amp pages | Sakshi

మేధస్సు అలసిపోదు

Published on Wed, 01/28/2015 - 23:52

 గొల్లపూడి మారుతీరావు,  ప్రసిద్ధ రచయిత - నటుడు - కాలమిస్టు
 
కిందటి శతాబ్దపు అయిదో దశకం తెలుగు దేశానికి మరపురాని దశ. కారణం అప్పటి ఆకాశవాణి సంగీత వైభవం. ముఖ్యంగా ‘భక్తి రంజని’. నిజానికి ఆ కార్యక్రమాన్ని ‘భక్తిరజని’ అనాలని చాలామంది అనేవారు. కారణం ఆ వైభవానికి మూలపురుషులు బాలాంత్రపు రజనీకాంతరావుగారు కావడం. నాకప్పుడు ఇరవయ్యేళ్లు. తెల్లవారితే ప్రతీ ఇంట్లో ‘భక్తిరంజని’ పాటలే చెవుల్లో గింగుర్లెత్తించేవి. తూము నరసింహదాసు, ప్రయాగ రంగదాసు, నరసదాసు, నారాయణ తీర్థులు, రామదాసు, అధ్యాత్మ రామాయణ కీర్తనలు, హనుమాన్ చాలీసా, సూర్యస్తుతి - ఇలాగ. ఇవన్నీ మధురమయిన జ్ఞాపకాలు. బాలమురళీకృష్ణ, వోలేటి వేంకటేశ్వర్లు, ఎమ్.వి. రమణమూర్తి, సూర్యారావు, శ్రీరంగం గోపాలరత్నం, వింజమూరి లక్ష్మి, వి.బి. కనకదుర్గ, పాకాల సావిత్రీ దేవి, నల్లాన్ చక్రవర్తుల నరసింహా చార్యులు - వీరంతా గానం చేసిన పాటలవి. అన్నమాచార్య కీర్తనలు అప్పటికింకా ప్రాచుర్యంలోకి రాలేదు. మూడు శతాబ్దాలు తిరుమల శ్రీవారి ఆలయ భాండాగారంలో అజ్ఞాతంగా మిగిలిపోయిన ఆ కీర్తనల వైభవాన్ని వేటూరి ప్రభాకరశాస్త్రిగారు ప్రారంభించగా, రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మగారు కొనసాగించారు. అయితే ‘‘ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమేమున్నది’’ అన్న కీర్తన బాలమురళీ కృష్ణ పాడగా విన్న గుర్తు. అప్పటికి టీవీలు లేవు. ఆనాటి రేడియో ప్రాచుర్యాన్ని పూర్తిగా అనుభవించిన తరం మాది. కానడలో వోలేటిగారి హనుమాన్ చాలీసా, చరిత్రగా నిలిచిపోయిన బిళహరి, కాంభోజీ, జౌన్‌పురీ, నాట మొదలైన రాగాలలో బాలమురళి నారాయణ తీర్థ తరంగాలు, రజని సూర్య స్తుతి - ఇవన్నీ మధురమైన జ్ఞాపకాలు. ‘మాది’ అని నన్నూ కలుపుకోడానికో కారణం ఉంది. నా జీవితంలో - ఆ మాటకి వస్తే మా ఇంట్లో మొదటి రేడియో నేను కొన్నదే. 1959లో నేను అంతర్జాతీయ రేడియో నాటికోత్సవాల పోటీలలో నా నాటిక ‘అనంతం’కు మొదటి బహుమతిగా పుచ్చుకున్న వంద రూపాయలతో, నేను రేడియోకి రాసిన ‘శాఫో’ అనే నాటికకి దక్కిన పదిహేను రూపాయలు, ‘అనంతం’లో నటించినందుకు దక్కిన మరో పాతిక కలపగా, మా నాన్నగారు మరో ఇరవై రూపాయలు ఇచ్చిన గుర్తు. ఆ పైకంతో చిన్న ‘మర్ఫీ’ రేడియో కొన్నాను. అది ఆ తర్వాతి 57 సంవత్సరాల జీవితానికి పెట్టుబడి అయింది. ఆ విధంగా రజనీకాంతరావుగారు, బాలమురళీకృష్ణ, మిగతా గాయకులంతా నా డ్రాయింగు రూములో కొలువుతీరారు. ఓ చిన్న రచయితకి అదొక దేవలోకం. ఎప్పుడయినా ఈ గంధర్వుల్ని చూడగలుగుతానా అనుకొని రేడియోలో తలదూర్చి మరీ లలిత సంగీతం వినేవాడిని. అది 1959. మరో నాలుగేళ్లకు (1963) వారితో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది.

