amp pages | Sakshi

ఈ హత్య నేరం కాదు

Published on Sun, 03/03/2019 - 23:41

ఇంతమంది చూస్తూవున్నా, హత్య ఉద్దేశపూర్వకమా, ఆకస్మిక సంభవమా అన్న విషయం సమస్యగానే ఉండిపోయింది.
చైనా గారడీవాడు హాన్‌. గారడీ చేస్తూ కత్తి విసిరేసరికి అతని భార్య మెడలో రక్తనాళం తెగింది. తక్షణం చనిపోయింది. అతణ్ణి వెంటనే ఖైదు చేశారు. ఆ సమయానికక్కడ కంపెనీ డైరెక్టరు, హాన్‌ సహాయకుడు కాక మూడు వందల చిల్లర ప్రేక్షకులు ఉన్నారు. ఇంతమంది చూస్తూవున్నా హత్య ఉద్దేశపూర్వకమా, ఆకస్మిక సంభవమా అన్న విషయం సమస్యగానే ఉండిపోయింది. హాన్‌ చేయబూనిన ప్రదర్శన మిది. తలుపు ఎత్తుననున్న ఒక కర్ర పలకకు ముందు భార్య నిలబడుతుంది. నాలుగు గజాల దూరం నుంచి కత్తులు పలక మీదకు ఆమెకు చుట్టూ రెండంగుళాల దూరంలో విసురుతాడు. జడ్జీ మొదట డైరెక్టరు నడిగాడు. ‘‘ఆ ఫీటు చాలా కష్టమయిందంటావా?’’
‘‘అలవాటయిన వానికంత కష్టము కాదు. కాని సరిగా చేయడానికి నరాల్లో సత్తువ, ఏకాగ్రత కావాలి.’’
‘‘సరే, హఠాత్సంభవమే అనుకున్నా, సాధారణంగా జరగవలసిన సంఘటన కాదుకదా?’’
‘‘ఔను. ఇది అంత అనుకోనిది. అసాధారణమైనది కాకపోతే నేనలాంటి ఫీటు చేయించే ఉండను.’’
‘‘ఇది పొరపాటనుకుంటావా లేక ఉద్దేశ పూర్వకమనుకుంటావా?’’
‘‘చెప్పలేను.’’

జడ్జీకి చిక్కు విడలేదు. చంపదలచుకునే చేసివుంటే చాలా గడుసుగా చేశాడనుకొన్నాడు జడ్జీ. తర్వాత జడ్జి హాన్‌కు సహాయకుడిగా ఉన్నవాణ్ణి అడిగాడు. ‘‘సాధారణంగా హాన్‌ దెలాంటి ప్రవర్తన?’’
‘‘నిక్కచ్చి మనిషి. జూదం కాని, త్రాగుడు కాని, వ్యభిచారం కాని లేదు.’’ ‘‘అతని భార్య ఎలాంటిది?’’ ‘‘ఊరూరూ తిరిగి ప్రదర్శనాలిచ్చే వాళ్లంత నీతి నియమాలతో ఉండరు. హాన్‌ భార్య అందగత్తె. ఎంతమందో ప్రేమ చూపేవారు కాని ఎన్నడూ వాళ్లని కన్నెత్తి చూసేది కాదు.’’‘‘ఎలాంటి స్వభావం వారిది?’’

‘‘ఒక్క సంగతి చెప్పితే హాన్‌కు హాని కలుగుతుందేమో ఐనా చెప్పేస్తున్నాను. ఇతరుల విషయంలో మంచితనం నెమ్మదీ చూపేవీళ్లు ఒకళ్ల విషయంలో ఒకళ్లు క్రూరంగా ఉండేవారు.’’
‘‘నీకు వారిని తెలిసినప్పటినుండీ అలాగే ఉండేవారా?’’

