శతవసంతాల ఉస్మానియా

Published on Sat, 04/08/2017 - 02:15

సందర్భం
ప్రముఖ రాజకీయనేతలు, కవులు, ఎంఎల్‌ జయసింహ, అజారుద్దీన్‌ వంటి స్టార్‌ క్రికెటర్లే కాకుండా ఇక్కడే చదివి, ప్రజలకు మెరుగైన జీవితం కోసం పోరాడుతూ తమ జీవితాలనే అర్పించిన ప్రముఖ విప్లవకారుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించనవసరం లేదు. వ్యవస్థకు విధేయులైన బానిసలను ఉత్పత్తి చేసిన చరిత్ర ఉస్మానియా క్యాంపస్‌కు లేదు. అదే సమయంలో ఇది పరివర్తనా రాజకీయాలకు పుట్టిల్లుగా ఉండేది. సంస్థలను భవిష్యత్తుకోసం సిద్ధం చేసినప్పుడే ఆ భవిష్యత్తు దాంట్లో అంతర్భాగంగా ఉంటుంది.

తెలంగాణ ప్రాంతంలోని ప్రధానమైన విశ్వవిద్యాలయంలో దాదాపు మూడు దశాబ్దాలపాటు అధ్యాపకురాలిగా ఉండటం, ఆ వర్సిటీ ఒడిదుడుకుల మధ్యే నూరేళ్లు పూర్తి చేసుకోవడాన్ని తిలకించడం ఒక విశిష్టమైన హక్కుగా భావిస్తున్నాను. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నేను పాఠాలు బోధించాను. ఈ నెలలో వర్సిటీ నూరవ వార్షికోత్సవాలను జరుపుకోనుంది. ఎవరైనా తన జీవితంలో, కాలంలో కాస్త వెనుకకు తిరిగి చూసుకుంటే ఒక విశిష్టమైన ముందుచూపును దర్శించవచ్చు కానీ అదే సమయంలో మరింత ఉత్తమంగా వ్యవహారాలను నడిపి ఉండవచ్చుకదా అనే విచారాన్ని కూడా కలిగించవచ్చు.

ఉస్మానియా క్యాంపస్‌ రాజకీయ చైతన్యానికి మారుపేరుగా ఉండేది. స్వాతంత్య్రానికి ముందు, 1948లో హైదరాబాద్‌ సంస్థాన విలీనానికి ముందు కాలం నాటి సమకాలీన సమస్యలలో అది పాలు పంచుకొనేది. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం కావచ్చు, మరింత సమానత్వంతో కూడిన లౌకిక సమాజంవైపుగా భారతీయ రాజకీయాలను మౌలికంగానే పరివర్తన చేయాలనే ఆకాంక్షను కలిగి ఉన్న ఇతర వామపక్ష ఉద్యమాలు కావచ్చు.. అనేక ప్రగతిశీల ఉద్యమాలకు ఉస్మానియా విద్యార్థులు, ఫ్యాకల్టీ మేధోపరమైన నాయకత్వాన్ని అందించారు.

ఉర్దూ స్థానంలో ఇంగ్లిష్‌ మాధ్యమం
దేశంలోనే, ప్రాంతీయ భాష అయిన ఉర్దూలో ఉన్నత విద్యను ప్రతిపాదించిన మొట్టమొదటి విద్యా సంస్థ ఉస్మానియా యూనివర్సిటీ. కానీ హైదరాబాద్‌ సంస్థానాన్ని భారత యూనియన్‌లో విలీనం చేసిన తర్వాత ఇంగ్లిష్‌ను బోధనా మాధ్యమంగా మార్చారు. దేశవ్యాప్తంగా, విదేశాల నుంచి కూడా సుప్రసిద్ధ విద్యావేత్తలను ఉస్మానియాలో బోధించేందుకు ఆహ్వానించారు.

పాఠశాల విద్యను ప్రాథమిక స్థాయిలో నిర్లక్యం చేయడం, మునుపటి సంవత్సరాల్లో ప్రాచుర్యంలో ఉన్న త్రిభాషా బోధననుంచి తెలుగు పాఠశాలలకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడం. పాఠశాల, ఇంటర్మీడియెట్, అండర్‌ గ్రాడ్యుయేట్‌ విద్యను ప్రైవేటీకరించడం వల్ల ప్రభుత్వ యూనివర్సిటీలకు సహాయం చేసేవారు కరువయ్యారు. ఇంగ్లిష్‌ భాషతో సంపర్కం లేనందున యూనివర్సిటీ వ్యవస్థలోకి వచ్చిన విద్యార్థులు పోటీతత్వంలో వెనుకబడి పోయారు.