రేడియోలో ఉద్యోగం వచ్చింది! అంతే. అదే జీవితంలో పెద్ద మలుపు. నా జీవితంలో గొప్ప అదృష్టాన్ని చెప్పమంటే నా ప్రవృత్తి- వృత్తి మమేకయి జీవితమంతా కొనసాగడం. అడుగడుగునా ఎందరో పెద్దలతో భుజం కలిపి పనిచేయడం. ఏనాడూ అహంకారానికి తావివ్వని ప్రతిభావంతుల, పెద్దలతో సాంగత్యం, ఆ మలుపులో నా అభిరుచిని సంధించినవారిలో రజనీకాంతరావుగారి పాత్ర ఉంది.
 1959 నాటి మరో ప్రత్యేకమైన జ్ఞాపకం - విజయవాడ మొగల్రాజపురంలో మహీధర రామమోహనరావు గారింట్లో సాహితీ సమావేశం. ఆ రోజుల్లో నా ఆనర్స్ చదువు పూర్తి చేసుకుని ‘ఆంధ్రప్రభ’లో ఉద్యోగానికి వారం వారం నీలంరాజు వేంకట శేషయ్యగారిని కలుస్తూండేవాడిని. విజయవాడలో మహీధర రామ మోహనరావుగారు సాహితీ సమావేశాలకు సంధానకర్త. సైకిలు మీద వచ్చి అందరి ఇళ్లకీ వెళ్లి మమ్మల్నందరినీ పేరు పేరునా సమావేశాలకు ఆహ్వానించేవారు. ఆ రోజు కొడవటిగంటి, శ్రీశ్రీ వచ్చారు. ఆనాటి సభలో నేనూ, ఏటుకూరి బలరామమూర్తి, పరకాల పట్టాభిరామారావు, అంగర సత్యనారాయణ రావు ప్రభృతులు ఉన్న జ్ఞాపకం. రజనీగారు అప్పుడు విజయవాడ రేడియోలో చేస్తున్నారు. వచ్చారు. అనర్గళంగా ‘మహాప్రస్థానం’లో కవితల్ని గానం చేశారు.

