amp pages | Sakshi

పోలీసులు నోటీసులు... అసదుద్దీన్ విమర్శలు!

Published on Tue, 05/31/2016 - 19:59

బెంగళూరు: గతంలో బీజీపీపై అస్త్రాలు ఎక్కుపెట్టిన ఎంఐఎం పార్టీ నేత అసదుద్దీన్ ఒవైసీ తాజాగా కాంగ్రెస్ పై విమర్శనాస్త్రాలను సంధిస్తున్నారు. కర్ణాటక బీజాపూర్ లో నిర్వహించదలచుకున్న ఏఐఎంఐఎం బహిరంగ సభకు అసద్ హాజరు కావొద్దంటూ బెంగళూరు పోలీసులు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో  ఆయన స్థానిక కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు.   

ఆల్ ఇండియా మజ్లిస్-ఇ ఇతెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) పార్టీ కర్ణాటకలో నిర్వహించనున్న బహిరంగ సభకు అసదుద్దీన్ కు అనుమతి లేదంటూ పోలీసులు నోటీసులు పంపించారు. ఎంఐఎం పార్టీ సభ నిర్వహణకు పోలీసులను అనుమతి కోరగా అందుకు నిరాకరించడంతోపాటు... అసద్ కు నోటీసులు జారీ చేశారు.

పోలీసులు నోటీసులు పంపించడంతో ఆగ్రహించిన ఎంపీ... వారికి పూల బొకేలు ఇచ్చి పంపించడమే కాక, కాంగ్రెస్ పై విమర్శలు గుప్పిస్తూ ట్వీట్ చేశారు. జూన్ 1న బీజాపూర్ లో నిర్వహించే బహిరంగ సభకు కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం తనను అడ్డుకుంటోందని, ''ఇదేనా సమానత్వం అంటే... ఇక మీకూ బీజేపీ కి తేడా ఏముంది?'' అంటూ అసద్ తన ట్వీట్లో విమర్శలు గుప్పించారు.  

''గత 30 రోజుల్లో మహరాష్ట్రలో 5 సభలను నిర్వహించాను, తమిళనాడులో 3 ఎలక్షన్ మీటింగ్స్ నిర్వహించాను, అయితే ప్రస్తుతం కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం సిగ్గుపడేలా వ్యవహరిస్తోంది'' అంటూ మరో ట్వీట్లో  ఎస్. సిద్ధిరామయ్య ప్రభుత్వమే లక్ష్యంగా అసదుద్దీన్..  విమర్శించారు. ఇటీవల భారత్ మాతాకీ జై అనడాన్ని వ్యతిరేకించి... అసద్ అనేక విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే.