amp pages | Sakshi

పచ్చ మీడియా అసత్య కథనాలు...: అంబటి

Published on Thu, 08/17/2017 - 14:37

హైదరాబాద్‌ : నంద్యాల ఉప ఎన్నికల నేపథ్యంలో పచ్చ మీడియా అసత్య కథనాలు ప్రసారం చేస్తున్నాయని వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు నిప్పులు చెరిగారు. గురువారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... ఎల్లో మీడియా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీపై బురద జల్లడమే లక్ష్యంగా పని చేస్తుందన్నారు. నంద్యాలలో టీడీపీ గెలవకుంటే బతుకు లేదని  భావిస్తున్నాయన్నారు. చంద్రబాబు అండ లేకుండా బతకలేమని పచ్చ మీడియా భావిస్తోందని అంబటి మండిపడ్డారు. గంగుల ప్రతాపరెడ్డి వైఎస్‌ఆర్‌ సీపీని వీడి టీడీపీలో చేరినట్లు కొన్ని చానళ్లు, పత్రికల ద్వారా జరిగిన ప్రచారం అవాస్తవమన్నారు.

ఆయన తమ పార్టీలో చేరనే లేదని, అలాంటిది గంగుల ప్రతాపరెడ్డి వైఎస్‌ఆర్‌ సీపీని వీడటం అనేది సరికాదన్నారు. చంద్రబాబుకు పరోక్షంగా మేలు చేసేందుకు లేనిది ఉన్నట్లు చెప్పేందుకు కొన్ని చానళ్లు, పత్రికలు యత్నిస్తున్నాయి. ఎల్లో మీడియా ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని, వెయ్యిమంది చంద్రబాబులు వచ్చినా నంద్యాలలో వైఎస్‌ఆర్‌ సీపీ గెలుపును ఆపలేరని అన్నారు.  వాస్తవాలు ప్రచురించే ధైర్యం పచ్చ పత్రికలు, ఛానల్స్‌ చేయడం లేదన్నారు. ఇక ఏపీకి ప్రత్యేక హోదా పొందకపోవడం వల్ల రాష్ట్రం నష్టపోయిందని, ఇప్పటికైనా హోదా కోసం చంద్రబాబు కృషి చేయాలని వైస్‌ఆర్‌ సీపీ కోరుతుందన్నారు.

అలాగే ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రచారాన్ని చూసి జనం నవ్వుకుంటున్నారని అంబటి వ్యాఖ్యానించారు. ‘ చంద్రబాబు గురించి బాలకృష్ణ వాస్తవాలు తెలుసుకోవాలి. తల్లిపాలు తాగి రొమ్ము గుద్దడం అంటే బాలకృష్ణతో ప్రచారం చేయించుకుని లోకేశ్‌కు మంత్రి పదవి ఇవ్వడమే. హుందాతనం, చొరవ గురించి చంద్రబాబు మాట్లాడటం హాస్యాస్పదం. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా ఓటర్ల మనసులు మార్చలేరు. పవన్‌ కల్యాన్‌ తటస్థంగా ఉంటానని ప్రకటించడం శుభ పరిణామం. చంద్రబాబు దుష్ట పాలనను అర్థం చేసుకుని పవన్‌ దూరంగా ఉండాలని అనుకుని అంటారు. బాబు నిజ స్వరూపాన్ని పవన్‌ అర్థం చేసుకున్నందుకు సంతోషం.’ అని అన్నారు.