‘‘కాదు. రెండేండ్ల క్రిందట హాన్‌ సతి కడుపుతో ఉంది. నెలలు నిండకుండానే బిడ్డ పుట్టి మూడో రోజున చనిపోయింది. దాంతో భేదాలు పుట్టాయి. ఎప్పుడూ ఆమెను చెయ్యి చేసుకోలేదు. అది అతని నియమాలకు విరుద్ధం. కాని కళ్లు భయంకర కోపాన్ని కక్కేవి. ఒక రోజున అడిగాను, ఇద్దరికీ ఏమాత్రం సరిపడనప్పుడు విడిపోరాదా అని. ఆమె మీద ప్రేమ నశించినా విడిపోడానికి తగిన కారణాలు లేవన్నాడు. ఆమె కూడా అతణ్ణి ప్రేమించడం మానేసింది. ఇప్పుడతణ్ణి వదలి పోతే తిరిగి పెండ్లవడం కష్టం. దేశమంతా తిరిగి వచ్చిన దాన్నెవరు నమ్ముతారు. సరిపడకపోయినా ఆమె కూడా అతని దగ్గరే ఉండిపోయిందనుకుంటాను.’’
‘‘సరే ఇది జరిగిన క్షణంలో నీవేమనుకున్నావు. ఉద్దేశ పూర్వకమనుకున్నావా? లేక పొరపాటను కున్నావా?’’‘‘ఆమెను చంపేశాడనే అనుకొన్నాను. కానీ నాకు వారి జగడాలు తెలుసు కాబట్టి చంపేశాడని అనుకున్నాను అని.’’ ‘‘ఇది జరగగానే హాన్‌ ఎలాగున్నాడు?’’
‘‘హా అని అరిచాడు. ఆ కేక విని చూసేసరికి అతని భార్య నోట్లోంచి రక్తం ప్రవహిస్తూ వుంది. మోకాళ్లు ముడుచుకుపోయి ముందుకు తూలిపోయింది. ఆమె దేహం ఎత్తేసరికి చచ్చివుంది. హాన్‌ నిశ్శబ్దంగా ప్రార్థన చేశాడు.’’‘‘ఇంకేమన్నా నిన్నడగవలసి వుంటే పిలుస్తాను. వెళ్లు. ’’జడ్జీ హాన్‌ను పిలిచాడు. ‘‘నీవెప్పుడైనా నీ భార్యను ప్రేమించావేమో చెప్పు.’’ ‘‘మా పెండ్లినాటి నుండి బిడ్డ పుట్టేవరకు ప్రేమించాను.’’ ‘‘బిడ్డ పుట్టుకతో ఎందుకు మార్పు వచ్చింది?’’ ‘‘ఆ బిడ్డ నాది కాదని తెలియడం వల్ల.’’ ‘‘ఎవరి బిడ్డో తెలుసా?’’ ‘‘నా భార్య మేనత్త కొడుకు.’’ ‘‘వారిద్దరి స్నేహాలు నీ పెండ్లికి ముందే జరిగి ఉంటాయనుకుంటాను.’’
‘‘ఔను. మేము పెండ్లాడిన ఎనిమిది నెలలకు బిడ్డ పుట్టింది.’’ ‘‘మీ అసిస్టెంటు నెలలు నిండేముందు పుట్టిందన్నాడు.’’ ‘‘అలాగే నేనందరికి చెప్పాను.’’ ‘‘అంత త్వరగా బిడ్డ చనిపోయిందెందువల్ల?’’
‘‘తల్లే తన వక్షాని కానించి ఊపిరాడనివ్వలేదు.’’ ‘‘చెయ్యాలనే చేసిందా నీ భార్య?’’ ‘‘ఆమె నాతో ఆకస్మిక సంభవమంది.’’ ‘‘మేనత్త కుమారునికి గల సంబంధం నీ భార్య ఒప్పుకొందా?’’ ‘‘ఆమె చెప్పనూలేదు, నేనెన్నడూ అడుగనూలేదు. అన్నింటికీ తగిన శిక్షలాగ పడింది బిడ్డ మృత్యువు. నేను ఉదారంగా ప్రవర్తించాలని అనుకొన్నాను కాని–’’ ‘‘ప్రవర్తింపలేక పోయావు.’’ ‘‘ఆమె కనబడేటప్పటికే నాలో కోపం పొడుచుకొచ్చేది.’’ ‘‘విడాకు లివ్వాలనిపించ లేదా?’’ ‘‘అనుకొన్నాను కాని నా భార్యతో చెప్పలేదు. నేను వదిలేస్తే బ్రతికేది లేదని నా భార్య అనేది.’’ ‘‘నిన్ను ప్రేమించిందా?’’ ‘‘ప్రేమించలేదు.’’ ‘‘మరెందు కలాగంది?’’
‘‘జీవనాధారాన్ని గూర్చి అని ఉంటుంది. సర్కసులో ఉండేదాన్నెవరు పెండ్లాడతారు? ఏదన్నా పనిచేసుకుంటుందా అంటే ఆమె పాదాలు చిన్నవి.’’ ‘‘ఏదో ఒకటి నిశ్చయం చేసుకోలేకపోయావా?’’ ‘‘నా మనస్సు నిండా ఆదర్శాలుండేవి.’’ ‘‘ఏమిటా ఆదర్శాలు?’’ ‘‘ఆమెయెడ తప్పులేకుండా ప్రవర్తించాలని. కాని చివరకు సాగింది కాదు.’’ ‘‘తరువాత చంపాలనుకున్నావు కదా?’’ ‘‘నిశ్చయం చేసుకోలేదు. ఒకసారి మాత్రం అనుకున్న మాట నిజం.’’ ‘‘మీరప్పుడు దెబ్బలాడుకుంటూ ఉన్నారా?’’ ‘‘చిన్న విషయాన్ని గూర్చి.’’ ‘‘ఆ విషయమేమిటో జ్ఞాపకం తెచ్చుకో.’’ ‘‘ఆ సాయంత్రం సోమరిగా కాలం గడిపి వంట చేసింది కాదు.’’
‘‘ఎక్కువ కోపంగా ఉన్నావా?’’ ‘‘మామూలుగా ఉండేది కాదు. కాని తరువాత పెరిగింది. కొన్నాళ్ల నుండి జీవితాన్ని సరిదిద్దుకోవడం కోసం తాపత్రయ పడుతున్నాను. పడుకుంటే నిద్ర పట్టదు. ఎంత కొట్టుకున్నా నేను జీవితాన్ని బాగుపరచు కోలేకున్నాను. ఈ దుఃఖస్థితి పెండ్లివల్లనే కదా కలిగింది. నేనెందుకు చంపకూడదు? జైలుకు తప్పక వెళతాను. కాని జైలు జీవితం ఇంతకంటే అధ్వానంగా ఉంటుందా? కాని చంపితే సమస్య తీరదనే భావం ఎందువల్లో కలిగింది. బాధ ననుభవించడమే నా యథార్థ జీవితమై పోయింది.’’

