amp pages | Sakshi

దోస్తీ కుదిరింది

Published on Wed, 06/28/2017 - 02:41

ట్రంప్‌– మోదీల మధ్య సరికొత్త స్నేహబంధం.. వివాదాస్పద అంశాల్ని దూరం పెట్టిన ఇరువురు నేతలు
దౌత్య సంబంధాలు, దీర్ఘకాలిక మైత్రీ బంధం, ఇతర దేశాధినేతలతో మర్యాదపూర్వక ప్రవర్తన... ఇవేవీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు పట్టవు. మొదటి నుంచి మాకేంటి? అనే ధోరణే కొనసాగిస్తున్నారు. అమెరికన్లకు కొత్త ఉద్యోగాల కల్పనను గట్టిగా కోరుకునే ట్రంప్‌కు, ‘మేకిన్‌ ఇండియా’ మంత్రం పఠించే భారత ప్రధాని నరేంద్ర మోదీల మధ్య తొలిభేటీపై ఉత్కంఠ కొనసాగింది. వీరిద్దరి మధ్య సయోధ్య కుదురుతుందా అన్న ప్రశ్నలు తలెత్తాయి. సోమవారం భేటీ సందర్భంగా మోదీకి ట్రంప్‌ ఇచ్చిన ప్రాధాన్యత, ఇద్దరి మధ్య ఆలింగనాలు, పరస్పర పొగడ్తలు చూశాక ఇద్దరికీ స్నేహం బాగానే కుదిరిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అమెరికాతో భారత్‌ బంధం గతంలో వలే కొనసాగుతుందనే నమ్మకం కుదిరింది.

2014లో ప్రధాని పదవిని చేపట్టిన తర్వాత మోదీకి అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామాతో మంచి సాన్నిహిత్యం కొనసాగింది. అమెరికా, భారత్‌ సంబంధాలు బలపడ్డాయి. ట్రంప్‌ గెలుపుతో మళ్లీ అనిశ్చితి. భారత ఐటీ పరిశ్రమకు ఆయువుపట్టు లాంటి హెచ్‌1బీ వీసా నిబంధనల్ని కఠినతరం చేయడం, కాల్‌ సెంటర్ల ఔట్‌సోర్సింగ్‌పై ఆంక్షలు.. వంటివి భారత ప్రయోజనాలకు అడ్డంకిగా మారాయి. అయితే ట్రంప్, మోదీ భేటీలో ఇలాంటి వివాదాస్పద అంశాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వలేదు. ఇరుదేశాల ఉమ్మడి ప్రయోజనాలకు అనుగుణంగానే అజెండా రూపొందించారు. మోదీ కూడా అమెరికా పర్యటనలో భారీ షెడ్యూల్‌ పెట్టుకోలేదు.

ట్రంప్‌ది దుందుడుకు స్వభావం. శరణార్థులను అమెరికా తీసుకోవాల్సిందేనని ఆస్ట్రేలియా ప్రధాని టర్న్‌బుల్‌ నొక్కి చెప్పడంతో ట్రంప్‌ అర్థంతరంగా ఫోన్‌ పెట్టేశారు. అలాగే జర్మనీ చాన్స్‌లర్‌ మెర్కెల్‌తో కరచాలనానికి మీడియా కెమెరాల సాక్షిగా నిరాకరించారు. అందుకే భారత అధికారులు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. తొలిభేటీలో పరిచయం చేసుకోవ డం, పరస్పరం భావాలను పంచుకోవడం, మైత్రి చిగురించ డం, ఒకరిపై మరొకరికి సదభిప్రాయం ఏర్పడటం ముఖ్యమని భావించారు.

భేటీపై భారీ అంచనాలు లేకుండా చూశారు. ‘దేశాధినేతలు బాగా కలిసిపోతే.. మిగతావన్నీ చక్కబడతాయి’ అని భారత విదేశాంగ కార్యదర్శి జయశంకర్‌ వ్యాఖ్యానించడం గమనార్హం. సోమవారం భేటీలో ఇరువురి ముఖాలపై చిరు నవ్వు, 3 సార్లు ఆలింగనాలు, మోదీకి ట్రంప్‌ స్వయంగా వైట్‌ హౌస్‌ను చూపించడం మొదలైనవి వారి మధ్య అనుబంధం బాగా కుదిరిందనడానికి నిదర్శనాలుగా పేర్కొంటున్నారు.