బోధనా మాధ్యమం సమస్యతో, హైదరాబాద్‌ చుట్టుపక్కల జిల్లాల నుంచి వచ్చిన నిరుపేద విద్యార్థులను సంరక్షించడంలో వర్సిటీ పాత్రపై 1980, 90లలో బోధనా సిబ్బందికి, విద్యార్థులకు మధ్య ఘర్షణ జరిగింది. ఇది వర్సిటీ విద్యా వ్యవస్థకు పాలనాపరమైన, విద్యాపరమైన సవాలుగా నిలిచింది. విద్యావిభాగంలో చేరిన తర్వాతి ప్రారంభ సంవత్సరాల్లో అనేకమంది యువతీయువకులు తమ మాతృభాష్లలో (తెలుగు, ఉర్దూ) అసాధారణమైన సమర్థతను కలిగి ఉండటం చూశాము. ఉపాధి అవకాశాలు కూడా విస్తృతంగా ఉండేవి. ఈ విద్యార్థులకు మీడియా సంస్థల్లో, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో సంతృప్తికరమైన ఉద్యోగావకాశాలు లభించేవి.

90ల నాటికే ప్రైవేటీకరణ, వాణిజ్యం, ఉద్యోగాలను కాంట్రాక్టుమయం చేయడం, విద్యను వృత్తివిద్యగా మార్చడం, సామాజిక శాస్త్ర విద్యకు హానికలిగిస్తూ సాంకేతిక విద్యకు ప్రాధాన్యం ఇవ్వడం పెరిగింది. ఉన్నట్లుండి ఉద్యోగ నియామకాలు స్తంభించిపోయాయి.హేతుబద్దీకరణ పేరుతో బోధన, బోధనేతర సిబ్బందికిగాను మంజూరు చేసిన పోస్టులు కూడా బాగా తగ్గించి వేశారు. సీనియర్‌ టీచర్లు, ఉద్యోగులు రిటైర్‌ కావడం మొదలైంది. వీరి స్థానంలో కొత్త టీచర్లు, ఉద్యోగుల నియామకాలు జరగలేదు.

ప్రైవేట్‌ సెక్టర్‌ ఉద్యోగాలను అధికంగా సృష్టించదు.ఉదాహరణకు ప్రైవేట్‌ కాలేజీల్లోని జర్నలిజం విభాగాల్లో బోధనా ఫ్యాకల్టీని నియమించరు. వీటిలో చాలావరకు అన్ని ప్రత్యేకవిభాగాలకు ఒకే టీచర్‌ ఉంటారు. ఉపాధి అవకాశాలు కరువైన నేపథ్యంలో ఇంగ్లిష్‌ నాలెడ్జ్‌ అవసరమైన కాల్‌ సెంటర్లు, ఇతర సర్వీస్‌ ఉద్యోగాలు మాత్రమే అందుబాటులో ఉండేవి. దీంతో ఉన్నట్లుండి తెలుగు, ఉర్దూ మీడియం నుంచి ఇంగ్లిష్‌ మాధ్యమం కోసం డిమాండ్‌ పెరిగింది. బోధనా మాధ్యమంగా తెలుగు కావాలని, ఇంగ్లిష్‌ కావాలని ఘర్షిస్తున్న విద్యార్థి బృందాల మధ్య సంవత్సరాల పాటు వర్సిటీ పాలనాయంత్రాంగం నలిగిపోయింది.

ప్రభుత్వ పాఠశాలల మూసివేత
యూనివర్సిటీ ఉచిత ఇంగ్లిష్‌ భాషా కోర్సులను నడిపినప్పుడు, విద్యార్థులనుంచి భారీ స్పందన వచ్చింది. బోధనా మాధ్యమం సమస్య ఇంకా పరిష్కారం కాలేదు. ఇంగ్లిష్‌ విద్యపై డిమాండును నెరవేర్చనందున ప్రభుత్వ పాఠశాలలు మూతపడసాగాయి. అదేసమయంలో మాతృభాషనే బోధనా మాధ్యమంగా ఉంచాలనే బలమైన మేధోపరమైన తర్కం కూడా ఉండేది.

