amp pages | Sakshi

మేధోశ్రమకు గుర్తింపు

Published on Tue, 10/11/2016 - 00:42

రాగ రంజితమైన అక్షరం ఉత్సాహపరుస్తుంది... ఉద్వేగపరుస్తుంది... ఉపశమనం కలిగిస్తుంది. సంగీతం విశ్వభాష. దానికి ఎల్లలుండవు. రాగాల వర్షం కురిసిందంటే అందులో తడిసి ముద్దగా మారి తరించడానికి సిద్ధపడనివారుండరు. భాష రాకపోయినా, భావం తెలియకపోయినా ప్రపంచంలో ఏ మూలనున్న హృదయాన్నయినా స్పృశించగల శక్తి సంగీతానికి ఉంటుంది. ఊగించి, శాసించే సంభాషణలైనా అంతే. కానీ ఈ శక్తే వాటి సృష్టికర్తలకు అన్యాయం చేస్తోంది. పాట రచయితకూ, ఆ పాటకు బాణీ కట్టి దాన్ని మరింత సుసంపన్నం చేసే సంగీతకారులకూ, సంభాషణల రచ యితలకూ రాయల్టీ పరంగా దక్కవలసింది దక్కడం లేదు.

ఇటీవల ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన రెండు తీర్పులు దాన్ని సరిదిద్దుతాయి. సృజనశీలమైన మిగతా రంగాల్లో వాటి సృష్టికర్తలకు మేధోపరమైన హక్కులు అమలవుతుంటే తమ హక్కులు మాత్రం నిత్యం ఉల్లంఘనకు గురవుతున్నాయన్న అసంతృప్తి రచయితలకూ, స్వర కర్తలకూ, గాయకులకూ ఉంటోంది. పాట లేదా సంభాషణలు రాసిచ్చాక వాటి రచ యితలకూ, పాటను స్వరపరిచాక సంగీత దర్శకులకూ, ఆలాపించాక గాయకులకూ దాంతో ఇక సంబంధం లేకుండా పోతోంది. మొదటిసారి ఒక చిత్ర నిర్మాత లేదా రికార్డింగ్‌ సంస్థ ఇచ్చే మొత్తమే తప్ప అనంతర కాలంలో వారికి వచ్చేదేమీ ఉండదు. వాణిజ్యపరంగా దాన్ని ఎన్నిచోట్ల ఎంతమంది, ఏ రూపంలో ఉపయోగించుకుం టున్నా వారు నిస్సహాయంగా మిగిలిపోతున్నారు. నాలుగేళ్లక్రితం ఈ అన్యాయాన్ని సరిదిద్దాలన్న కృతనిశ్చయంతో కవి, బాలీవుడ్‌ గీత, సంభాషణల రచయిత జావేద్‌ అఖ్తర్‌ కాపీరైట్‌ చట్టానికి సంబంధించిన సవరణ బిల్లు ఆమోదం పొందడం కోసం శ్రమించారు. అంతకు చాన్నాళ్లముందే లోక్‌సభలో ఆమోదం పొందినా అప్పటి ప్రధాన ప్రతిపక్షం బీజేపీ సహకరించక రాజ్యసభలో ఆగిపోయిన ఆ బిల్లును చివ రకు పార్టీల ప్రమేయం లేకుండా అందరూ ఏకగ్రీవంగా ఆమోదించారంటే దాని వెనక జావేద్‌ అఖ్తర్‌ కృషి ఎంతో ఉంది.

రచయితలు, కళాకారుల మేధోపరమైన హక్కులకు సంబంధించి అంతర్జాతీయంగా పకడ్బందీ నియమనిబంధనలున్నాయి. మన దేశంలో ఆ స్థాయిలో లేవు. 1957 చట్టానికి 2012లో తెచ్చిన సవరణలతో ఆ లోటు తీరింది. ఒక చిత్రంలోని సంభాషణలైనా, పాటలైనా వాణిజ్యపరమైన అవసరాలకు వినియోగించుకుంటు న్నప్పుడు వాటి సృష్టికర్తలకు రాయల్టీ చెల్లించాలని తాజా సవరణలు నిర్దేశించాయి. ఈ హక్కు యాభైయ్యేళ్లపాటు అమలవుతుంది. చానెళ్లలో కావొచ్చు... రెస్టరెంట్లలో కావొచ్చు... పబ్‌లలో కావొచ్చు వాటిని వినియోగించుకున్న ప్రతిసారి ఇలా రాయల్టీ చెల్లించాల్సిందేనని చట్టం అంటున్నది. అంతక్రితం కేవలం ఆ చిత్ర నిర్మాత లేదా నిర్మాణ సంస్థకు మాత్రమే అలాంటి హక్కు ఉండేది. ఫలితంగా ఏఆర్‌ రహమాన్‌ వంటి సంగీత దర్శకులను కూడా మ్యూజిక్‌ రికార్డింగ్‌ సంస్థలు శాసించేవి. 2012 చట్ట సవరణల తర్వాత కొద్దో గొప్పో పరిస్థితి మారింది. సృజన హక్కులు గుత్తగా నిర్మాతలకూ లేదా నిర్మాణ సంస్థలకూ ఉండటం సరికాదని చట్టం గుర్తించింది. తమ సృజనకు ఒకసారి ఆదాయం సంపాదించే రచయితలు, ఇతర కళాకారులు ఆ తర్వాత అదే సృజనకు పరాయివారు కావడం, ఆర్ధిక ఇబ్బందులకు లోనుకావడం సరికాదని భావించింది.

