amp pages | Sakshi

కళ్లు పీకేసే దమ్ము సీఎంకు ఉండాలి: వైఎస్‌ జగన్‌

Published on Thu, 02/16/2017 - 14:04

గుంటూరు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలనను, తప్పిదాలను పలువురు విద్యార్థులు నిలదీశారు. తప్పుచేసిన సామాన్యులకు ఒక న్యాయం ముఖ్యమంత్రికి ఒక న్యాయమా అంటూ చంద్రబాబు తీరును నిలదీశారు. గురువారం గుంటూరులోని నల్లపాడు రోడ్డులోని మిర్చియార్డు పక్కన (గతంలో ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్‌ జగన్‌ నిరాహార దీక్ష చేసింది ఇక్కడే) వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ప్రత్యేక హోదా సాధనకై యువభేరి సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, యువత అభిప్రాయాలను అడిగి తెలుసుకోగా ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్ర అసంతృప్తి బయటపడింది. ఆయా విద్యార్థులు అడిగిన ప్రశ్నలు, వైఎస్‌ జగన్‌ ఇచ్చిన సమాధానాలు ఒకసారి పరిశీలిస్తే..

ప్రశ్న 1
మొన్న జరిగిన నేషనల్‌ ఉమెన్‌ కాన్ఫరెన్స్‌కు ముందు స్పీకర్‌ కోడెలగారు మహిళలను అవమానించారు. ఆడవాళ్లు బయటకే రావొద్దని, వంటింట్లో ఉండాలని చెప్పారు. కానీ, సదస్సు అయ్యాక సీఎం చంద్రబాబు మాత్రం సదస్సు బాగా విజయవంతం అయిందని, ఓ నేషనల్‌ మీడియా మరో పార్టీకి పోయిందని ఆరోపించారు. ఇది ఎంతవరకు సమంజసం? కోడెల మహిళలకు చేసిన అవమానాన్ని ఆయన ఎలా సమర్థించాలన్నా?
------------- వినీలా.. బీటెక్‌ ఫైనలియర్‌.. యూనివర్సల్‌ కాలేజీ

వైఎస్‌ జగన్‌ స్పందన
సాధారణంగా స్పీకర్‌ స్థానంలో ఉన్న ఓ వ్యక్తి అలాంటి మాటలు మాట్లాడితే ముఖ్యమంత్రి ఆయనను ప్రశ్నించాలి. సరిదిద్దాలి. కానీ చంద్రబాబు మాత్రం వత్తాసు పలికారు. వంట చేసుకుంటూ ​ఉంటే ఆడవాళ్లపై రేప్‌లు జరగవని అనడం దారుణం. రాత్రి 12 గంటలకు బయటకు వెళ్లినా రక్షిస్తానని ఒక ముఖ్యమంత్రి చెప్పగలగాలి. ఎవరైనా మహిళలను తప్పుగా చూస్తే కండ్లు పీకేస్తాం అని చెప్పే దమ్ము ముఖ్యమంత్రికి ఉండాలి. (ఈసమయంలో యువత చప్పట్లు, ఈలలు). కానీ, టీడీపీ ప్రభుత్వ హయాంలో మహిళలపై దాడులు జరుగుతున్నాయి.

సాక్షాత్తు ప్రభుత్వ అధికారిణిపై చేయి చేసుకున్నా పట్టించుకోలేదు. రిషితేశ్వరి విషయంలో ఒక్క కేసు పెట్టలేదు. విజయవాడలో ఉంటూ సెక్స్‌రాకెట్‌ వారికి అనుకూలంగా మాట్లాడారు. అంగన్‌ వాడీలకు తోడు ఉండాల్సింది పోయి ఇష్టం వచ్చినట్లు చేశారు. మొన్న ఏపీ పోలీసు బాస్‌ మహిళలపై 11శాతం నేరాలు పెరిగాయని చెప్పారు. అసలు ఇలా చెప్పడానికి ఏపీ ప్రభుత్వానికి సిగ్గుందా. నీ ప్రశ్న చూసైనా మహిళల విషయంలో చంద్రబాబు ప్రభుత్వానికి కనువిప్పు కలుగుతుందని ఆశిస్తున్నాను.  

ప్రశ్న2
ప్రత్యేక హోదా ఏపీకి అవసరం లేదంటూనే గల్లా జయదేవ్‌, సీఎం రమేశ్‌, సుజనా చౌదరీలాంటి నాయకులు ప్రత్యేక హోదా కలిగిన ఉత్తరాఖండ్‌లో పెట్టుబడులు పెడుతున్నారు. అలాగే, ఏపీకి ప్రత్యేక హోదా ఉంటే మనదగ్గరికి కూడా పెద్ద స్థాయిలో పెట్టుబడులు వస్తాయి కదాన్న?
............ వెంకట్‌, యూనివర్సల్‌ కాలేజీ, బీటెక్‌ విద్యార్థి

వైఎస్‌ జగన్‌ స్పందన
పెట్టుబడులు రావడమే కాదు.. మన దగ్గరే ఉద్యోగాలు వస్తాయి. మనమే పక్క రాష్ట్రాలకు కూడా ఇవ్వగలిగే ఉద్యోగాలను సృష్టించగలం కూడా. ప్రత్యేక హోదా వల్ల ఇలాంటి మేలులు ఇంకా చాలా ఉన్నాయి. ఈ విషయం నీ ప్రశ్నతోనైనా చంద్రబాబుకు బోధపడుతుందని అనుకుంటున్నాను’  

ప్రశ్న 3
లంచం తీసుకుంటే ఒక అధికారిని తొలగిస్తారు. అలాగే, కాపీ కొట్టిన విద్యార్థిని డిబార్‌ చేస్తారు. కానీ, ఓటుకు కోట్లు ఇస్తూ దొరికిపోయిన ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఎందుకు ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదన్నా?
.... శ్రీ విద్య, బీటెక్‌థర్డ్‌ ఇయర్‌

వైఎస్‌ జగన్‌ స్పందన
కోట్లలో నల్లడబ్బు అడ్డదారిలో ఇస్తూ ఓటుకు నోటు కేసులో ఆడియోలకు, వీడియోలకు దొరికిపోయినా ఆయనపై చర్యలు తీసుకోకపోవడం చాలా దారుణం. ఇలాంటి పరిస్థితి ఉన్నందుకు మనందరం బాధపడాలి. మీకు ఉన్న అవగాహన ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేదు. ఇలాంటి నేరం దేశ చరిత్రలో ఎక్కడ జరిగి ఉండదు. ఒక ముఖ్యమంత్రి నల్లధనం ఇచ్చి ఆడియో, వీడియోలో దొరికినా అతను రాజీనామా చేయకుండా పదవిలో కొనసాగడం దేశ చరిత్రలోనే తొలిసారి.