amp pages | Sakshi

ఈ పద్దుతో పొద్దు పొడిచేనా?

Published on Sat, 02/28/2015 - 00:17

ఓటర్లు సందిగ్ధానికి తావులేని పూర్తి మెజారిటీతో భాజపా, నరేంద్ర మోదీలకు పట్టం గట్టారు. ఈ సదవకాశాన్ని అన్నివిధాలా సద్వినియోగం చేసుకుంటామని ప్రధాని, ఆర్థిక మంత్రి పలుమార్లు ప్రకటించారు. ఆర్థిక పునరుజ్జీవనానికి నూతన పంథాలో దిశానిర్దేశం చెయ్యడం తమ కర్తవ్యమని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో జైట్లీ ప్రవేశపెట్టనున్న పూర్తి స్థాయి మోదీ బడ్జెట్ సామాన్యుని ఆశలు, ఆకాంక్షలను ఏ మేరకు తీర్చబోతోంది? ప్రధాని చెబుతున్న ‘‘సబ్‌కా సాథ్ సబ్‌కా వికాస్’’ను సాకారం చేసే దిశగా సాగుతుందా?
 
 
గత సంవత్సరం ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్ భారతీయ జనతా పార్టీ దృక్పథాన్ని పూర్తిగా ఆవిష్కరించలేకపోయిందనీ, కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సృష్టించిన కుంభకోణాల బరువును మోస్తూ, నష్టాలను పూడ్చుతూ బండి లాగడం కొంత కష్టతరంగా మారిందనీ ఆర్థిక మంత్రీ, ప్రధాన మంత్రీ చెప్పుకొచ్చారు. సంపూర్ణ మార్పును కోరి భారత ప్రజలు సందిగ్ధానికి తావులేకుండా ఓటు చేసి, పూర్తి మెజారిటీతో భాజపా, నరేంద్ర మోదీలకు పట్టంగట్టడం అత్యంత ముదావహమైన విషయమని పేర్కొన్నారు.

ప్రజలు తమకు ఇచ్చిన ఈ సదవకాశాన్ని అన్ని విధాలా సద్వినియోగం చేసుకుంటామని ప్రధాని, ఆర్థిక మంత్రి ఎన్నోసార్లు ప్రకటించారు. ఆర్థిక పునరుజ్జీవనానికి నూతన పంథాలో దిశానిర్దేశం చెయ్యడం తమ కర్తవ్యమని స్పష్టం చేశారు.  గత మాసంలో జరిగిన ‘వరల్డ్ ఎకనమిక్ ఫోరం’ దావోస్ సదస్సులో మాట్లా డుతూ... జైట్లీ భారత ఆర్థిక వృద్ధి రేటు 9 శాతం కంటే అధికంగా ఉండేలా తగు చర్యలన్నిటినీ తీసుకుంటామని ప్రకటించారు.

ప్రధాని వరుసగా అమెరికా, జపాన్, చైనా, ఆస్ట్రేలియా దేశాలలో పర్యటిం చారు. తమ ‘మేక్ ఇన్ ఇండియా’ సంకల్పానికి ఊతం అందించవల సిందిగా, ప్రవాస భారతీయ మదుపరులను, విదేశీ పెట్టుబడిదారులను సాదరంగా ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో 28న జైట్లీ ప్రవేశపెట్టనున్న పూర్తిస్థాయి బడ్జెట్ రూపు రేఖలు ఏ విధంగా ఉండబోతున్నాయి? సామాన్యుని ఆశలు, ఆకాంక్షలను బడ్జెట్ ఎంత వరకు తీర్చబోతోంది? అనే ప్రశ్నలు ప్రముఖంగా చర్చకు వస్తున్నాయి.


