amp pages | Sakshi

కుక్కకు కెమెరా కట్టి..

Published on Fri, 01/06/2017 - 20:22

ప్రతిరోజూ అతడు లండన్ వీధుల్లో ప్రయాణిస్తుంటాడు. కళ్లు లేని తన పట్ల అక్కడ ఎంత వివక్ష చూపిస్తున్నారో అతడికి తెలుసు. కానీ, ఎవరికైనా ఆ విషయం చెప్పాలంటే సాక్ష్యం కావాలంటారు. అందుకోసం భారత సంతతికి చెందిన ఆ అంధుడు ఓ విభిన్నమైన ప్రయత్నం చేశారు. తన పెంపుడు కుక్కకు కెమెరా కట్టి.. ఆ వివక్ష మొత్తాన్ని షూట్ చేశారు. ఆయన పేరు అమిత్ పటేల్. ఐదేళ్ల క్రితం కెరటోకానస్ అనే కంటి వ్యాధి కారణంగా చూపు కోల్పోయారు. ఒక కుక్క సాయంతో లండన్ వీధుల్లో తిరుగుతుంటారు. దాని పేరు కైకా. ఈమధ్య దానికి గోప్రో కెమెరా ఒకటి అమర్చారు. ప్రతిరోజూ లండన్ వాసులు తన పట్ల చూపిస్తున్న వివక్షను ఆ కెమెరా సాయంతో షూట్ చేశారు. 
 
లండన్ చాలా ప్రమాదకరమైన నగరమని, ఇక్కడ ఎవరో ఒకళ్లు తనను ట్రఫాల్గర్ స్క్వేర్ మధ్యలో నిలబెట్టి, ఒక సర్కిల్ వైపు తిప్పి, 'నీ ఇల్లు ఎక్కడో కనుక్కో' అంటారని పటేల్ చెప్పారు. అతడు తన కుక్కసాయంతో తీసిన వీడియోలో ఏ ఒక్కరూ పటేల్‌కు సాయం చేసినట్లు కనిపించలేదు. కైకాను కూడా జనం తమ బ్యాగులతో కొడుతుంటారని, దాన్ని కూడా విపరీతంగా తిడతారని తెలిపారు. ఒకరోజు ఒక మహిళ తనను ఆపిందని, ఆమే తనను పట్టుకుని, నలుగురినీ పిలిచి తనను క్షమాపణలు అడిగిందని, ఎందుకో అర్థం కాక తాను షాకయ్యానని వివరించారు. గతంలో వైద్యుడిగా పనిచేసిన పటేల్.. గో ప్రో కెమెరాను కైకాకు అమర్చడం ద్వారానే ఈ మొత్తం విషయాలను చిత్రీకరించగలిగారు.