amp pages | Sakshi

మన ఊళ్లు ఇలా కాకూడదు

Published on Tue, 03/15/2016 - 22:56

సామాజికం
 
మద్యం మత్తులో మృత్యువు ఒడిలోకి ఏజెన్సీ గ్రామాలు
నాటు సారాతో నిర్జీవంగా మారుతున్న యువతరం
పాతికేళ్లు నిండకుండానే వితంతువులుగా మారుతున్న స్త్రీలు

 
పల్లెలో సెలయేరు పారాలి... సారా కాదు.
కానీ.. ఏజెన్సీ ప్రాంతాల్లో
సారా సెలయేరులా పారుతోంది.
ప్రాణాలు తీస్తోంది.
స్త్రీలను చిన్నవయసులోనే వితంతువులను చేస్తోంది.
ఈ దుస్థితి ఏ ఊరికీ రాకూడదు.
మనం రానివ్వకూడదు.

 
విశాఖ జిల్లాలోని కొయ్యూరు మండలంలోని ఐదు గ్రామాల్లో సాక్షి ‘ఫ్యామిలీ’ ఇటీవల పర్యటించింది. ఏ గ్రామాన్ని కదలించినా నాటుసారా తాగి మృత్యువాత పడి భర్తలను కోల్పోయిన మహిళలే కనిపించారు! ఈ గ్రామాల్లో భర్తలు కోల్పోయిన స్త్రీలుంటే, మరికొన్ని గ్రామాల్లో తాగుడుకి బానిసైన యువకులకి 40 ఏళ్లొచ్చినా పెళ్లి కాని పరిస్థితి. ఇంకొన్ని గ్రామాల్లో మంచంలోనే తాగి తాగి కిడ్నీలు పాడయిన యువకులు కొందరైతే, శరీరభాగాలన్నీ చచ్చుబడిపోయి కాటికి కాళ్లు చాపుకున్న నవ యువకులు మరికొందరు. వీటికి తోడు తాగిన మత్తులో విచక్షణ మరిచి వ్యవహరిస్తున్న కొడుకుల నుంచి రక్షించుకోవడానికి రాత్రిళ్లు తల్లులు గ్రామాల నుంచి అడవుల్లోకి పారిపోతున్న దారుణాలు ఆదివాసీ స్త్రీల జీవితాలకు అద్దంపడుతున్నాయి.

రాత్రంతా చెట్టుపైనే!
కుర్జు పెంటమ్మది కొయ్యూరు మండలం కొమ్మిక గ్రామం. ఒక కొడుకు నిత్యం సారా మత్తులో మునిగి తేలుతుంటే, మరోకొడుకు తాగొచ్చి, కత్తి చేత్తో పట్టుకొని వెంటపడ్డాడు. కొడుకునుంచి ప్రాణాలు రక్షించుకోవడానికి ఆ తల్లి జీడిమామిడి చెట్లపైనే రాత్రంతా గడిపి తెల్లారాకైనా కొడుకు మత్తు దిగుతుందని ఇంటికొచ్చానంటోంది. ఇది ఒక్కతల్లి పరిస్థితే కాదు. అక్కడ తల్లులెందరిదో ఇదే పరిస్థితి.
 
గొడ్డలి ఎత్తి చంపేస్తానన్నాడు

బోండా పూర్ణకి ఇద్దరాడపిల్లలు. తాగుడుకి బానిసై డబ్బులివ్వమని వేధిస్తున్నా, భర్తను భరించింది. కానీ గొడ్డలి పట్టుకొని చంపేస్తానని వెంటపడే భర్తనుంచి ప్రాణాలు ఎలా కాపాడుకోవాలని ప్రశ్నిస్తోంది. ఇద్దరు కూతుళ్లను భర్త బారినుంచి తప్పించేందుకు తంటాలు పడుతోంది.

పొయ్యిలో కాళ్లు పెట్టాడు
నీలపు దేవుడమ్మది కొయ్యూరు మండలంలోని కొమ్మిక గ్రామం. కొడుకు గౌరీనాయుడు నిత్యం సారాయిలో మునిగితేలుతున్నా ఏదోలే అని ఊరుకుంది. తాగినా ఇంటిపట్టున పడుంటాడనుకుంది. కూలోనాలో చేసి ఇంత గంజిపోసి కొడుకు ఆకలి నింపుతోంది. వారం క్రితం మద్యం మత్తులో ఏం చేస్తున్నాడో కూడా తెలియని స్థితిలో కణకణమండే పొయ్యిలో కాళ్లు పెట్టాడు. కాళ్లు పూర్తిగా కాలిపోయిన కొడుకుకి యిప్పుడా తల్లే సేవలు చేస్తోంది. ఈ ఊరిలో మొత్తం 125 కుటుంబాలున్నాయి. 100 ఇళ్లున్నాయి. 35 ఏళ్ల లోపే భర్తలను కోల్పోయిన మహిళలు 36 మంది. 35 ఏళ్లు దాటినా ఇంకా పెళ్లి కాని పురుషులు 32 మంది ఉన్నారు. పిల్లనిచ్చేవారి సంగతి సరే ఈ ఊరు పేరు చెబితేనే బెంబేలెత్తిపోతున్నారు జనం.  