 తొమ్మిది శాతం వృద్ధి సాధ్యమేనా?
 ఆర్థిక వృద్ధి రేటును పెంచడం, ఉద్యోగ అవకాశాలను పెంపొందింపజేసి నిరుద్యోగాన్ని తగ్గించడం, ద్రవ్యోల్బణాన్ని నియంత్రిస్తూ పేదరికాన్ని నిర్మూలించడం అనే మూడు అంశాలే ఏ ఆర్థిక మంత్రి అయినా తక్షణమే ఎదుర్కొనే మౌలిక సమస్యలు. గత ప్రభుత్వం బొగ్గు,  టెలికం 3జీ, 2జీ తదితర రకరకాల కుంభకోణాల్లో కూరుకు పోయిందనీ, ఫలితంగా ఆర్థిక పరిస్థితి దయనీయ పరిస్థితికి చేరిందనీ ప్రధాని నరేంద్రమోదీ ఘాటుగా విమర్శించారు.

విదేశాల్లో, ముఖ్యంగా స్విస్ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్ల ధనాన్ని వంద రోజుల్లోగా వెనక్కు రప్పిస్తామన్నారు. తద్వారా సమకూరే నిధులతో 130 కోట్ల భారత జనాభా ఐదేళ్ల వరకూ సంతోషంగా జీవించవచ్చని పేర్కొన్నారు. కానీ సంవత్సరం కావస్తున్నా మన కుబేరులు విదేశాల్లో దాచిన నల్లధనం తిరిగి వస్తున్న సూచనలు మాత్రం కానరావడం లేదు. ఈ నేపథ్యంలో నేడు ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టబోయే ‘యూనియన్ బడ్జెట్, 2015-16’ పెను సవాళ్లను ఎదుర్కోనుంది. దావోస్‌లో జైట్లీ చెప్పినట్లుగా 9 శాతం వృద్ధి రేటు కాదు కదా, కనీసం 6.5 శాతం వృద్ధి రేటును సాధించడం కూడా అనుమానమే. ఎందుకంటే ప్రస్తుత వృద్ధిరేటు 5.8 శాతం మాత్రమే.


 గత నాలుగు నెలల కాలంలో టోకు ధరల సూచి ఆధారంగా ద్రవ్యో ల్బణం 4.5 శాతం నుంచి 1.6 శాతానికి తగ్గింది. కానీ వినియోగదారుల ధరల సూచి ఆధారంగా చూస్తే ద్రవ్యోల్బణం గత నెల 6 శాతం దాటింది. కాబట్టి సామాన్యునిపై ధరల భారాన్ని తగ్గించి, కొనుగోలు శక్తిని పెంచాలంటే ధరల పెరుగుదలకు కళ్లెం వేయడం ప్రభుత్వ తక్షణ కర్తవ్యంగా కొనసాగబోతోంది. ఓఈసీడీ అంచనా వేసినట్టు 2015-16 సంవత్సరానికి మన ఆర్థికి వృద్ధి 6 శాతానికి చేరగలిగితే అదే మహాభాగ్యమని సంతృప్తి చెందాల్సిందే.


 ఉపాధి కల్పనే పెను సవాలు  
 గత ఐదు సంవత్సరాలుగా దేశ ఉపాధి రంగాన్ని పరిశీలిస్తే వ్యవసాయ రంగంలోనూ, వ్యవసాయ ఆధారిత రంగాలలోనూ ఉపాధి అవకాశాలు 48.9 శాతానికి కుంచించుకు పోయినట్లు తెలుస్తోంది. సేవా రంగంలో ఉపాధి అవకాశాలు కొంత మెరుగుపడ్డా, పారిశ్రామిక రంగంలో మాత్రం ఉద్యోగ అవకాశాలు 24.3 శాతానికి పరిమితమయ్యాయి. ఈ రంగాలలో ఉపాధి అవకాశాలను మెరుగుపరచడమే ప్రస్తుత ఆర్థిక మంత్రి ముందున్న జటిలమైన సమస్య. గత సంవత్సరం బడ్జెట్‌లో రూ.12,20,000 కోట్లు ప్రణాళికేతర వ్యయంగానూ, రూ. 5,75,000 కోట్లు ప్రణాళికా వ్యయంగానూ నిర్ధారించారు.

