amp pages | Sakshi

సత్రం భూములపై అంత ఆత్రమా?

Published on Mon, 06/27/2016 - 02:42

మోసపూరిత వేలాన్ని రద్దు చేయాలి: ధర్మాన
- ఈ దోపిడీపై అసెంబ్లీలో పోరాడతాం
- హిందువుల మనోభావాలను సర్కారు గౌరవించడం లేదు
- తమిళనాడులోని సత్రం భూములను సందర్శించిన వైఎస్సార్‌సీపీ నిజనిర్ధారణ కమిటీ
 
 సాక్షి ప్రతినిధి, చెన్నై/అమరావతి: సదావర్తి సత్రం భూముల వేలంలో అక్రమాలు చోటుచేసుకున్నాయని దేశమంతా కోడై కూస్తున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు మౌనం వహించడం వెనుక ఆంతర్యం ఏమిటని వైఎస్సార్‌సీపీ నిజనిర్ధారణ కమిటీ చైర్మన్ ధర్మాన ప్రసాదరావు నిలదీశారు. ఈ భూములకు మంచి ధర దక్కడానికి మరోసారి వేలం వేస్తే ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎకరా రూ.6.25 కోట్ల విలువైన భూములను వేలంలో రూ.27 లక్షల చొప్పున అధికార పార్టీ నేతలకు కట్టబెట్టారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ పెద్దల దోపిడీపై అసెంబ్లీలో పోరాడతామని స్పష్టం చేశారు.

 ప్రభుత్వానికి రూ.978 కోట్ల నష్టం  
 గుంటూరు జిల్లా అమరావతిలోని సదావర్తి సత్రానికి తమిళనాడు రాజధాని చెన్నైకి సమీపంలో ఉన్న విలువైన భూములను ఏపీ దేవాదాయ శాఖ వేలంలో అధికార పార్టీ నేతలకు అతి తక్కువ ధరకే కట్టబెట్టిన సంగతి తెలిసిందే. దాదాపు రూ.1,000 కోట్ల విలువైన 83.11 ఎకరాలను టీడీపీ నాయకులు వేలంలో రూ.22 కోట్లకే దక్కించుకున్నారు. అంటే ప్రభుత్వం రూ.978 కోట్లు నష్టపోయింది. ఈ కుంభకోణం వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉన్నట్లు ఆరోపణలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో వాస్తవాలను పరిశీలించేందుకు ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ ఐదుగురు సభ్యులతో నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ చైర్మన్, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు నేతృత్వంలో సభ్యులు కాకాణి గోవర్ధన్‌రెడ్డి(ఎమ్మెల్యే), ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఎమ్మెల్యే), పార్థసారథి(మాజీ మంత్రి), మర్రి రాజశేఖర్(గుంటూరు జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు) ఆదివారం చెన్నై సమీపంలోని తాలంబూరులో ఉన్న సదావర్తి సత్రం భూములను పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి, భూముల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ధర్మాన ప్రసాదరావు మాట్లాడారు.

 రిజిస్ట్రేషన్‌కు అనుమతి ఇవ్వొద్దు
 ‘‘సదావర్తి సత్రం భూముల కుంభకోణాన్ని వైఎస్సార్‌సీపీ వెలికి తీసింది. వేలంలో నిబంధనలను పాటించలేదని సాక్షాత్తూ దేవాదా యశాఖ ఉన్నతాధికారి భ్రమరాంబ చెప్పారు. ఈ వేలాన్ని తక్షణమే రద్దు చేయాలి.భూముల వేలంలో సీఎం కుమారుడు లోకేశ్ ప్రమేయం లేదని భావిస్తే అదే మాట చెప్పండి. మంత్రి జోక్యం ఉందంటే ఆయనను సస్పెండ్ చేయండి. ఆ భూముల రిజిస్ట్రేషన్‌కు ప్రభుత్వం అనుమతి ఇవ్వొద్దు. హిందువులను, వారి మనోభావాలను ప్రభుత్వం గౌరవించడం లేదు’’ అని ధర్మాన దుయ్యబట్టారు.

 కోర్టు నుంచి అనుమతి పొందారా?
 ‘‘సదావర్తి సత్రం భూములకు తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించిన ధర ఎకరా రూ.6.25 కోట్లు. అవే భూములను ఏపీ ప్రభుత్వం ఎకరా రూ.27 లక్షల చొప్పున విక్రయించడం దారుణం. ఈ భూములను సొంతం చేసుకున్నవారంతా అధికార తెలుగుదేశం పార్టీ వారే. వేలం పాటకు ముందు వారంతా వేర్వేరుగా చెల్లించిన డిపాజిట్ మొత్తం పాట ముగిసిన తరువాత ఒకే వ్యక్తి తరఫున ఎండోమెంట్‌లో జమ కావడం కుమ్మక్కు విధానాలకు నిదర్శనం. ఎండోమెంట్ భూములను అమ్మదలుచుకుంటే హైకోర్టు నుంచి అనుమతి పొందాలి.వేలం గురించి నోటీసు బోర్డులో పెట్టలేదు. ప్రముఖ పత్రికల్లో ప్రకటనలు ఇవ్వలేదు. ఆస్తుల విలువను బట్టి అదేస్థాయి అధికారికి ఈ బాధ్యతను అప్పగించాల్సి ఉండగా గ్రేడ్-1 అధికారైన శ్రీనివాసులరెడ్డిని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌ను చేశారంటే ఇదంతా పథకం ప్రకారమే జరిగినట్లు తెలుస్తోంది. రహస్యంగా వేలం పాటలు నిర్వహించి దేవుడి భూములను కాజేద్దామనుకుంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. ప్రభుత్వ పెద్దల దోపిడీపై అసెంబ్లీలో పోరాడుతాం. కమిటీ నివేదికను పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి సమర్పిస్తాం’’ అని ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు.
 
 ఎకరానికి రూ.2 కోట్లకుపైగా చెల్లించేవాళ్లం  
 సదావర్తి సత్రం భూములకు వేలంపాట నిర్వహించినట్లు తమకు తెలియదని, తెలిస్తే ఎకరానికి రూ.2 కోట్లకు పైగా ధర పెట్టి తామే కొనుక్కునేవారమని తాలంబూరు గ్రామస్తులు, అక్కడి తెలుగువారు వైఎస్సార్‌సీపీ నిజనిర్ధారణ కమిటీకి చెప్పడం గమనార్హం.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