ఉన్నా, నామమాత్రంగా ఇద్దరు ముగ్గురు సిబ్బందితో నడుస్తున్నది. ఈ వాతావరణాన్ని స్మగ్లర్స్‌ తమకు అనుకూలంగా మలుచుకొంటున్నారు. అలాగని మత్తు పదార్థాల నియంత్రణ వ్యవస్థలు పూర్తిగా నిద్రావస్థలో ఉన్నాయని అనడానికి లేదు. మత్తు పదార్థాల సరఫరా, విక్రయాలకు సంబంధించి దేశంలో ఏటా 40 వేల మందికి పైగా అదుపులోకి తీసుకుంటున్నారు. కేసులు పెడుతున్నారు. కొందరికి శిక్షలు కూడా పడుతున్నాయి. కానీ, ఆ శిక్షలు పూర్తి చేసుకొని వచ్చి అదే వ్యాపారంలో కొనసాగుతూ, మళ్లీ మళ్లీ పట్టుబడిన సందర్భాలు లేకపోలేదు.

ప్రమాదం అంచున తెలుగు రాష్ట్రాలు
తెలుగు రాష్ట్రాలలో పరిస్థితి అదుపులో ఉన్నప్పటికీ ఇటీవల హైదరాబాద్‌లో డ్రగ్స్‌ సరఫరా, వాడకం ఎక్కువైంది. వాస్తవ పరిస్థితిని మీడియా ఎక్కువ చేసి చూపించడం వల్ల నగరానికున్న బ్రాండ్‌ ఇమేజ్‌ తగ్గుతుందని కొందరు పసలేని వాదన చేస్తున్నారు. వార్తలను దాచినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదు. హైదరాబాద్‌లోగానీ, మిగతా ప్రాంతాల్లోగానీ డ్రగ్స్‌ వాడకం పెరగడం అన్నది ఒక్కరోజులో జరిగింది కాదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో నిరుడు 3,580 కిలోల గంజాయి, నాలుగు కిలోల ‘‘అల్ఫాజోమ్‌’’ పట్టుబడ్డాయి.
నిజానికి మద్యం కూడా మత్తు పదార్థామే! కానీ మద్యపానాన్ని ఆదాయం కోసం పాలకులే పెంచిపోషిస్తున్నారు. మద్యపానం వల్ల జరుగుతున్న అరిష్టం అంతా ఇంతా కాదు. అనేక నేరాలకు, ప్రమాదాలకు, కుటుంబ కలహాలకు, అత్యాచారాలకు మద్యపానమే కారణం. ఒకపక్క మద్యం తాగమని ప్రోత్సహిస్తూ మరోపక్క తాగి వాహనాన్ని నడిపితే శిక్షలంటూ ప్రభుత్వాలు ద్వంద్వవైఖరిని అవలంబిస్తున్నాయనే విమర్శలు లేకపోలేదు. ఇక ధూమపానం విషయంలో చట్టాలు కోకొల్లలు. కానీ, వాటి అమలు నామమాత్రమే. ప్రపంచవ్యాప్తంగా 140 కోట్ల మందికి పైగా ధూమపానంలో మునిగి తేలుతున్నారని ఎన్నో నివేదికలు వెల్లడించాయి. సిగరెట్లలో కూడా మాదక ద్రవ్యాలను నింపుతున్నారు.

చట్టాలతో పరిష్కారం అవుతుందా?
మత్తు పదార్ధాలకు పిల్లలు బానిసలైపోతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్న ఆవేదనతో ఓ స్వచ్ఛంద సంస్థ ప్రజాహిత వ్యాజ్యాన్ని (పిల్‌) సుప్రీం కోర్టులో దాఖలు చేసిన సందర్భంగా స్పందించిన సర్వోన్నత న్యాయస్థానం ‘రోగగ్రస్త జాతిని కాదు మనం కోరుకొనేది’ అని స్పష్టం చేసింది. దేశంలో విచ్చలవిడిగా సరఫరా అవుతున్న మాదక ద్రవ్యాల ముప్పు నుంచి భావి భారతపౌరులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని సుప్రీంకోర్టు తెలియజేయడమే కాకుండా అందుకు అవసరమైన సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలు చేయాలని ఆదేశించింది. మత్తు పదార్థాలకు బానిసలైన వారి గణాంకాలను రూపొందించాలనీ, మాదక ద్రవ్యాల మాఫియాపై ఉక్కు పాదాన్ని మోపడానికి ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేయాలనీ ఆదేశించింది.

భారత్‌ వంటి ప్రజాస్వామ్య దేశాల్లో నిషిద్ధ డ్రగ్స్‌ చలామణిలాంటి సమస్యలను పరిష్కరించడానికి కఠినమైన చట్టాలను అమలు చేయాలి. నిజానికి అలాంటి మాఫియా ఆట కట్టించడానికి కఠినమైన నార్కోటిక్‌ డ్రగ్స్‌ అండ్‌ సైకో ట్రాఫిక్‌ సబ్‌స్టాన్సెస్,1985 (ఎస్‌డీపీఎస్‌) లాంటి పదునైన చట్టాలు మనకున్నాయి. కేవలం చట్టాలు చేసి చేతులు దులుపుకోవడంతోనే మాదక ద్రవ్యాల విషవలయం బలహీనపడదు. ఒకవైపు కఠిన చట్టాలను అమలుచేస్తూనే పిల్లలను మాదకద్రవ్యాల బారి నుంచి రక్షించుకొనేందుకు ప్రజాచైతన్య కార్యక్రమాలు చేపట్టాలి. ముఖ్యంగా మత్తు పదార్థల వల్ల సంభవించే అనర్థాలను తెలియజెప్పగలగాలి. మద్యం, మత్తు పదార్ధాలు మనిషి జీర్ణాశయం, కాలేయం, గుండె, మెదడు వంటి శరీర భాగాలను వేగంగా దెబ్బ తీసి మరణానికి చేరువ చేస్తాయని వైద్యులు చేస్తున్న హెచ్చరికలను ప్రచారాంశాలుగా మార్చాలి. మత్తు పదార్థాలు సృష్టించే మారణ హోమం నుంచి జాతిని కాపాడుకోవడం ప్రభుత్వాల ప్రాధాన్యత కావాలి! దానిని అత్యంత ముఖ్యమైన సామాజిక బాధ్యతగా స్వీకరించాలి. ప్రజలను భాగస్వాములను చేసి మారణహోమం సృష్టించే మత్తు పదార్థాల అక్రమ రవాణా పంపిణీ, వాడకం వంటి వాటిని సమూలంగా నిర్మూలించాలి.

వ్యాసకర్త ఏపీ శాసనమండలి ప్రతిపక్ష నాయకులు
డా. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు
మొబైల్‌ : 99890 24579

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)