ఎన్నికల స్పెషలిస్ట్

Published on Sun, 01/10/2016 - 05:22

దరఖాస్తు లేకుండా
దండం పెట్టకుండా
దండ వేయకుండా
దరావతు లేకుండా
దండన లేకుండా
ధన్యవాదం లేకుండా
ధర్నా లేకుండా
చేయగలిగితే ఉత్తమ పరిపాలన
....ఇది ఓ ఉన్నతోద్యోగి
రాసుకున్న కవిత. దీన్ని ఆచరణ సాధ్యం చేయాలనేది ఆయన ఆశయం. ‘కలెక్టర్‌ను కావాల’ని చిన్నతనంలోనే డైరీలో రాసుకొని...ఆ కలను నిజం చేసుకున్న వ్యక్తి ఆయన. అందుకే  ఈ ఆశయానికి అంత ప్రాధాన్యం. ఆ వ్యక్తి జీహెచ్‌ఎంసీ కమిషనర్...స్పెషలాఫీసర్ డాక్టర్ జనార్దన్ రెడ్డి.

 
* జీహెచ్‌ఎంసీ ‘స్పెషల్’ ఆఫీసర్
* టీమ్ వర్కే ఆయన బలం
* కలను నిజం చేసుకున్న విద్యార్థి
* ‘మనసులు గెలవాల’నే సూత్రంతో ముందుకు
* గ్రేటర్ ఎన్నికల రథసారథి డా. జనార్దన్‌రెడ్డి ప్రత్యేకత


సాక్షి, సిటీబ్యూరో: డాక్టర్ బి.జనార్దన్‌రెడ్డి... కొత్తగా పరిచయం అక్కరలేని పేరు. ఎన్నికల అధికారిగా సమర్థంగా విధులు నిర్వహించడం ఆయన స్పెషల్. వరంగల్ కలెక్టర్‌గా పని చేసినప్పుడు రెండు ఉప ఎన్నికల బాధ్యతలు చూశారు. రాజధాని నగరానికి  వచ్చాక... మరో మహా క్రతువు ఎదురొచ్చింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల బాధ్యత ఆయనపై పడింది. ఇక్కడికి వచ్చి రెండునెలలై ంది. వచ్చిన మరుసటి రోజు నుంచే కమిషనర్‌గా ఎన్నికల విధుల్లో భాగం కావాల్సి వచ్చింది. ఎన్నికల షెడ్యూల్ వెలువడడంతో బాధ్యత మరింత పెరిగింది. కొత్త పాలక మండలి కొలువు దీరేంత వరకు కమిషనర్, స్పెషలాఫీసర్‌గా వ్యవహరించాలి. వాటర్ బోర్డు ఎమ్‌డీగా అదనపు బాధ్యతలున్నాయి. అధికారులు, సిబ్బంది సమన్వయంతో ఇవన్నీ అలవోకగా నిర్వహిస్తున్నారు.

ఈ నడవడికకు బాల్యం లోనే బీజం పడిందంటారాయన. ఆటల మీది మక్కువ క్రీడాస్ఫూర్తిని అలవరిచింది. చుట్టూ ఉన్న పేదల బాధలు సామాజిక స్పృహను పెంచాయి. హోదా పెరిగినా మనిషి మారకపోవడం.. ఎంత ఎత్తుకు ఎదిగినా నేలను వీడకపోవడం ఈ కమిషనర్ ... స్పెషలాఫీసర్ ప్రత్యేత. అందరికీ అభిమానం... ఆత్మీయతలు పంచడం ఆయన విశిష్టత. వివిధ బాధ్యతలతో క్షణం తీరిక లేకుండా ఉన్నప్పటికీ.. ఆ విశేషాలు, వివరాలను ‘సాక్షి’ పాఠకుల కోసం వివరించారు జనార్దన్‌రెడ్డి. గ్రేటర్ ఎన్నికల రథసారథిగా ఓ వైపు పనులు చేస్తూనే.. ‘సాక్షి’కి సమయం కేటాయించారీ టీమ్ కెప్టెన్.
 
కల నిజమాయే...
‘కలలు కనండి.. నిజం చేసుకోండి’ అన్న అబ్దుల్‌కలాం నినాదం లోకానికి తెలియకముందే దాన్ని ఆచరించి చూపారు జనార్దన్‌రెడ్డి. తాను తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడు సైన్స్‌ఫేర్‌కు ముఖ్యఅతిథిగా వచ్చిన అప్పటి కలెక్టర్‌ను చూసి... ‘పెద్దయ్యాక నేను కూడా ఇలాంటి అధికారినే కావాలి’.. అనుకున్నాడు. అక్కడ కలెక్టర్‌కు లభిం చిన గౌరవం.. వెంటబంట్రోతు... మందీమార్బలం అన్నీ చూశాడు. తాను అలా కావాలంటే బాగా చదవాలి అనుకున్నాడు.

