amp pages | Sakshi

ఏదీ అఫ్ఘాన్ శాంతి తీరం?

Published on Wed, 10/30/2013 - 01:27

‘శాంతి చర్చల’ ప్రహసనానికి తెరదించిన అమెరికా... అధ్యక్ష ఎన్నికల కోసం ఎదురు చూస్తోంది. కొత్త అధ్యక్షుడైనా తమ మాట వింటాడని దాని ఆశ.
 
 ఆలూ లేదూ చూలూ లేదూ... అంటారే సరిగ్గా అలా ఉంది అఫ్ఘానిస్థాన్ అధ్యక్ష ఎన్నికల సంరంభం. సెప్టెంబర్ 18-అక్టోబర్ 6 మధ్య నామినేషన్లకు గడువు ముగిసిపోవడమే కాదు, అర్హులుగా బరిలో నిలిచిన వారి జాబితా కూడా ఖరారైంది. యుద్ధ ప్రభువులు, మాజీ మంత్రులుసహా అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ సోదరుడు ఖయూం కర్జాయ్ కూడా పోటీపడుతున్న పది మందిలో ఉన్నారు. ఇంతకూ వచ్చే ఏడాది ఏప్రిల్ 5న జరగాల్సిన ఎన్నికలు అసలు జరుగుతాయా? ఎన్నికలను జరగనిచ్చేది లేదని తాలిబన్‌ల అధినేత ముల్లా మొహ్మద్ ఒమర్ సోమవారం హెచ్చరించారు. తాలిబన్లే కాదు ఏ మిలిటెంటు గ్రూపూ పాల్గొనని ఈ ఎన్నికల ప్రహసం జరిగినా... వచ్చే ఏడాది చివరికి అమెరికా సహా నాటో బలగాలన్నీ నిష్ర్కమించిన తదుపరి తాలిబన్లను ఎదుర్కొని కొత్త ప్రభుత్వం నిలవగలదా? 2014 తర్వాత  ‘శిక్షణ అవసరాల కోసం’ అమెరికా సేనలను నిలిపి ఉంచడానికి అవకాశం కల్పించే ‘అమెరికా-అఫ్ఘాన్ ద్వైపాక్షిక రక్షణ ఒప్పందాన్ని’ కుదుర్చుకోవాలని అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ ఇటీవల అఫ్ఘాన్‌కు వెళ్లారు. అక్టోబర్ 11-12 తేదీల్లో ఆయన కర్జాయ్‌తో చర్చలు జరిపారు. ప్రధానాంశాలన్నిటిపైన ‘అంగీకారం’ కుదిరిందని కెర్రీ ప్రకటించారు. ఏ అంశాలపై  అంగీకారం కుదిరిందో, ఆ ఒప్పందంలో అసలు ఏముందో వెల్లడించ లేదు.  కెర్రీ దౌత్య విజయం ఎంతటి ఘనమైనదో... పత్రికా సమావేశంలో సైతం కాసింత నవ్వును పులుముకోలేకపోయిన ఆ ఇద్దరి మొహాలే వెల్లడించాయి. అవినీతిపరుడు, నమ్మరానివాడు అయిన కర్జాయ్ మొండి పట్టు వల్లనే చర్చలు విఫలమయ్యాయనేది అమెరికా ప్రభుత్వ అనధికారిక కథనం.
 