1959-63 వరకూ ఆంధ్రప్రభలో పనిచేసి 1963 జనవరి 17న హైదరాబాదు రేడియో స్టేషన్లోకి అడుగుపెట్టాను. అప్పుడక్కడ రజనీకాంతరావుగారు పనిచేస్తున్నారు. ఇంకా దేవులపల్లి కృష్ణశాస్త్రి, నాయని సుబ్బారావు, మునిమాణిక్యం నరసింహారావు, బుచ్చిబాబు, యండమూరి సత్యనారాయణ, అయ్యగారి వీరభద్రరావు, ఆచంట నారాయణ మూర్తి, భాస్కరభట్ల కృష్ణారావు, స్థానం నరసింహారావు, న్యాపతి రాఘవరావు, దాశరథి - ఇలా ఎందరో మహానుభావుల సమక్షంలో నౌఖిరీ. నిజానికి అది ఉద్యోగం కాదు. వైభవం. అప్పటికి రజనిగారు పాటలు రాసి, బాణీలు చేయగా పాటలను చిరస్మరణీయం చేసిన ఒక తరం వెళ్లిపోయింది. ఎస్. వరలక్ష్మి, టంగుటూరి సూర్యకుమారి, శాంతకుమారి - ఇలాగ. నా జీవితంలో అదృష్టం - తర్వాతి కాలంలో మళ్లీ వారందరితోనూ పరిచయాలు ఏర్పడ్డాయి. కొందరితో పనిచేశాను. ఓ ముప్ఫై సంవత్సరాల తర్వాత ఇంగ్లండులో కెంట్‌లో మిత్రులు డాక్టర్ వ్యాకరణం రామారావు గారింట్లో సూర్యకుమారి గారిని కలిశాను. ‘‘మీ అందరివల్లే నేను రేడియోలో చేరాను’’ అని ఆమెకు గుర్తు చేశాను.
 వోలేటి పాడిన ద్విజావంతి రాగంలో రజని గీతం ‘మనసౌనే రాధా, మరల వేణువూద!’’ ఇప్పటికీ చెవుల్లో ప్రతిధ్వనిస్తుంది. పాట వినగానే నా జ్ఞాపకాలు 55 ఏళ్లు వెనక్కి దూకుతాయి. రజని పాట ‘ఊపరె ఊపరె ఉయ్యాల’ అన్నపాట ఇప్పటికీ పాడగలను. రేడియోలో ఎస్. వరలక్ష్మిగారు పాడారు. ఆవిడ నాకంటే 12 సంవత్సరాలు పెద్ద. నిజానికి నా ముందుతరం హీరోయిన్. 35 సంవత్సరాల తర్వాత మేమిద్దరం కనీసం నాలుగు చిత్రాల్లో భార్యాభర్తలుగా నటించాం! ‘శ్రీవారు’ సినిమాలో నటిస్తున్నప్పుడు ఆవిడకి ‘ఊపరె ఊపరె ఉయ్యాల’ పాటని గుర్తు చేశాను. ఆవిడకి జ్ఞాపకం రాలేదు. నాకు గుర్తున్నట్టు పాడి వినిపించాను. అది విని ఆమె నాకు మళ్లీ పాడారు. మంచి పాట, మంచి బాణీ, రజని సంగీతంలో జీవలక్షణం చిరంజీవి అని చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు.
 రజనిగారు 1940లో రేడియోలో ఆర్టిస్టుగా చేరారు. 1943లో ఆయన ఉద్యోగం రెగ్యులరైజ్ అయింది. 1978 వరకూ పనిచేసి స్టేషన్ డెరైక్టరుగా పదవీ విరమణ చేశారు. ఆ తరానికి అది ఉద్యోగం కాదు. ఉద్యమం. ఈ దేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజున మద్రాసు కమాం డరన్ చీఫ్ రోడ్డులోఉన్న ఆకాశవాణి కేంద్రంలో దాదాపు అందరూ ఉన్నారు. పార్లమెంటులో నెహ్రూ ప్రసంగాన్ని వారూ పులకించిపోతూ విన్నారు. ఆనాడు రజని టంగుటూరి సూర్యకుమారి చేత ‘మాదీ స్వతంత్ర దేశం’ పాడించారు.

ఈ దేశానికి స్వాతంత్య్రం వచ్చాక ప్రసారమైన మొదటి దేశభక్తిగేయం ఇది. ఎంతటి గౌరవం! అప్పుడు కేంద్రంలో బుచ్చిబాబు, అనౌన్సరు మల్లంపల్లి ఉమామహే శ్వరరావు మొదలైనవారంతా ఉన్నారు. ఏం రోజులవి? రేడియో మాధ్యమానికి పునాదులు వేసిన తరం అది. ఆ స్ఫూర్తితోనే మా తరం వారంతా పనిచేశాం. నాకు ఏనాడూ రేడియోలో నా జీతమెంతో తెలి సేది కాదు. తెల్లవారితే ఏ కొత్త పనిచెయ్యాలా అని ఆఫీసుకి దూకే వాళ్లం.


