amp pages | Sakshi

ఎండకు పూచిన పాటలు

Published on Tue, 04/16/2019 - 00:01

వెలుతురు సోకని చీకటి గుహల్లో నలిగింది చాలు... ఇరుక్కుని బతుకుతున్నది చాలు... అలా ప్రకృతిలో పడండి... ఎండను తినండి...సూర్యుణ్ణి తుంచి బుగ్గన భగ్గున పెట్టుకోండి... అని జూ.ఎన్టీఆర్‌ ‘ప్రణామంప్రణామం ప్రణామం... ప్రభాత సూర్యుడికి ప్రణామం’ అని పాడాడు ‘జనతా గ్యారేజ్‌’ సినిమాలో. పైన సూర్యుడు ముచ్చటపడి చూస్తూ ఉండగా,బుల్లెట్‌ బండ్ల మీద ఉడుకు నెత్తురు కుర్రకారు వాగుల్ని వంకల్ని డొంకల్ని దాటి,కొండ కొసల్ని ఎక్కి, పచ్చదనాన్ని కావలించుకోవడం చూస్తే శక్తి వస్తుంది. సూర్యుడి నుంచి సుషుప్తిని విదిల్చికొట్టే చురుకు అందుతుంది.

సినిమా కవులకు, సినీ సందర్భాలకు ఎండ దొరికేది తక్కువ. వెన్నెల, పున్నమి, జాబిలి, కలువ అనగానే కవులు చెలరేగిపోతారు. అదే ఎండ అనగానే బండబారిపోతారు. ఎండలో అంత భావుకత ఏముంటుందని వారి అభిప్రాయం. కాని ఎండ కూడా వేడుక వంటిదే. భళ్లున వెలిగే పండుగలాంటిదే. ఎండ నడిపే కథ ఉంటుంది. ఎండ నడిపే సన్నివేశం ఉంటుంది. ఎండ లేపి కూర్చోబెట్టే కూసుదనం ఉంటుంది.  తెలుగు సినిమాల్లో అలాంటి కవి సమయాలు కూడా ఉన్నాయి. అల్లాంటి పాటలు మరపునకు రాకుండా ఉండిపోయాయి.

అసలు సూర్యుణ్ణి కొలిచే తొలి ఛాన్సు ఏ ఎన్టీఆరో ఏఎన్నారో కాకుండా గుమ్మడి దక్కించుకోవడం ఆయన నటజీవితంలో తొలిపొద్దు వంటి అనుభవం. ‘దినకరా శుభకరా దేవా దీనాధార తిమిర సంహార’ అని ‘వినాయక చవితి’ సినిమాలో ఆయన పాడిన పాట ఆయననూ ఘంటసాలనూ రాసిన సముద్రాలను తెలుగు నేలన ప్రభాతాలు ఉన్నంత కాలం ఉంచేలా చేశాయి. అయితే సోషల్‌ సినిమాలు వచ్చేసరికి సూర్యుణ్ణి చూసే పద్ధతి మారింది. శ్రీశ్రీని పూనకం తెచ్చుకున్న ఆత్రేయ ‘తోడి కోడళ్లు’ సినిమాలో సిగరెట్‌ పొగలు వదులుతున్న అక్కినేని చేత ‘నిన్ను మించిన కన్నెలెందరో మండుటెండలో మాడిపోతే వారి బుగ్గల నిగ్గు నీకు వచ్చి చేరెను తెలుసుకో’ అని ‘కారులో షికారుకెళ్లే’ ఒక పాలబుగ్గల అమ్మాయిని ఎద్దేవా చేస్తాడు. అయితే ‘లేత మనసుల’తో హిట్‌ అయిన రామ్మోహన్‌ ‘కన్నెమనసులు’ సినిమాలో గుర్రం మీద షికారు చేస్తూ ఉదయాన్ని, తొలి ఎండనీ మైదానాల్లో స్పర్శ చెందుతూ ‘ఈ ఉదయం నా హృదయం కురులు విరిసి ఆడింది పలకరించి పాడింది’ అని పాడటం జనానికి నచ్చింది. అదే రామ్మోహన్‌తో ఇంట్రడ్యూస్‌ అయిన సూపర్‌ స్టార్‌ కృష్ణ ఖాతాలో వేరొక వేకువపాట ఉంది. ‘ఇద్దరు మిత్రులు’ సినిమా కోసం శోభన్‌బాబుతో కలిసి ‘ఎన్నాళ్లో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే ఇన్నినాళ్లు దాచిన హృదయం ఎగసి ఎగసి పడుతుంటే ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి’ ఆయన పాడిన పాట ఘంటసాల, బాలుల జుగల్‌బందీని బూందీ కంటే తియ్యగా గ్రామ్‌ఫోన్‌ రికార్డు మీద రికార్డు చేసింది. 
కాని సాధారణంగా తెలుగు సినిమాల్లో ఉదయాలంటే ఆడవాళ్లవి. వాళ్లు వేకువజామునే లేవడం, పశువులకు ఇంత గ్రాసం పడేయడం, తల స్నానం చేసి సిగను టవల్‌తో పాటు చుట్టి పెట్టడం, ఇంటి ముందు ముగ్గు వేయడం, తులసి కోటకు ప్రదక్షిణాలు పూర్తి చేయడం, భర్తకు బెడ్‌ కాఫీ... ఇవన్నీ తప్పని పల్లవులు చూపే ప్రియచర్యలు. బాపు ఏ ముహూర్తాన ‘ముత్యాలముగ్గు’ కోసం ఆరుద్రతో ‘ముత్యమంతా పసుపు ముఖమెంత చాయ’  అని రాయించారో ఆ రోజు నుంచి అది తెలుగు వాకిళ్ల ఉదయాలకు ఒక íఫిక్స్‌డ్‌ ఫార్మాట్‌ ఇచ్చినట్టయ్యింది.