మనం గుర్తించవలసిన సమాధానం ఏదంటే జాబ్‌ మార్కెట్టే. విద్యావంతులైన యువతకు ప్రభుత్వం ఉపాధిని కల్పించకపోతే, శిక్షణ పొందిన ఉద్యోగుల లేమితో సంస్థలు కుప్పగూలుతున్నందున ఉన్న అవకాశాలు తగ్గిపోతుండగా.. యువతలో అసంతృప్తిని ఎదుర్కోవడం కొనసాగుతుంది. భారతీయ విద్యాసంస్థలు ప్రపంచ స్థాయిని అందుకోవడం లేదని మనలో చాలామంది తరచుగా విచారపడుతుంటారు. యూనివర్సిటీల్లో ప్రజాధనాన్ని వృ«థా పర్చరాదని ఎవరైనా అంటే మనం  చప్పట్లు కొడతాం కూడా. ఇది ఒక అభాస. అత్యున్నతమైన ప్రభుత్వరంగ సంస్థలను ఉద్దేశపూర్వకంగా దిగజార్చివేసే విధానాలు అవలంబిస్తూ వాటి పతనానికి బాటలు వేయడమే కాకుండా వాటి  స్థానంలో ప్రైవేట్‌ సంస్థలకు తలుపులు తెరుస్తూంటే కూడా ఒక సమాజంగా మనం ఎలాంటి ఆగ్రహం ప్రదర్శించం.

ఉదాహరణకు ఉస్మానియా యూనివర్సిటీ అద్భుతమైన ఇంజనీరింగ్‌ విద్యకు ప్రమాణాలను నెలకొల్పింది. ఈ వర్సిటీలో చదివిన ఇంజనీరింగ్‌ పట్టభద్రులు ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగాలు చేస్తున్నారు. అడోబ్‌ సీఈఓ శంతను నారాయణ్‌ వారిలో ఒకరు. ఇక పలు శాస్త్ర, సామాజిక విభాగాలు బోధనలో, పూర్వ విద్యార్థుల విజయాల్లో అద్భుత రికార్డులు కలిగి ఉన్నాయి.

ఇండియా టుడే మాజీ సంపాదకులు, ప్రముఖ జర్నలిస్టు ఎస్‌ వెంకట నారాయణ్, అసోసియేటెడ్‌ ప్రెస్‌ న్యూస్‌ ఏజెన్సీ గ్లోబల్‌ న్యూస్‌లో సుదీర్ఘకాలం పనిచేసి ప్రస్తుతం పీటీఐ సీఈవోగా ఉన్న  విజయం జోషి ఈ వర్సిటీ జర్నలిజం శాఖ విద్యార్థులే. ఇక్కడ చదివిన వందలాది జర్నలిస్టులు భారత్‌ లోనూ, ప్రపంచమంతటా కూడా వివిధ మీడియా సంస్థల్లో పనిచేస్తున్నారు.

ప్రముఖ రాజకీయనేతలు, కవులు, ఎంఎల్‌ జయసింహ, అజారుద్దీన్‌ వంటి స్టార్‌ క్రికెటర్లే కాకుండా ఇక్కడే చదివి, ప్రజలకు మెరుగైన జీవితం కోసం పోరాడుతూ తమ జీవితాలనే అర్పించిన ప్రముఖ విప్లవకారుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించనవసరం లేదు. వ్యవస్థకు విధేయులైన∙బాని సలను ఉత్పత్తి చేసిన చరిత్ర ఉస్మానియా క్యాంపస్‌కు లేదు. అదే సమయంలో ఇది పరివర్తనా రాజకీయాలకు పుట్టిల్లుగా ఉండేది. సంస్థలను భవి ష్యత్తుకోసం సిద్ధం చేసినప్పుడే ఆ భవిష్యత్తు దాంట్లో అంతర్భాగంగా ఉంటుంది.

నేను 1980ల చివర్లో ఉస్మానియాలో బోధన ప్రారంభించాను. ఆసమయంలో ఒకవైపు ప్రపంచీకరణ ద్వారా తీసుకొచ్చిన ప్రాపంచక దృక్పథం వైవు సమూల మార్పు, మరోవైపున భారత్‌లో సంకీర్ణ  రాజకీయాల మధ్య వర్సిటీ ఘర్షించేది. ఆనాటి ఆంధ్రప్రదేశ్‌లో పలు ప్రభుత్వాలు ప్రగతిశీల రాజకీయాలను పకడ్బందీగా అణచివేసిన ఫలితంగా క్యాంపస్‌లో ఆవరించిన శూన్యాన్ని మతపరమైన,  తిరోగామి రాజకీయాలు ఆక్రమించడం ప్రారంభించాయి. ప్రగతిశీల రాజకీయాలు కనుమరుగవడంతో సమస్యలపై ఉత్తేజకరమైన చర్చ, ప్రశ్నించే మనస్సులు లేక యూనివర్సిటీ విద్య ప్రజాస్వామ్యం  పునాదిగా కలిగిన తన మౌలిక విలువలను కోల్పోతూ వచ్చింది.