జడ్జివైపు హాన్‌ దీక్షగా చూచాడు. చెప్పు అన్నట్టు జడ్జి తల ఊపాడు.
‘‘మరునాడు ఊరికే ఉండటం బాధగా ఉంది. పిచ్చివాడిలాగ నిర్మానుష్య ప్రదేశాల్లో తిరిగాను. జీవిత సమస్య పరిష్కారం చెయ్యాలి అనే తలంపు వదలలేదు. చంపే ఉద్దేశం మరి కలగలేదు. రాత్రి చంపాలనుకున్నానంతే. నిశ్చయానికి వచ్చానా? అనుకోడానికి– నిశ్చయానికి మధ్య ఒక సముద్రముంది. సాయంత్రపు గారడీ ఆటను గూర్చి ఆలోచించలేదు. అనుకునే ఉంటే కత్తి వేటుల ప్రదర్శనం మానేసే ఉందును. దాని బదులు చేయడానికి ఎన్నెన్నో ఫీటులున్నాయి.

సాయంత్రం రంగం మీదకు వంతు వచ్చింది. మామూలు ప్రకారం నా కత్తుల వాడితనం ప్రేక్షకులకు నేల బల్లల మీద కొట్టి చూపించాను. బరువైన చైనా దుస్తులు ధరించి నా భార్య రంగం మీదకు వచ్చి ప్రేక్షకుల్ని మనోహరమైన నవ్వుతో అభినందించి, బల్లకు ముందుగా నిలబడింది. కడచిన రోజు సాయంత్రం తరువాత అప్పుడే మా కళ్లు మొదటిసారి కలుసుకోవడం. ఆ ఫీటు అపాయకరమని తక్షణం తోచింది. నా వళ్లంతా వణుకుతున్నట్లు తోచింది. టైము అయిపోయింది. ఆమె తలవైపు మొదటి కత్తి విసిరాను. మామూలుకంటే అంగుళం పైకి వెళ్లింది. నా భార్య చేతులెత్తింది. ఆమె రెండు చేతుల క్రిందికి రెండు కత్తులు విసిరాను. మొదటి కత్తి నా వేళ్లను వదిలేసరికి ఏదో వెనక్కి లాగేస్తూవున్నట్లు అనిపించింది. ఒక కత్తి నా భార్య మెడకు ఎడమవైపు విసిరాను. రెండవది విసరబోయేసరికి ఆమె కళ్లల్లో విచిత్రమైన చూపు చూచాను. ఆమెనప్పుడే భయభూతం ఆవహించినట్లగుపడింది. నా కత్తి క్షణాలలో ఎగిరి వచ్చి తన మెడ కోసేస్తుందని ఆమెకు ముందుగానే తోచిందా? నా తల దిమ్మెక్కింది. చేతిలోని కత్తిని బలవంతంగా ఎక్కడికో గురిపెట్టి విసిరాను– చంపేశాను అన్నభావం హఠాత్తుగా నాకు కల్గింది.’’