జిల్లా పరిషత్ స్కూల్‌లో... తెలుగు మీడియంలో చదువుతూ ఇలాంటి కలను ఎవరికైనా చెబి తే నవ్వుతారని భావించి.. మనసులోని మాటను   బయటకు రానీయలేదు. లక్ష్యాన్ని డైరీలో రాసుకున్నాడు.. ‘ఎప్పటికైనా సరే నేనూ కలెక్టర్‌ను కావాలి’ అని.
 
క్రమశిక్షణతోనే...
‘క్రమశిక్షణ’ అనే పదం ఆయనకు చిన్నతనంలోనేపరిచయమైంది. ఆ విషయమే చెబుతూ... ‘3 నుంచి పదో తరగతి వరకు పాఠశాల జీవితం మొత్తంలో రెండే రెండు ఆబ్సెంట్లు. యూనివర్సిటీ చదువు పూర్తయ్యే నాటికి మహా అయితే ఐదు ఉండవచ్చు’నన్నారు. ఎక్కడికి వెళ్లాల్సి ఉన్నా నిర్ణీత  సమయానికన్నా ముందే అక్కడకు చేరుకోవడం ఆయన స్పెషల్. హోదా ఏదైనా.. తీరు అదే.
 
చదువులో ముందంజ
3 నుంచి 10వ తరగతి వరకు... జూనియర్ కళాశాలలోనూ చదువులో టాపర్. గ్రూప్-1లో ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర స్థాయిలో మూడో ర్యాంక్. డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికయ్యారు. వాస్తవానికి ఐఏఎస్‌కు ఎంపిక కావాల్సింది. కోచింగ్‌కు తగినంత సమయం కేటాయించలేదు . దాని గురించి చెబుతూ... ‘మిత్రులు షేక్‌సలాం, రమేష్‌ల ప్రోద్బలంతో తక్కువ ధరకు దొరుకుతుందని పాతబస్తీ ఫలక్‌నుమాలో మిత్రులతో కలిసి గది అద్దెకు తీసుకున్నాను.

అక్కడి నుంచి కోఠికి రానూపోనూ ఎంతో సమ యం పట్టేది. కోఠిలో గది తీసుకుంటే కోచింగ్‌కు తగిన సమయం దొరికేది. అప్పట్లో సమయం విలువ తెలిసేది కాదు. చెప్పేవాళ్లూ లేరు. సమయ పాలన లేకుంటే ఏదీ సాధించలేమని అనుభవానికొచ్చింది’ అన్నారు.   
 
చెరిగిపోని ‘గీత’ సారం..
వేసవి సెలవుల్లో సమయమంతా పుస్తకాలతోనే. అలా 6వ తరగతిలోనే భగవద్గీతతో సహా ఎన్నో పుస్తకాలు చదివారు. గాంధీ జీవిత  చరిత్ర.. శ్రావణ కుమారుని చరిత్ర..వంటివన్నీ చదివేశారు. ఆరో తరగతిలోనే స్కూల్ లైబ్రరీలోని అన్ని పుస్తకాలూ పూర్తి చేసేవారు. ఆ చదువే ‘నీ పని నీవు చేయి.. ఫలితం ఆశించకు’ అన్న గీతాసారాన్ని బోధించింది.  
 
గురువుల చలువే
అందరితో ఆత్మీయతానుబంధాలకు కారణం తన పాఠశాల గురువుల ప్రభావమేనంటారు ఈ స్పెషల్ ఆఫీసర్. ‘హెడ్మాస్టర్ అంజయ్య మాటలు వివేకానందుని బోధనలులా స్ఫూర్తిమంతంగా ఉండేవి. కాలి వేలికి గాయమైతే, కాలు కడిగి.. మందు పూసి కట్టుకట్టిన పీఈటీ లక్ష్మయ్య... టిఫిన్ బాక్స్ తెచ్చుకోకపోవడాన్ని గుర్తించి తన టిఫిన్ పెట్టిన హిందీ టీచర్ ప్రేమలత... తాను వచ్చేంతదాకా పాఠం ప్రారంభించని తెలుగు మాస్టారు హనుమయ్య...