క్యాంపస్‌ జీవితంలో మతం చొరబాటు
1991 నాటికి బాబ్రీ మసీదు కేంపెయిన్‌ కోసం సమీకరణ జరిగింది. క్రమంగా రాజకీయ రూపం దాల్చిన మతం క్యాంపస్‌ జీవితంలో చొరబడింది. అయోధ్య రామాలయం కోసం ఇటుకలు  తీసుకోవడం కోసం నిర్బంధ విరాళాల సేకరణ, కాలేజీలు, హాస్టళ్లలోని టీచర్లు, విద్యార్థులలో బీభత్స వాతావరణం సృష్టించారు. అనేక ప్రభుత్వ యూనివర్సిటీ క్యాంపస్‌లలో ఇది కనిపించేది. మరో రాష్ట్రంలో ఆలయ ప్రాజెక్టు కోసం విరాళాల సేకరణ యూనివర్సిటీ విద్యార్థుల బాధ్యత కాదని, ప్రభుత్వం నుంచి సబ్సిడీ రూపంలో విద్యను పొందుతూ క్యాంపస్‌లో ఆరాధనకు విగ్రహాల స్థాపన  విద్యార్థుల పని కాదని అప్పట్లో ఎవ్వరూ బోధించేవారు కాదు.

ఆ సమయంలో విద్యాసంస్థల్లో ఆవరించిన మౌనం కారణంగా అకడ మిక్‌ కార్యక్రమాలను విచ్ఛిన్నపర్చే దిశగా వర్సిటీ పాలనా యంత్రాంగాలు లొంగుబాటు ప్రదర్శించాయి. పైగా క్రమశిక్షణ కుప్పగూలడంతో ఇతర ఉన్నత విద్యాసంస్థల్లో అంటే జాతీయంగా, అంతర్జాతీయంగా కూడా విద్యార్థులకు అనేక విద్యావకాశాలు తప్పిపోయాయి. అయితే దీనికి నిజాయితీ కలిగిన విద్యార్థులే మూల్యం చెల్లించారు. పాలన కొరవడిన క్యాంపస్‌ కారణంగా యూనివర్సిటీ ప్రతిష్ట కోల్పోయింది. ప్రభుత్వ యూనివర్సిటీలకు ఆపాదించిన ఈ అప్రతిష్ట  వాస్తవానికి ప్రైవేటీకరణకు రాజమార్గం తెరిచింది.

ప్రైవేట్‌ వర్సిటీలలో డబ్బు పెట్టి చదవగలిగన సంపన్న విద్యార్థులు ఇతర విద్యాసంస్థల్లోని తోటి విద్యార్థుల సమస్యలు, ప్రావీణ్యత లేని టీచర్లు, లాబ్‌ సౌకర్యం లేమి వంటి సమస్యల పట్ల మౌనం ప్రదర్శించారు. ఉస్మానియా యూనివర్సిటీ వంటి ప్రస్తుతం కొనసాగుతున్న ప్రభుత్వ విద్యాసంస్థలను పరిరక్షించి, బలోపేతం చేయవలసిందిగా ప్రభుత్వాలను డిమాండ్‌ చేయవలసిన బాధ్యత పౌర సమాజంగా మనందరిపైనే ఉంది. ఆయా ప్రాంత కమ్యూనిటీల మద్దతు, నిబద్ధతలే ప్రపంచ స్థాయి వర్సిటీల ప్రతిష్టకు కారణం.

రాజకీయనేతల్లాగే విద్యాసంస్థల పాలనాధికారులు కూడా తమ పదవులు శాశ్వతమని విశ్వసిస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీకి ఇప్పుడు వందేళ్లు. ఇది వందల సంవత్సరాలపాటు మనకు చోటునిస్తుంది.. ఒక గొప్ప విద్యా సంస్థ విలువను తగ్గించడమా లేక దాని ఉజ్వల భవిష్యత్తు కోసం బాటలు పరచడమా? దేనికోసం వారు చరిత్రకు గుర్తుండిపోవాలి అనే విషయాన్ని అయిదేళ్ల పదవీకాలంలో ఉన్న రాజకీయనేతలు, రెండేళ్ల పదవీకాలంలో ఉన్న పాలనాధికారులే నిర్ణయించుకోవలసి ఉంది.


వ్యాసకర్త ఉస్మానియా యూనివర్సిటీ జర్నలిజం పూర్వాధిపతి
పద్మజా షా

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