‘‘ఉద్దేశ పూర్వకంగా అనా నీ భావం?’’
‘‘ఔను.’’
‘‘తరువాత నీ భార్య శవం ప్రక్క మోకరించి ప్రార్థన చేశావట?’’
‘‘అప్పటికప్పుడు నాకు తోచిన జిత్తు అది. ఇప్పుడిక దారి ఏమిటా అని ఆలోచిస్తున్నాను. నా భార్యకూ నాకూ చెడిందని అందరకూ తెలుసు. కాని ఇది హఠాత్సంభవమని నేను గట్టిగా ఉంటే కాదని రుజువు చేయగలవారెవరు? అందులో ఒక విచిత్ర ప్రశ్న నాకే తట్టింది. ఇది హఠాత్సంభవం కాదని నేనే ఎందుకు అనుకుంటున్నాను? ముందు రాత్రి చంపాలనుకున్నాను. దాన్ని బట్టి ఇప్పుడు జరిగింది ఉద్దేశపూర్వకము కాకూడదా? చివరకు జరిగిందేమిటో నాకే తెలియదు అన్న స్థితికి వచ్చాను. దాంతో మనస్సుకు శాంతి కలిగింది.’’
హాన్‌ మౌనంగా ఉండిపోయాడు. జడ్జి కూడా మౌనంగా ఉన్నాడు. విచిత్ర భావావేశంతో కలం అందుకొన్నాడు జడ్జీ. కేసుకు సంబంధించిన కాగితాల మీద ‘‘నిర్దోషి’’ అని వ్రాశాడు.

షిగా నోయా 
మానవ స్వభావపు మార్మిక లోతును పట్టించే షిగా నోయా జపాన్‌ కథ ‘హాన్స్‌ క్రైమ్‌’కు సంక్షిప్త రూపం ఇది. తెలుగు అనువాదం: సూరాబత్తుల సుబ్రహ్మణ్యం. సౌజన్యం: ద సదరన్‌ లాంగ్వేజ్‌ బుక్‌ ట్రస్ట్, మద్రాస్‌ 1960లో ప్రచురించిన ‘చైనా జపాన్‌ ప్రసిద్ధ కథలు’ సంకలనం.

Videos

విజయం పై జగన్ ఫుల్ క్లారిటీ..

Live: విజయం మనదే..మరోసారి అధికారంలోకి వస్తున్నాం.

జేసీ ప్రభాకర్ రెడ్డికి బిగ్ షాక్...కేసు నమోదు చేసిన ఈడీ

ఎన్నికల ఫలితాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

ఏపీలో వైఎస్ఆర్ సీపీ ప్రభంజనం సృష్టిస్తుంది: సీఎం జగన్

ఐ ప్యాక్ కార్యాలయానికి వెళ్లిన సీఎం జగన్

కుప్పంలో కోట్లు కుమ్మరించినా చంద్రబాబుకు ఓటమి ?

సాయంత్రం గవర్నర్ ను కలవనున్న YSRCP నేతల బృందం

రాష్ట్ర విభజన పెండింగ్ అంశాలపై సీఎం రేవంత్ ఫోకస్

ఏపీ విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్

Photos

+5

మిస్టర్‌ అండ్ మిసెస్ మహీ చిత్రంలో జాన్వీ.. ధోనిపై ఆసక్తికర కామెంట్స్ చేసిన భామ (ఫొటోలు)

+5

International Family Day: ఐపీఎల్‌ స్టార్లు, కెప్టెన్ల అందమైన కుటుంబాలు చూశారా? (ఫొటోలు)

+5

వారి కోసం విరుష్క స్పెషల్‌ గిఫ్ట్‌.. ఎందుకంటే? (ఫొటోలు)

+5

తిరుపతి కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన యువకుడు

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ నటుడు ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)