పారాణి పాదాలపైన వెండి పట్టీలు ధరించిన సంగీత– ఇంటి ముంగిట నీళ్లు చల్లి, చుక్కలు కలిపి ముగ్గువేయడం తెలుగు కళకు, సినిమా కలానికి విలువ పెంచింది. అయితే ఆరుద్ర అలా రాస్తే కృష్ణశాస్త్రి మరోలా రాశారు. ఉదయాన్నే పూజకు పూలేరేందుకు తోటకు వచ్చిన హీరోయిన్‌ చేత ‘ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు పూలిమ్మని రెమ్మరెమ్మకు’ అని ఆశ్చర్యం ప్రకటింపచేశారు. ఆ సినిమా ‘ఈనాటి ఈ బంధమేనాటిదో’. నిజమే. కొమ్మకు పూలిమ్మను ఎవరు చెప్పారు? కిరణానికి వేడిమి ఇమ్మని ఎవరు ఆదేశించారు? అందుకే కృష్ణశాస్త్రి కలం నుంచి ‘సీతారాములు’ నుంచి వచ్చిన మరో సూరీడు పాట కూడా గుర్తుండిపోతుంది. ప్రభాత వేళ సముద్రానికి ఆ కొసన పైకి లేచే నారింజ పండును చూస్తూ ‘తొలి సంజె వేళలో తొలిపొద్దు పొడుపులో తెలవారే తూరుపులో వినిపించే రాగం భూపాలం ఎగిరొచ్చే కెరటం సిందూరం’ అని ఆయన రాస్తే ఆ ఉదయం హృదయానికి తాకింది. ‘ఎగిరే ప్రతి కెరటం అంటదు ఆకాశం’ అని ఆ పాటలో ఆయనన్న మాట గెలుపు ఓటముల సమభావనను, ఉదయాస్తమాల ఎరుకనూ ఇస్తుంది.

ఇక కె.బాలచందర్‌కు సంకేతాలతో కథ చెప్పడం వచ్చు. ‘కోకిలమ్మ’ సినిమాను అలాంటి సంకేతాలతోనే చెప్తారు. అందులో హీరోయిన్‌ చెవిటిది. కాని ఆమె హృదయం నిండా శబ్దం ఉంది. నిరాశ అనే చీకటిని తరిమికొట్టే వెలుతురు ఉంది. చెట్ల మీద చిగుర్లను చివురింప చేసే చేవ ఉంది. ఆ శక్తిని పొందిన హీరో గాయకుడు అవుతాడు. ‘ఎవ్వరో పాడారు భూపాల రాగం సుప్రభాతమై’ అని పాడతాడు. పాడిన వాడు కృతజ్ఞత ప్రకటించడు. తాను ముందుకు నడిచిపోతాడు– అమెను శూన్యంలో వదిలి. అదే తమిళ సీమ నుంచి వచ్చిన భారతీరాజా కొలనులో వేయి సూర్యుళ్లను వికసింప చేశాడు ‘సీతాకోకచిలుక’ సినిమాలో. వేటూరి రాయగా, ఇళయారాజా తబలాను చరచగా ఎండ చర్రుమన్నట్టు ‘మిన్నెటి సూరీడు వచ్చెను మా పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మా’ పాట ఎంత మధురం. అది ఎండ కంటే తెల్లన. అది ఎండ కంటే ఎర్రన. మరి అదే ద్రవిడ నేల నుంచి వచ్చిన దర్శకుడు మహేంద్రన్‌ ‘మౌనగీతం’ సినిమాలో తెల్లవారుజాము జాగింగ్‌ను సౌందర్యభరితం చేశాడు. పొగమంచులో అమ్మాయి, అబ్బాయిలు వేసే అడుగుల చప్పుడులో సంగీతం విన్నాడు. సుహాసిని, మోహన్‌ కలిసి ‘పరువమా చిలిపి పరుగు తీయకు’ అని పాడుకునే పాటతో పాటు మనమూ పరిగెత్తి పోమూ? ఉషోదయాలను కెమెరాలో కాప్చర్‌ చేయాలంటే యూనిట్‌ నాలుగ్గంటలకంతా లొకేషన్‌లో ఉండాలి. సూర్యోదయం కోసం ఎదురుచూడాలి. ఉదయిస్తున్న సూర్యుణ్ణి వేళ దాటేలోపల పాటలో పట్టి బంధించాలి. ఇక్కడైతే సరే. నేపాల్‌ వంటి పరాయి దేశంలో హడావిడిలో అంత ఎర్లీ మార్నింగ్‌ లేచి షాట్‌ తీయాలంటే ఎన్టీఆర్, వాణిశ్రీ వంటి సూపర్‌స్టార్ల క్రమశిక్షణ వల్లే సాధ్యం. ‘సాహసవంతుడు’ సినిమాలో ‘సుప్రభాత సుందరి నీవు ఉదయరాగ మంజరి నేను’ పాట  సినిమా రిజల్టు ఎలా ఉన్నా ఇప్పటికీ నిలిచి ఉంది. కాని అన్నీ సినిమాలకూ ఇలా నేపాల్‌ దొరకదు. చెన్నై వి.జి.పి గార్డెన్స్‌తోనే సర్దుకోవాలి. ఆ గార్డెన్స్‌లో చాలా కమర్షియల్‌ పాటలు పిక్చరైజ్‌ అయి ఉండొచ్చు. కాని ‘గోరువెచ్చని సూరీడమ్మా పొద్దుపొడుపులా వచ్చాడమ్మా’ వంటి లలితమైన భావన ఉన్న పాట కూడా పిక్చరైజ్‌ అయ్యింది ‘జయసుధ’ సినిమా కోసం.