 కర్జాయ్ ‘మొండి పట్టు’ దేనిపైన? 2014 తర్వాత అఫ్ఘాన్‌లో ఉంచే అమెరికా సేనలకు అఫ్ఘాన్ చట్టాలు వర్తించకుండా ‘రక్షణ’ కల్పించడంపైన. ఆ రక్షణ లేనిదే తమ సేనలను నిలపడం అసాధ్యమని అమెరికా అంటోంది. అమెరికా తయారు చేసిన అఫ్ఘాన్ భద్రతా బలగాల ఉన్నత సైనికాధికారుల మండలి సైతం అధ్యక్షుని మొండి పట్టు వల్లనే ఒప్పందం కుదరలేదని అంటోంది. అమెరికా అండ లేకుంటే ఇరాన్, పాకిస్థాన్‌ల నుంచి ‘జాతీయ భద్రత’కు ముప్పు తప్పదని వారి వాదన. లేని విదేశీ ముప్పును చూడగలుగుతున్న సైనికాధికార మండలికి ఉన్న అసలు ముప్పు కనిపించకపోవడంలో ఆశ్చర్యం లేదు. 2001లో అమెరికా దురాక్రమణతో అధికారం కోల్పోయిన నాటి కంటే నేడు తాలిబన్ల బలం అనేక రెట్లు పెరిగిందని, వారి ప్రాబల్యం దేశమంతటికీ విస్తరించిందని అంతా అంగీకరించేదే. ఏడాదికి 50 వేల మంది సైనికులు పారిపోయే సైన్యంపై ఆధారపడి ఏ ప్రభుత్వానికైనా, అసలు తమకే అయినా ముప్పు తప్పదనేదే వారి నిజమైన ఆందోళన.
 
 సైన్యం నుంచి పారిపోతున్న వారిలో చాలామంది తాలిబన్లలో చేరుతున్నారనేది వేరే సంగతి. కర్జాయ్ అవినీతిపరుడు నిజమేగానీ అఫ్ఘాన్‌ను అవినీతిమయం చేసిన ఖ్యాతి అమెరికాదే. కర్జాయ్‌కి అది డబ్బు సంచులను చేరవేస్తున్న విషయం కూడా రచ్చకెక్కింది. ఎంత డబ్బు పోసినా కర్జాయ్‌ని పూర్తిగా కొనేయలేకపోయామనేదే అమెరికా బాధ. అమెరికా సేనలకు ‘రక్షణ’ అఫ్ఘాన్ ప్రభుత్వ అధికారాల పరిధిలోనిది కాదని, వచ్చే నెల్లో జరుగనున్న తెగల పెద్దల మండలి సమావేశం... ‘లోయా జిర్గా’ మాత్రమే ఆ సమస్యపై నిర్ణయం తీసుకోగలదని కర్జాయ్ వాదన. ఆయన మొండితనం ఏదన్నా ఉందంటే అది అమెరికా చెప్పినట్టు వినకపోవడమే. కర్జాయ్‌తో గత ఏడాది కుదుర్చుకున్న ‘వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందాన్ని’ నేడు గౌరవించని అమెరికాను కర్జాయ్ ఎందుకు నమ్మాలి? ఆ  ఒప్పందం ప్రకారం తమ సైనిక నిర్బంధ కేంద్రాల్లో ఉన్న బందీలనందరినీ వెంటనే అఫ్ఘాన్ దళాలకు బదలాయించాల్సి ఉన్నా అమెరికా ససేమిరా అంటోంది.
 
 అమెరికాతో కుదుర్చుకునే ఎలాంటి ఒప్పందాన్నీ అంగీరించేది లేదని కెర్రీ పర్యటనకు ముందే ముల్లా ఒమర్ ప్రకటించారు. అఫ్ఘాన్ అధ్యక్షునితో సైతం సంబంధం లేకుండా తాలిబన్లతో చర్చల కోసం నానా పాట్లూ పడ్డ బరాక్ ఒబామా ప్రభుత్వమే వారితో సయోధ్య కోసం కర్జాయ్ స్వయంగా చేస్తున్న ప్రయత్నాలకు విఘాతం కలిగించిం ది. కర్జాయ్ ప్రభుత్వంతో రహస్య దౌత్యం సాగిస్తున్న సీనియర్ తాలిబన్ నేత లతీఫ్ మెహసూద్‌ను అమెరికా అరెస్టు చేసింది. ఘోర పరాజయంతో అఫ్ఘాన్ నుంచి నిష్ర్కమిస్తున్నట్టు అనిపించకుండా పరువు దక్కించుకునేలా ఏదో ఒక ఒప్పందం కోసం, తమ సేనలను నిలిపి ఉంచే అవకాశం కోసం అమెరికా తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
 
