amp pages | Sakshi

వయస్సు 60.. పెళ్లిళ్లు 7

Published on Mon, 02/20/2017 - 09:36

ఓ వృద్ధుడి ఘనకార్యం
న్యాయం కోసం ఏడో భార్య ఆందోళన


యలమంచిలి: మాయమాటలతో పెళ్లిళ్లు చేసుకోవడం.. ఆనక మంచిది కాదంటూ వదిలించుకోవడం ఆ వృద్ధుడికి వెన్నతో పెట్టిన విద్య. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా ఏడు పెళ్లిళ్లు చేసుకున్నాడా ఘనుడు. స్థానికుల కథనం ప్రకారం.. పశ్చిమగోదావరి జిల్లా బూరుగుపల్లి పంచాయతీ మట్టవానిచెరువుకు చెందిన చెల్లుబోయిన ఆంజనేయులు ఆరు ఎకరాల ఆసామి. వయస్సు 60. అతనికి తల్లి, ముగ్గురు అక్కాచెల్లెళ్లతోపాటు ఇద్దరు కొడుకులు ఉన్నారు. వారు చిన్నగా ఉన్నప్పుడే ఆంజనేయులు పెట్టే బాధలు తట్టుకోలేక మొదటి భార్య వెళ్లిపోయింది. కొడుకులూ చదువులు, ఉద్యోగాల కోసం దూరంగా వెళ్లడంతో ఆంజనేయులు రావిపాడు, పోడూరు, అమలాపురం, కాజ పడమర, సగంచెరువు గ్రామాలకు చెందిన ఐదుగురిని పెళ్లి చేసుకున్నాడు. వీరందరినీ గ్రామస్తులకు తెలయకుండా పెళ్లి చేసుకుని.. అలాగే వదిలేశాడు.

చేసుకునేది ఇలా..
తనకు ఆరెకరాల పొలం ఉందని, బిడ్డలు దూరంగా ఉన్నారని, తల్లి వృద్ధురాలు కావడంతో ఆలనాపాలనా చూడడానికి తోడు కావాలని పెళ్లిళ్ల బ్రోకర్లకు చెబుతాడు. వారు తెచ్చిన సంబంధాలను చూసి ఎవరో ఒకరిని ఎంపిక చేసుకుని పెళ్లి చేసుకుని భార్యను ఇంటికి తీసుకువస్తాడు. ఆంజనేయులు  చెల్లి చంద్ర (ఈమె ఇద్దరు భర్తలను వదిలేసి తల్లి వద్ద ఉంటోంది) కొత్తగా వచ్చిన వదినలను పొలం తీసుకుని వెళ్లి గొడ్డు చాకిరీ చేయిస్తోంది. కొంతకాలం గడిచాక కోడలు మంచిది కాదంటూ వదిలించుకుంటారు. గ్రామాంతరం తీసుకెళ్లి లాయర్ల సాయం తీసుకుని వదిలించుకుంటారు.

ఏడో భార్య నిరసన
ఈ క్రమంలోనే 2015 అక్టోబర్‌లో దేవరపల్లి మండలం సంగాయిగూడెం కు చెందిన లక్ష్మిని ఆంజనేయులు ఏడో పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి పెరవలి మండలం అన్నవరప్పాడు గుడిలో రహస్యంగా జరిగింది. ఆ తర్వాత లక్ష్మి గర్భిణి కావడంతో పుట్టింటికి పంపారు. తర్వాత కొవ్వూరు ఆస్పత్రిలో లక్ష్మి మగబిడ్డను ప్రసవించింది. అప్పటి వరకు కనీసం ఫోన్‌ కూడా చేయని ఆంజనేయులు వెళ్లి బిడ్డను చూసి వచ్చేశాడు. మళ్లీ వెళ్లలేదు. దీంతో ఈ నెల 15న లక్ష్మి తన బిడ్డ, అక్కతో కలసి మట్టవానిచెరువు వచ్చింది. భర్త లేకపోవడంతో సంఘ పెద్దలను, డ్వాక్రా మహిళలను కలిసి విషయం చెప్పింది.

లక్ష్మి వచ్చిన సమాచారం తల్లి ద్వారా తెలుసుకున్న ఆంజనేయలు పరారయ్యాడు. అతని తల్లి కోడలిని, చంటి బిడ్డను లోపలికి రానీయకపోవడంతో సంఘ పెద్దలు, స్థానిక మహిళలు కల్పించుకుని ఆ ఇంటిలోని మరో పోర్షన్‌ తాళాలు పగులకొట్టించి లక్ష్మిని అందులో ఉంచారు. నాలుగు రోజులయినా భర్త రాకపోవడంతో విసిగిపోయిన లక్ష్మి స్థానిక సంఘపెద్దలు, డ్వాక్రా మహిళల అండతో ఆదివారం ఆ ఇంటి ముందే నిరసనకు దిగింది.