కవులు మారారు. కొత్త కవులు వచ్చారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి వచ్చి ‘తెల్లారింది లెగండో కొక్కరొక్కో మంచాలింక దిగండో కొక్కొరొక్కో’ అని బద్దకాన్ని, అలక్ష్యాన్ని, అర్థరహితమైన జీవితాన్ని వదిలి ఒక పరమార్థపు దారి వైపు నడవమని అలారం మోగించాడు ‘కళ్లు’ సినిమాలో. కాని ఆయనే సూర్యోదయపు పులకరింతలో దైవాన్ని చూశాడు. మానవ నిమిత్తమాత్రతను కూడా చూశాడు. ‘తెలి మంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ ఇల గొంతు వొణికింది పిలుపునియ్యనా ప్రభూ’ అని ‘స్వాతి కిరణం’ కోసం రాశాడు. అయితే ఈ సమయంలోనే పాటకు విరామం ఇచ్చిన ఒక మేటి కోయిల (భానుమతి) మళ్లీ గొంతు సవరించుకుని ‘మంగమ్మ గారి మనవడు’ కోసం ‘శ్రీ సూర్య నారాయణా మేలుకో’ అని పాడటం ఓ ముచ్చట. అయితే సూర్యుణ్ణి ఉదయానికి, శక్తికి, ఉత్తేజానికే ప్రతీకగా కాకుండా వీడ్కోలుకు కూడా ప్రతీకగా తీసుకుని కవులు సమర్థంగా ఉపయోగించారు. ‘స్టాలిన్‌’లో చిరంజీవి చావు బతుకుల మధ్య ఉన్నప్పుడు సుద్దాల అశోక్‌ తేజ రాసిన పాట భిన్న సందర్భాలలో గొప్ప వ్యక్తుల నిష్క్రమణ సమయంలో ఎలక్ట్రానిక్‌ మీడియాలో విస్తృతంగా వినిపించింది. ‘సూర్యుడే సెలవని అలసి పోయేనా... కాలమే శిల వలే నిలిచిపోయేనా... మహాశయా విధి బలై తరిమెనా’... ఈ పాట ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం ఎక్స్‌ప్రెసివ్‌ గానం వల్ల, మణిశర్మ రసాత్మకమైన సంగీతం వల్ల నిలబడింది. కాని ‘బాహుబలి’లోని పాట కూడా ఇందుకు తక్కువ కాదు. వంచనకు గురైన బాహుబలి మాహిష్మతిని విడిచి వెళ్లేప్పుడు వినవచ్చే పాట ‘పడమర కొండల్లో వాలిన సూరీడా’ భాష తెలియనివారి చేత కూడా పాడించింది. గాయకుడు కాలభైరవకు మధ్యాహ్న మార్తాండుడంతటి ఫోకస్‌ను ఇచ్చిందా పాట.సూర్యుడంటే ఎండాకాలం అంటే ఏసీలు కూలర్‌లు ఇష్షోలు బుష్షోలు మాత్రమే కాదు. మామిడి పండ్లు, సోడాబుడ్లు, మల్లెచెండులు మాత్రమే కాదు. తాటి ముంజెలు, పుచ్చచలువలు కూడా కాదు. కొన్ని కవి సమయాలు కూడా. కొన్ని సినిమా పాటలు కూడా.
ఎలక్షన్లు ముగిశాయి. పరీక్షలు ముగిశాయి. హాయిగా కొన్ని ఎండ పాటల్ని, ప్రభాత గీతాల్ని ఎంజాయ్‌ చేయండి.
– కె 

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)