ఎటు చూసినా వితంతువులే
 కొయ్యూరు మండలంలోని ఎం.మాకవరం గ్రామంలో మొత్తం 300 కుటుంబాలు, 150 ఇళ్లున్నాయి. ఇక్కడ తాగుడుకి బానిసై భర్తలను కోల్పోయిన స్త్రీలు 18 నుంచి 30 ఏళ్ల లోపు వాళ్లు మొత్తం 32 మంది ఉన్నారు. 31 నుంచి 40 ఏళ్లలోపు వారిలో భర్తలను కోల్పోయిన స్త్రీలు 31 మంది. అంటే మొత్తం భర్తలు లేని స్త్రీలు 63 మంది. ఇదే మండలంలోని కర్నిక పాలెం గ్రామంలో మొత్తం 80 ఇళ్లు న్నాయి. 105 కుటుంబాలున్నాయి. ఇక్కడ  35 ఏళ్ల లోపు భర్తలను కోల్పోయిన స్త్రీలు 17 మంది. 35 ఏళ్లు పైబడిన వారిలో భర్తలు లేని స్త్రీలు 12 మంది. మొత్తం 47 మంది. అంటే దాదాపు సగం కుటుంబాల్లో కుటుంబ పెద్ద తాగుడుకి బానిసై మరణించినవారే. ఇక ఇదే గ్రామంలో 35 ఏళ్లొచ్చినా తాగుడు కారణంగా పెళ్లి కాని యువకులు 16 మంది ఉన్నారు. మాకవరం గ్రామం లో చింతల్లి అనే మహిళ భర్త తాగి, తాగి రక్తం కక్కుకుని చనిపోయాడు. ఉన్న ఇద్దరు కొడుకులు మద్యానికి బానిసలయ్యారు. అంతేకాదు రోజుకి 20 నుంచి 25 గుట్కాలు తింటాడని చెబుతోంది. భర్త చావుకళ.. కొడుకుల్లోనూ కనిపిస్తోంటే విలపిస్తోంది.

గ్రామ స్వరాజ్యం కోసం...
కొయ్యూరు మండలంలోని సర్వన్న పాలెం సర్పంచ్ నారాయణ మూర్తికి ఒకప్పుడు బ్రాందీ షాపు ఉండేది. ఆ ఊరికి రోడ్డు లేదు. ఆసుపత్రి లేదు. కానీ బ్రాందీ షాపు ఉంది. జనం తాగుడుకి బానిసై ఇల్లు గుల్ల చేసుకుంటోంటే ఆ పాపపు సొమ్ము నాకొద్దంటూ బ్రాందీ షాపు మూసేసి చిల్లర కొట్టు పెట్టుకున్నాడు. ‘గ్రామస్వరాజ్యం’ అనే స్థానిక స్వచ్ఛంద సంస్థ తమ చైతన్యానికి కారణమని గ్రామస్థులు అంటున్నారు.

స్వతంత్రంగా పనిచెయ్యనివ్వాలి
‘‘గాంధీజీ కలలుగన్న గ్రామస్వరాజ్యం కోసం మా సంస్థకి ‘గ్రామ స్వరాజ్యం’ అని పేరు పెట్టుకున్నాం. ప్రజల్లో చైతన్యం కోసం ప్రయత్నిస్తున్నాం. అయితే ఐటిడిఎలు స్వతంత్రంగా పనిచేసే అవకాశం ఉండాలి’’ అని గ్రామస్వరాజ్యం డెరైక్టర్ రాము అంటున్నారు. ఈ గ్రామాల్లో ప్రజలకు ఆరోగ్యం లేదు. కేవలం తాగుడే అలవాటుంటే ఇంతలా చనిపోరు. అసలు వాళ్లకు పౌష్టికాహారమే లేదు. చదువుకున్న వారు ఒకటీ అరాతప్ప లేనేలేరు. ఉపాధి సంగతి సరే సరి. ఆడవాళ్లే రోజు కూలికి వెళ్లి, మగాళ్లని పోషిస్తున్న పరిస్థితి. శక్తిమంతమైన యువతరం మత్తులో జోగుతోంది. ప్రభుత్వ నిర్లక్ష్యమే అందుకు కారణమంటున్నారు ఆదివాసీల్లో పనిచేస్తున్న సామాజిక కార్యకర్త వెంకట్రావు. - అత్తలూరి అరుణ, ప్రిన్సిపల్ కరస్పాండెంట్, ‘సాక్షి’
 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