‘ఇంగ్లీషు- తెలుగు’ పుస్తకాలిచ్చిన ఇంగ్లీషు సార్ నాగభూషణం.. చేతిరాత మెరుగుపరచుకోమని చెప్పకనే చెప్పిన శ్రీనివాసన్ మాస్టారు... ఇలా అందరూ.. చూపిన ప్రేమానురాగాలే సమాజాన్ని ప్రేమించేలా చేశాయి. పాఠశాల రోజుల్లోని పరిస్థితులు జీవితంలో ప్రతిబింబిస్తాయి’ అంటారు.
 
మనసులు గెలవాలి
సైకాలజీపై ఆసక్తికొద్దీ సివిల్స్‌కు ఒక అంశంగా ఎంచుకున్నారు. పుస్తకాలతో పాటు మనుషులనూ  ఎక్కువగా చదివారు. బలవంతంగా ఏదీ చేయించలేం. ఎవరైనా మనసుకు నచ్చితేనే చేస్తారనేది గ్రహించాక, నొప్పించడం మాని ఒప్పించే ప్రయత్నాలు మొదలు పెట్టారు. దాన్నే కొనసాగిస్తున్నారు.
 
మెప్మాతో మెప్పు
9 జిల్లాల్లో పనిచేసిన జనార్దన్‌రెడ్డి వివిధ అంశాల్లో చేపట్టిన సంస్కరణలు ఎన్నో. అలా పుట్టిందే పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా). మెప్మా కోసమే 2007లో జీహెచ్‌ఎంసీకి రావాల్సిందిగా అప్పటి సీఎం వైఎస్సార్ కోరినా, సున్నితంగా తిరస్కరించారు. అప్పుడే పుట్టిన మెప్మాను అనాథగా వదిలేసి రాలేనని స్పష్టం చేశారు. పేదలకు ఉపకరించే ఆ మిషన్ గురించి వివరించడంతో సీఎం కూడా ఆయన నిబద్ధతను మెచ్చుకున్నారు. క్రమేపీ మెప్మా దేశానికే ఆదర్శవంతంగా మారింది. 25 రాష్ట్రాలు ఈ బాట పట్టాయి. కేంద్ర మంత్రి అజయ్‌మాకెన్ వంటి వారు ప్రశంసించారు. 2014లో మెప్మాకు రాష్ట్రపతి అవార్డు లభించింది.
 
 పేదల దుస్థితికి అద్దం
1996 కరీంనగర్ జిల్లా ధర్మపురి దగ్గరి వెలగటూరు గ్రామం. వరదలకు ఎస్సీ, ఎస్టీల ఇళ్లు కొట్టుకుపోయాయి. అయినా వరదలోనే కొంత దూరంలోని కొండపైకి ఎక్కి బిక్కుబిక్కుమంటూ వారు గడుపుతున్నారు. విషయం తెలిసి అక్కడికి వెళ్లిన జనార్దన్‌రెడ్డి..  వారికి ఇళ్లు కట్టించారు. కొంత కాలానికి చూడ్డానికి వెళితే కొత్త ఇల్లు.. దాని ముంగిట గుడిసె. అందులో మహిళ. గుడిసెలో ఎందుకున్నావ్? అంటే.. ‘గృహప్రవేశం చేయలేదు’ అని అటు నుంచి సమాధానం.

ఎందుకు చేయలేదని మళ్లీ ప్రశ్నిస్తే...‘ గృహ ప్రవేశానికి చుట్టాలందరినీ పిలవాలి. మందూ, మాంసాలతో దావత్ ఇవ్వాలి. దీనికి దాదాపు లక్ష రూపాయలైతది. ఆ పైసల్లేవు. అందుకే ఆ ఇంట్లోకి పోలేదు’ అనడంతో ఏం మాట్లాడాలో తెలియలేదాయనకు. ఇది పేదల జీవితాల్లోని మరో కోణాన్ని ఆయనకు తెలియజేసింది.
* ఓ ఇంటి పెద్దదిక్కు మరణిస్తే.. కారుణ్య నియామకం కింద ఆ ఇంట్లో ఒకరికి 3 నిమిషాల్లో ఉద్యోగం ఇప్పించారు.
* గడచిన 25 ఏళ్లుగా అలా ‘యాక్ట్ నౌ’ను పాటిస్తున్నారు. తను పని చేసేచోట దీన్ని నినాదంగా మార్చారు.
* కరీంనగర్‌లో 1997-2000లలో 50 శాతం కుటుంబ నియంత్రణ కార్యక్రమాల అమలులో జిల్లాను గిన్నిస్ రికార్డులకెక్కించారు. అప్పట్లో పీడీ (ఆపరేషన్స్)గా ఆ లక్ష్యం సాధించారు.
* ఆడపిల్లలను కన్న తల్లులను సత్కరించడం ద్వారా వారికి గుర్తింపుతెచ్చారు.  
 