పరస్పరం పొగడ్తలు...
ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశ నాయకుడికి స్వాగతం పలకడం నాకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నానని ట్రంప్‌ అన్నారు. భారత్‌ ప్రపంచంలోనే అధిక వృద్ధి రేటును కలిగిన దేశమని, తాము కూడా ఆ స్థాయి వృద్ధిరేటును సాధించే దిశగా ప్రయత్నిస్తున్నామని, త్వరలోనే భారత్‌ను అందుకుంటామని ట్రంప్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. జీఎస్‌టీ లాంటి అతిపెద్ద సంస్కరణ తెచ్చారని, ప్రధానిగా మోదీ అద్భుత పనితీరును కనబరుస్తున్నారని ప్రశంసించారు. ‘నన్ను గెలిపిస్తే వైట్‌హౌస్‌లో నిజమైన మిత్రుడు ఉంటాడని ఎన్నికల ప్రచారంలో చెప్పాను.

ఇప్పుడదే జరిగింది... శ్వేతసౌధంలో మీకు నిజమైన మిత్రుడున్నాడ’ని ట్రంప్‌ పేర్కొన్నారు. వ్యాపార రంగంలో మీకున్న అపార అనుభవం ఇరుదేశాల సంబంధాల్ని మరింత బలోపేతం చేసేందుకు దోహదపడుతుందని అమెరికా అధ్యక్షుడిని మోదీ పొగిడారు. మీ నాయకత్వంలో ఇరుదేశాల సంబంధాలు కొత్త శిఖరాలకు చేరుతాయని నేను విశ్వసిస్తున్నాను... అని మోదీ అన్నారు. మోదీకి స్వాగతం నుంచి వీడ్కోలు పలకడం దాకా... సుహృద్భావ వాతావరణం వెల్లివిరిసింది.

అమెరికా ప్రయోజనాలకు ట్రంప్‌ ప్రాధాన్యం
భారత్‌ను కీలకమైన భాగస్వామిగా పేర్కొంటూనే... ట్రంప్‌ తనదైన శైలిలో అమెరికాకు మరిన్ని ప్రయోజనాలు ఉండాలని ఆశించారు. భారత్‌తో అమెరికాకు 31 బిలియన్‌ డాలర్ల వాణిజ్యలోటు ఉందనే విషయాన్ని ఎత్తిచూపుతూ... దీన్ని తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. అమెరికా ఉత్పత్తులకు భారత్‌లో మరింత మార్కెట్‌ అవకాశాలు కల్పించాలని, నిబంధనల్ని సడలించాలని కోరారు.

అమెరికా నుంచి భారత్‌ సహజ వాయువు కొనుగోలుకు సంబంధించి దీర్ఘకాలిక ఒప్పందం కోసం చర్చలు జరుగుతున్నాయని, కొంచెం ఎక్కువ ధర కోరుకుంటున్నామని... మొత్తానికి ఒప్పందం కుదురుతుందనే నమ్మకాన్ని ట్రంప్‌ వెలిబుచ్చారు. భారత్‌ ఆయుధ కొనుగోళ్లను దృష్టిలో పెట్టుకొని రక్షణ రంగంలో మరింత సహకారానికి సిద్ధంగా ఉన్నామన్నారు. సంయుక్త ప్రకటనలో హెచ్‌1బీ వీసా, వాతావరణ మార్పులు తదితర వివాదాస్పద అంశాల ప్రస్తావన లేకపోవడం గమనార్హం.  భారత్‌తో ద్వైపాక్షిక, వ్యూహాత్మక సంబంధాల్లో అమెరికాకు మరిన్ని ప్రయోజనాలు ట్రంప్‌ ఆశిస్తున్నారన్నది ఈ భేటీతో స్పష్టమైంది.

పాక్‌పై మారిన అమెరికా వైఖరి
ఈ భేటీ ద్వారా భారత్‌కు ప్రయోజనమేంటి..? ఉగ్రవాదానికి ఊతమిస్తున్న పాక్‌ పట్ల అమెరికా మరింత కఠిన వైఖరిని తీసుకోవడం మొదటి విజయం. నిజానికి ట్రంప్‌ గెలిచినప్పటి నుంచీ పాక్‌ చిత్తశుద్ధిపై అనుమానంతోనే ఉన్నారు. పాక్‌కు వార్షిక సాయాన్ని 1645 కోట్ల నుంచి 645 కోట్లకు తగ్గించడంతో పాటు రుణంగా మార్చారు. పాకిస్తాన్‌కు నాటోయేతర ప్రధాన భాగస్వామి హోదా ఉండగా.. దానిని ఉపసంహరించాలని ఇటీవలే అమెరికా కాంగ్రెస్‌లో ఇద్దరు సభ్యులు ఒక బిల్లు పెట్టారు.

