amp pages | Sakshi

కేంద్రమంత్రి లగేజిని పోగొట్టిన ఎయిరిండియా!

Published on Fri, 09/19/2014 - 16:04

ప్రయాణికుల విషయంలో ఎయిరిండియా ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో మరోసారి వెల్లడైంది. సాక్షాత్తు కేంద్ర వాణిజ్య, పరిశ్రమలశాఖ సహాయమంత్రి నిర్మలా సీతారామన్ సూట్కేసునే ఎయిరిండియా సిబ్బంది పోగొట్టారు. దాంతో ఆమె జి-20 మంత్రుల గౌరవార్థం ఏర్పాటుచేసిన విందుకు హాజరు కాలేకపోయారు. పాలమ్ కోవ్లో జరుగుతున్న రిసెప్షన్కు హాజరు కాలేకపోయినందుకు నిర్మలా సీతారామన్ ట్విట్టర్ ద్వారా సారీ చెప్పారు. తాను రూంలోనే ఉండిపోయానని, ఎయిరిండియా అధికారులు ఇంతవరకు తన లగేజి గురించి ఏమీ చెప్పలేదని ఆమె తెలిపారు.

ఆస్ట్రేలియాలో జరుగుతున్న జి-20 సదస్సుకు భారత ప్రతినిధిగా హాజరైన ఆమె లగేజి ఎయిరిండియా విమానంలో పోయింది. ఆమె ముందుగా సిడ్నీలో దిగి, అక్కడి నుంచి మరో విమానంలో కెయిర్న్స్ వెళ్లారు. అక్కడ తన లగేజి కోసం చూసుకోగా.. ఎక్కడా కనపడలేదు. తన దుస్తులన్నీ ఆ సూట్కేసులోనే ఉండిపోయాయని, కెయిర్న్స్లో తాను కొనుక్కుందామన్నా చీరలు దొరుకుతాయన్న నమ్మకం లేదని అంతకుముందు మరో ట్వీట్లో తెలిపారు. చిట్ట చివరకు తన లగేజి ఎలాగోలా దొరికిందని, అందులోనే తన ఫోన్, ఐప్యాడ్ ఛార్జర్ కూడా ఉన్నాయని ఆమె చివరకు తెలిపారు. సూట్కేసు తిరిగిచ్చిన ఎయిరిండియాకు కృతజ్ఞతలు చెప్పారు.