 మరోవంక రష్యా 2014 తదుపరి అఫ్ఘాన్ నుంచి తమ దేశానికి విస్తరించనున్న జిహాదీ ముప్పును ఎదుర్కోడానికి సిద్ధమౌతోంది. అఫ్ఘాన్‌కు పొరుగు నున్న తజకిస్థాన్‌తో ఇటీవలే అది 40 ఏళ్ల పాటూ ఆ దేశంలో తమ సేనలను నిలిపి ఉంచడానికి ఒప్పందం కుదుర్చుకుంది. అఫ్ఘాన్ ‘శాంతి చర్చల’ ప్రహసనానికి తెరదించిన అమెరికా... అధ్యక్ష ఎన్నికల ప్రహసనం కోసం ఎదురు చూస్తున్నట్టుంది. కర్జాయ్ తదుపరి అధ్యక్షుడైనా అమెరికా మాట వింటాడని దాని ఆశ. తాలిబన్లు ఈ క్రీడను చూస్తూ ఉంటార నే భ్రమ.
 - పిళ్లా వెంకటేశ్వరరావు

Videos

అమెరికాలో ప్రమాదంలో ప్రాణాలు విడిచిన తెలంగాణ యువకుడు

చంద్రబాబుకి బయపడి గుళ్లలో తలా దాచుకుంటున్నారు..

తాడిపత్రి హింసాత్మక ఘటనల వెనుక అసలు హస్తం

కుప్పం నుండి ఇచ్చాపురం వరకు అందుకే పోలింగ్ శాతం పెరిగింది

పోలీసులు ఏ రాజకీయ పార్టీల ప్రలోభాలకు లోను కాకుండా నిస్పక్షపాతంగా పనిచెయ్యాలి

ఏపీ ఎన్నికల అల్లర్ల పై సిట్ విచారణ.. ఇప్పటికే పోలీసుల ఫై వేటు

మోడీపై పోటీ చేస్తున్న శ్యామ్ కు షాక్..

మాట నిలబెట్టుకునే మా అన్నకు మా ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి

అచ్చెన్నాయుడు రిగ్గింగ్.. అడ్డుకున్న వారిపై దాడి

ప్రేమ పేరుతో యువకుడిని మోసం చేసిన యువతి

Photos

+5

Sangeetha Sringeri: పునీత్‌ రాజ్‌కుమార్‌ సమాధి వద్ద నటి బర్త్‌డే సెలబ్రేషన్స్‌ (ఫొటోలు)

+5

సంతోషంలో కావ్యా మారన్‌.. కేన్‌ విలియమ్సన్‌ను పలకరించి మరీ! (ఫొటోలు)

+5

అభిషేక్‌ శర్మ తల్లి పాదాలకు నమస్కరించిన శుబ్‌మన్‌ .. ఫొటోలు వైరల్‌

+5

ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా?.. ఫేమస్‌ టీటీ ప్లేయర్‌!(ఫొటోలు)

+5

ఒకప్పుడు చిన్నపాటి గదిలో.. ఇప్పుడు హీరోలకు ధీటుగా రూ.550 కోట్ల సంపద.. ఎవరో గుర్తుపట్టారా? (ఫొటోలు)

+5

Sireesha: భర్తతో విడాకులు.. ట్రెండింగ్‌లో తెలుగు నటి (ఫోటోలు)

+5

ఫ్యాన్స్‌లో నిరాశ నింపిన వర్షం.. తడిసిన ఉప్పల్ స్డేడియం (ఫోటోలు)

+5

లవ్‌ మీ సినిమా స్టోరీ లీక్‌ చేసిన బ్యూటీ, క్లైమాక్స్‌ కూడా చెప్పకపోయావా! (ఫోటోలు)

+5

Hyderabad Heavy Rains: హైదరాబాద్‌లో కుండపోత వాన.. భారీగా ట్రాఫిక్‌ జాం (ఫొటోలు)

+5

‘సర్‌.. నేను మీ అమ్మాయిని లవ్‌ చేస్తున్నా’.. 13 ఏళ్ల ప్రేమ, పెళ్లి! (ఫొటోలు)