సోమవారం ట్రంప్‌తో మోదీ భేటీకి కొద్దిగంటల ముందు... హిజ్బుల్‌ ముజాహిదీన్‌ చీఫ్‌ సలాహుద్దీన్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా అమెరికా ప్రకటించింది. సీమాంతర ఉగ్రవాద దాడులకు పాక్‌ భూభాగాన్ని వాడుకోకుండా చూడాల్సిన బాధ్యత ఆ దేశంపై ఉందని అమెరికా, భారత్‌లు సంయుక్త ప్రకటనలో కోరాయి. ఉగ్రవాదాన్ని సమూలంగా రూపుమాపడానికి, వారి సురక్షిత స్థావరాలను తుడిచిపెట్టడానికి కలిసి పనిచేస్తామని ట్రంప్‌ అన్నారు.

ఉగ్రవాదంపై పోరు తమ తొలి ప్రాధాన్యమని ఇరువురు నేతలు పేర్కొన్నారు. తాజా ప్రకటన పాక్‌ పట్ల అమెరికా మరింత కఠిన వైఖరి తీసుకుంటోందనే దానికి సంకేతంగా భావిస్తున్నారు. పాక్‌– చైనాల స్నేహబంధం, ఆసియాలో పెరుగుతున్న చైనా ప్రాబల్యాన్ని అడ్డుకోవాలంటే భారత్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం అవసరం. ఈ రెండు అంశాలు కూడా పాక్‌ పట్ల అమెరికా వైఖరి మారడానికి కారణాలు.

– సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

Videos

టీడీపీ,బీజేపీ విధ్వంసం సృష్టించారు: పేర్ని నాని

కుండపోత వర్షం హైదరాబాద్ జలమయం

ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కేంద్రం కీలక ప్రకటన..

ఏలూరు లో ఘోరం..!

డీలా పడ్డ కూటమి

ఈసీకి వివరణ

మేము ఇచ్చిన పథకాలు,అభివృద్దే మమ్మల్ని గెలిపిస్తుంది

కృష్ణా జిల్లాలో అరాచకం సృష్టిస్తున్న పచ్చ పార్టీ నేతలు

విజయం పై జగన్ ఫుల్ క్లారిటీ..

Live: విజయం మనదే..మరోసారి అధికారంలోకి వస్తున్నాం.

Photos

+5

Sireesha: భర్తతో విడాకులు.. ట్రెండింగ్‌లో తెలుగు నటి (ఫోటోలు)

+5

ఫ్యాన్స్‌లో నిరాశ నింపిన వర్షం.. తడిసిన ఉప్పల్ స్డేడియం (ఫోటోలు)

+5

లవ్‌ మీ సినిమా స్టోరీ లీక్‌ చేసిన బ్యూటీ, క్లైమాక్స్‌ కూడా చెప్పకపోయావా! (ఫోటోలు)

+5

Hyderabad Heavy Rains: హైదరాబాద్‌లో కుండపోత వాన.. భారీగా ట్రాఫిక్‌ జాం (ఫొటోలు)

+5

‘సర్‌.. నేను మీ అమ్మాయిని లవ్‌ చేస్తున్నా’.. 13 ఏళ్ల ప్రేమ, పెళ్లి! (ఫొటోలు)

+5

మిస్టర్‌ అండ్ మిసెస్ మహీ చిత్రంలో జాన్వీ.. ధోనిపై ఆసక్తికర కామెంట్స్ చేసిన భామ (ఫొటోలు)

+5

International Family Day: ఐపీఎల్‌ స్టార్లు, కెప్టెన్ల అందమైన కుటుంబాలు చూశారా? (ఫొటోలు)

+5

వారి కోసం విరుష్క స్పెషల్‌ గిఫ్ట్‌.. ఎందుకంటే? (ఫొటోలు)

+5

తిరుపతి కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన యువకుడు

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ నటుడు ఎమోషనల్‌ (ఫోటోలు)