అంటే, గత సంవత్సరం పూర్తి బడ్జెట్ సమగ్ర వనరుల కేటాయింపు రూ. 18,00,000 కోట్ల మేరకు జరిగిందని భావించవచ్చు. ఈ సంవత్సరం (2015-16) బడ్జెట్‌లో రూ. 23,00,000 కోట్ల మేరకు వనరుల కేటాయింపు జరిగే అవకాశం ఉంది. ఇందులో 7 నుంచి 8 లక్షల కోట్ల రూపాయలు ప్రణాళికా వ్యయంగా ఉండే అవకాశం ఉంది. అంటే మిగతా రూ.15,00,000 కోట్లు ప్రణాళికేతర వ్యయమని భావించవచ్చు.


 పెట్టుబడులకు ప్రోత్సాహకాలు
 అయితే ఈసారి రిపబ్లిక్ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో రక్షణ ఒప్పందం కుదిరింది. అందులో భాగంగా రక్షణ రంగానికి పెద్ద మొత్తంలో నిధుల కేటాయింపు జరిగే అవకాశం ఉంది. అంటే పూర్తి బడ్జెట్‌లో 30 నుంచి 40 శాతం మేరకు రక్షణ కొనుగోళ్లకు కేటాయింపులు జరిగే అవకాశం ఉంది. ఆ మేరకు అభివృద్ధి కార్యక్రమాల బడ్జెట్‌లో లోటు ఏర్పడటం తప్పకపోవచ్చు. కీలకమైన మౌలిక సదుపాయాల రంగం అభివృద్ధికి దోహదపడేలా కార్పొరేట్ పెట్టుబడులకు ప్రోత్సాహం కల్పించే దిశగా ప్రభుత్వం కొన్ని పన్నులను తగ్గించవచ్చు.

తద్వారా దీర్ఘకాలిక పెట్టుబడులు భారీగా అవసరమయ్యే మౌలిక వసతుల రంగాన్ని ఆకర్షణీయంగా మార్చే ప్రయత్నాలు జరగవచ్చు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు పెద్ద పీట వేస్తున్న మోదీ ప్రభుత్వపు పూర్తి స్థాయి బడ్జెట్ కూడా ఆ దిశగా మొగ్గే అవకాశాలున్నాయి. 2011లో మన దేశం 3 కోట్ల డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించగలిగింది. కానీ ఆ తదుపరి అవి క్షీణించాయి. 2013లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 1.76 కోట్ల డాలర్లకు పడిపోయాయి.

కాబట్టి ప్రస్తుత స్థాయి నుంచి అవి 2011 నాటి స్థాయికి చేరడమే అనుమానాస్పదం. ఈ బడ్జెట్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ప్రోత్సాహకాలను కల్పించినా 2011 స్థాయికి మించి అవి పెరిగే అవకాశాలు తక్కువే. ఏది ఏమైనా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించడం మోదీ ప్రభుత్వ ముఖ్య ప్రాధాన్యాల్లో ఒకటి కాబట్టి ఈ అంశంపై బడ్జెట్ ఎలాంటి ప్రతిపాదనలు ముందుకు తేనుందో వేచి చూడాల్సిందే. బ్యాంకింగ్ రంగంలోని ప్రభుత్వ పెట్టు బడులను ప్రైవేటీకరించడం ద్వారా 2018 నాటికి రూ. 2,50,000 కోట్ల నిధులను సమకూర్చుకోవాలని యోచిస్తున్నట్టు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటిం చింది. అయితే బెసెల్-3 (బెసెల్ కమిటీ ఆన్ బ్యాంకింగ్ సూపర్‌విజన్) ఒప్పందానికి అనుగుణంగా ఇది ఇంకో యాభై వేల కోట్ల వరకు పెరి గినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు.