 1963-68 మధ్య హైదరాబాదులో రేడియోలో ఉద్యోగం. నా పని డ్యూటీ ఆఫీసరు. ఒక సంఘటన బాగా గుర్తు. ఆ రోజు అయిదు గంటలకి ఇంటికి బయలుదేరుతున్నాను. స్టూడియోలో రజనిగారు, వేణుగాన విద్వాంసులు ఎన్.ఎన్. శ్రీనివాసన్‌గారూ - అంతా హడావిడి పడుతూ పరుగులు తీస్తున్నారు. పాటల రికార్డింగు మరో పక్క జరుగుతోంది. ‘బావొచ్చాడు’ నాటిక గ్రామస్తుల కార్యక్రమంలో (సాయంత్రం 6-20కి) ప్రసారం. దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు వెళ్తున్న నన్ను ఆపారు. అప్పటికే ఆయన కంఠం మూగపోయింది. నన్ను పిలిచి కాగితం మీద రాశారు. ‘‘నీ మొహం రాగి చెంబులాగ ఉంటుంది. నా నాటికలో వేస్తావా?’’ అని. చేసేది రేడియో నాటిక. మొహానికీ దానికీ సంబంధం లేదు. ఆయన చమత్కారమది. ఏం వేషం? అందులో నా పాత్ర ‘బావ’. అంటే ప్రధాన పాత్ర. సంగీత రూపకానికి సంగీతం సమకూర్చినది రజనీకాంతరావుగారు. ఆశగా కూర్చున్నాను. కార్యక్రమం పాటతో ప్రారంభమైంది. అవుతూనే మరో పాట. పండగకి బావ ఇంటికి రావడం సందర్భం. పాటలు వేడివేడిగా వస్తున్నాయి. కాలం జరిగిపోతోంది.7 గంటలకి తెలుగులో వార్తలు. 6-55 అయిపోయింది. ఈ బావ ఎప్పుడొస్తాడు? దేవులపల్లివారిని అడిగాను. సన్నని చిరునవ్వు సమాధానం. 6-57 అయింది. నా చేతికి ఓ కాగితం మీద ఒక మాట రాసిచ్చారు దేవులపల్లి. ‘‘ఏమర్రా పిల్లలూ!’’ అన్నాను. అంతా ‘‘బావొచ్చాడు బావొచ్చాడు’’ అన్నారు. నాటిక అయిపోయింది! ఆ విధంగా రజని గారి సంగీత రూపకంలో ఒకే ఒక్కసారి నటించాను. నా షష్ఠిపూర్తికి ఈ సందర్భాన్ని ఉటంకిస్తూ రజని గారు ప్రత్యేక సంచికలో వ్యాసం రాశారు. అంతటి మహానుభావులతో 50 ఏళ్లు నిలిచిన మధురమైన జ్ఞాపకం ఇది.

నేను విజయవాడలో పనిచేసే నాటికి రజనీగారు ఉత్తర దేశంలో పనిచేసేవారు. నాకు ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్‌గా ప్రమోషన్ వచ్చి శంబల్‌పూర్ బదిలీ చేసేనాటికి విజయవాడ స్టేషన్ డెరైక్టరుగా వచ్చారు. అప్పటికి నేను సినీమాల్లో ముమ్మరంగా రచనలు చేస్తున్నా. సినీరంగ మిత్రులు నా ఉద్యోగానికి రాజీనామా చెయ్యాల్సిందేనని పట్టుబట్టారు. రాజీనామా పత్రాన్ని తీసుకుని రజనీగారి గదిలోకి వెళ్లాను. కాగితం తీసుకు చదివారు. ఒక్కసారి నన్ను ఎగాదిగా చూసి కాగితాన్ని అడ్డంగా చింపేశారు. ‘‘శంబల్పూరు వెళ్లు. అక్కడి నుంచే రచనలు చెయ్యవచ్చు. నేను డిఫికల్టు స్టేషన్లలో పనిచేయబట్టే ఇక్కడికి రాగలిగాను. మరేం ఆలోచించకు. వెళ్లు’’అంటూ హితవు చెప్పారు. ఆయన కారణంగా వెళ్లాను. మరో పదేళ్లు రేడియోలో పనిచేసి, అసిస్టెంటు స్టేషన్ డెరైక్టరుగా ప్రమోషన్ తీసుకుని, కడప రేడియో స్టేషన్‌కి హెడ్డునయి, ఊహించని రీతిలో సినిమాల్లో నటించి, తొలి సినిమాకే స్టార్‌నై- అప్పుడు తప్పక రాజీనామా చేశా.
 మేథస్సుతో పనిచేసే వ్యక్తికి శరీరం అలిసిపోదు. వృద్ధాప్యం కేవలం శరీరానికే పరిమితం. ఒక శతాబ్ద కాలం సంగీత సాహిత్యాలకు తనదయిన ప్రత్యేకతలను సంతరించిన వాగ్గేయకారులు రజనీగారు. ఆయన నూరేళ్ల జీవితం ఒక ఉద్యమం. ఆయన తరానికి దక్కిన అవకాశాలు మరే తరానికీ దక్కవు. ఓ మాధ్యమానికి ఊపిరి పోసి, ఓ దేశ స్వాతంత్య్రాన్ని చిరస్మరణీయం చేసి, సంగీతానికి నూరేళ్ల ఆయుష్షును పోసిన నిండు జీవితం రజనీగారిది. తెలుగు సాహితీ చరిత్రలో ఆయన ఒక సువర్ణ అధ్యాయం.

http://img.sakshi.net/images/cms/2015-01/41422469519_Unknown.jpg
 

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)