షెహనాయ్‌ విద్వాంసుడు బిస్మిల్లాఖాన్‌ లాంటివారు వృద్ధాప్యంలో ఆర్ధికంగా ఎన్ని ఇబ్బందులకు లోనయ్యారో, ఆరోగ్యం కోసం ఆస్పత్రుల చుట్టూ తిరిగే స్తోమత లేక ఎన్ని సమస్యలను ఎదుర్కొన్నారో ఎవరికీ తెలియనిది కాదు. కనీసం ఉండటానికి ఇల్లయినా లేనివారు ఎందరో! అయితే దాని అమలు ఇంకా సరిగా లేదన్న అసంతృప్తి మాత్రం అందరిలో ఉంది. గాయకుల హక్కుల రక్ష ణకు భారతీయ గాయకుల హక్కుల సంఘం(ఐఎస్‌ఆర్‌ఏ) ఉండగా సినీ రచయి తల సంఘంలాంటివి రచయితలకున్నాయి. అయితే ఈ పరిధుల్లోకి రాని వారి రాయల్టీ హక్కులు ఉల్లంఘనకు గురవుతూనే ఉన్నాయి. ఇక చిత్ర దర్శకులకు ఈ చట్టం న్యాయం చేయలేదనే చెప్పాలి. వారిని చట్టం గుర్తించలేదు. వాణిజ్యపరంగా సూపర్‌హిట్‌ అయిన దర్శకుల సంగతి వేరుగానీ... ఒకటో, రెండో విజయం సాధించి ఆ తర్వాత అవకాశాలు సన్నగిల్లి ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొనే దర్శ కులకు ఇది ఇబ్బందికరమే.

ఇప్పుడు గాయకులకు సంబంధించినంతవరకూ ఢిల్లీ హైకోర్టు వెలువరించిన తీర్పులు  ఊరటనిచ్చేవే. ఒక రెస్టరెంట్‌లో తగిన అనుమతులు తీసుకోకుండా తమ పాటలను వినియోగించుకున్నారని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్‌ను అనుమతిస్తూ అందుకు జరిమానాతోపాటు తగిన మొత్తం చెల్లించాల్సిందేనని ఆ రెండు కేసుల్లోనూ తీర్పులు వచ్చాయి. వాటిని ప్రదర్శించిన ప్రతిసారీ ఐఎస్‌ఆర్‌ఏకు తగిన మొత్తం చెల్లించి అనుమతి పొందాల్సిందేనని ఆ తీర్పులు స్పష్టం చేశాయి. ఒక పాటను వాణిజ్యపరంగా వినియోగించుకుంటే రాయల్టీ రుసుమును లేదా లైసెన్స్‌ ఫీజును చెల్లించాలని తెలిపాయి. చట్టాలు చేస్తే సరిపోదు. దాన్ని అమలు చేయాల్సిన వాణిజ్య సంస్థలు, పర్యవేక్షించి తగిన చర్యలు తీసుకోవాల్సిన అధికార యంత్రాంగం పట్టించుకోనట్టయితే గాయకులు, రచయితలు, స్వరకర్తలవంటి సృజనకారులకు అన్యాయం జరుగుతుంది. వారి మేధోశ్రమను సొమ్ము అనేక సంస్థలు సొమ్ము చేసుకుంటున్నా పట్టించుకునేవారు ఉండటం లేదు.

న్యాయ స్థానాల్లో పిటిషన్లు దాఖలు చేసి కేసు నడిపించే ఆర్ధిక వెసులుబాటు అందరికీ ఉండదు. వాస్తవానికి చట్టాన్ని ఉల్లంఘించిన సందర్భంలో రెండు లక్షల రూపా యల జరిమానా, గరిష్టంగా మూడేళ్ల జైలు శిక్ష విధించవచ్చునని చట్టం నిర్దేశిస్తున్నా అధికారులు తమంత తాము చర్యలు తీసుకున్న ఉదంతాలు చాలా తక్కువ. వివిధ భాషల్లో 700కు పైగా చిత్రాలకు సంగీత దర్శకుడిగా పనిచేసిన ఇళయరాజానే ఆమధ్య తాను స్వరాలు సమకూర్చిన పాటలు, నేపథ్య సంగీతం వగైరాలు అను మతి లేకుండా వినియోగిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటివారిపై చట్టపరమైన చర్యలకు వెనుకాడనని హెచ్చరించారు. ఇక సాధారణ సృజనకారుల సంగతి చెప్పే దేముంది? దీన్ని చక్కదిద్ది మేధోశ్రమ దోపిడీని అరికట్టవలసిన అవసరం ఉంది.
 

Videos

ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్

పొరపాటున బాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపే..!

జగనన్న రాకతో దద్దరిల్లిన గాజువాక సభ

గాజువాకలో జనజాతర

బీజేపీ, టీడీపీ, జనసేన తోడు దొంగలు..!

విశాఖ నుంచే ప్రమాణస్వీకారం చేస్తా

వీళ్లే మన అభ్యర్థులు.. ఈసారి ఢిల్లీ పీఠం కదలాలి

ఇచ్ఛాపురం బహిరంగ సభలో సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్

చంద్రబాబు చేసిన మోసాలు లైవ్ లో వినిపించిన సీఎం జగన్

బాబును చీల్చి చెండాడిన మహిళలు

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?