 ‘‘సబ్ కా సాథ్ సబ్ కా వికాస్’’ సాకారమయ్యేనా?
 వ్యవసాయరంగంలో నీటి పారుదల సౌకర్యాలను మెరుగుపరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గ్రామీణాభివృద్ధి, గ్రామీణ ఉపాధి కల్పన, గ్రామీణ పారిశ్రామికీకరణలకు కనీసం రూ. 1,500 కోట్లు కేటాయిస్తే తప్ప ఆ రంగాలలో మెరుగుదల సాధ్యం కాదు. విద్య, వైద్య రంగాలకు నిధుల కేటాయింపు విషయంలో చాలా ఏళ్లుగానే చొరవ లోపిస్తోంది. కార్పొరేట్ రంగం కబంధ హస్తాల నుంచి  వైద్య రంగాన్ని విముక్తం చేస్తే తప్ప వైద్యం సామాన్యులకు  అందుబాటులోకి వచ్చే అవకాశం లేదు.

ఎన్నో ఆశలతో సామాన్యులు గద్దెనెక్కించిన బీజేపీ ప్రభుత్వం దాన్ని తక్షణ కర్తవ్యంగా గుర్తించి, అందుకు అనుగుణమైన చర్యలు చేపట్టడం అవసరం. అప్పుడే ఈ ప్రభుత్వం సామాన్యుల ఆకాంక్షలకు చేరువ కాగలుగుతుంది. గత సంవత్సరం ఉన్నత విద్యా రంగానికి అంతంత మాత్రం గానే కేటాయింపులు జరిపిన ప్రభుత్వం ఈ సారైనా దానిపై దృష్టిని సారించి, తగినన్ని నిధులను సమకూరుస్తుందని ఆశిద్దాం. గత ప్రభుత్వం అమలులోకి తెచ్చిన మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాథి హామీ పథకం గ్రామీణ పేదరిక నిర్మూలనకు, జీవన ప్రమాణాల పెంపుదలకు గణనీయంగా తోడ్పడింది.

ఆ పథకాన్ని మరింత పకడ్బందీగా రూపొందించి, గ్రామీణ రంగంలోని ఉత్పా దక పెట్టుబడులను క్రమపద్ధతిలో పెంపొందింపజేయడం అవసరం. అప్పుడే గ్రామీణ పేద ప్రజల ఉపాధి, ఉత్పాదకతల పెంపుదల సాధ్యమవుతుంది. వారికి దీర్ఘకాలిక జీవిత భద్రత లభిస్తుంది. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని ఉపాథి హామీ పథకంలో తగు మార్పులు చేయడం అవసరం. అప్పుడే ప్రధాని చెబుతున్న ‘‘సబ్‌కా సాథ్ సబ్‌కా వికాస్’’ (అందరితో పాటు అందరికీ అభివృద్ధి) ఆచరణ సాధ్యమవుతుంది.

ప్రొఫెసర్ జె.మనోహర్ రావు
 (వ్యాసకర్త హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ ఆచార్యులు, మొబైల్ నం: 9440328879)  

Videos

ముద్రగడ పద్మనాభం స్పెషల్ ఇంటర్వ్యూ

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ విషప్రచారం..రోజా అదిరిపోయే కౌంటర్

పవన్ పై ఏపీ NRIలు కౌంటర్

చంద్రబాబుపై మధుసూధన్ రెడ్డి సెటైర్లు

టీడీపీ, జనసేనకు బిగ్ షాక్...వైఎస్సార్సీపీలో భారీ చేరికలు

జగనన్న కోసం సింగపూర్ నుంచి వచ్చి ఎన్నారైల ప్రచారం

జోరుగా వైఎస్సార్సీపీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారం

అవ్వ కాళ్ళు కడిగిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి

అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు

మంగళగిరిలో లోకేష్ ప్రచారానికి కనిపించని జనాదరణ

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