ఆటలతో ఒత్తిడి దూరం
స్పోర్ట్స్ అంటే ఎంతో ఇష్టం. డిగ్రీలో  టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్ ఆటలతోపాటు గుర్రపుస్వారీ  చేసేవారు. ఉదయాన్నే వ్యాయామం.. బ్యాడ్మింటన్ జీవితంలో భాగమయ్యాయి. 25 ఏళ్లుగా క్రమం తప్పకుండా ఆడుతున్నారు. అదే ఇప్పుడు ఒత్తిడి నుంచి ఉపశమనాన్నిచ్చే ఔషధం.
 
డా. బి.జనార్దన్‌రెడ్డి ప్రొఫైల్
పేరు: డా.బి.జనార్దన్‌రెడ్డి
స్వగ్రామం: పెద్దాయపల్లి, మహబూబ్‌నగర్ జిల్లా
పుట్టిన తేది: 6-11-1962
తల్లిదండ్రులు: బాలకృష్ణమ్మ, బాల్‌రెడ్డి.
కుటుంబం: శ్రీమతి సులోచన, పిల్లలు రష్మి, రాహుల్
చదువు: 1 నుంచి 10వ తరగతి వరకు జిల్లా పరిషత్ హైస్కూల్, బాలానగర్.
ఇంటర్మీడియెట్: ఎంవీఎస్ జూనియర్ కాలేజి, మహబూబ్‌నగర్
గ్రాడ్యుయేషన్: బీవీఎస్సీ, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, రాజేంద్రనగర్, హైదరాబాద్.
 పోస్ట్ గ్రాడ్యుయేషన్: ఎంవీఎస్సీ (ఎక్స్‌టెన్షన్ ఎడ్యుకేషన్), ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, రాజేంద్రనగర్, హైదరాబాద్.
నచ్చే వంటకం: మామిడి పప్పు, అరటికాయ కూర, ఉలవచారు.
బ్రేక్‌ఫాస్ట్: జొన్నరొట్టె.
లక్కీనెంబర్: లేదు.
నచ్చేరంగు: ఏదో ఒకటి మాత్రమే కాదు.
పర్యటించిన దేశాలు: బంగ్లాదేశ్, థాయ్‌లాండ్, సింగపూర్, దక్షిణాఫ్రికా, ఫ్రాన్స్, జర్మనీ, అమెరికా.
రోల్‌మోడల్: ఒక్కొక్కరిలోని ఒక్కో అంశం.
రాసినవి: ‘నాకు ఇల్లు వద్దు’ నాటిక.కరీంనగర్ జిల్లాలో వందసార్లకు పైగా ప్రదర్శించారు. కుటుంబ నియంత్రణపై
‘మమ్మల్ని కనొద్దు’ నాటిక.
ఉద్యోగం/హోదా: నల్లగొండ, నెల్లూరు జిల్లాల్లో ఆర్డీవో కరీంనగర్ జిల్లాలో హౌసింగ్ డీఎం,  డీఆర్‌డీఏ పీడీ,  చిత్తూరు, కృష్ణా, గుంటూరు  జిల్లాల్లో జాయింట్ కలెక్టర్ అనంతపురం, వరంగల్ జిల్లాల కలెక్టర్ ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ మిషన్ అడిషనల్ సీఈఓఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ కమిషనర్, ఎమ్‌డీ
ప్రస్తుతం: జీహెచ్‌ఎంసీ కమిషనర్, స్పెషలాఫీసర్, ఎన్నికల అధికారి, వాటర్‌బోర్డు ఎమ్‌డీ (ఇన్‌చార్జి)
ప్రవృత్తి: కేజీ టూ పీజీ ఉచిత విద్య అంశాన్ని ప్రభుత్వం పట్టించుకోకముందే తమ స్వగ్రామంలో తల్లిదండ్రులు... ఆర్థిక స్థోమతలేని పిల్లలను వారి కాళ్లమీద నిలబడేంత వరకు చదివించాలని నిర్ణయించుకున్నారు. వారికి ఉద్యోగం వచ్చేంత  వరకు చదువులు సాగడానికి తనవంతు సాయం చేయాలని దీక్ష బూనారు. అలా ఏడు కుటుంబాలకు అండగా నిలిచారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