దౌర్జన్య భూమి

Published on Fri, 01/11/2019 - 03:44

సాక్షి, నెట్‌వర్క్‌: రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న జన్మభూమి–మావూరు గ్రామసభల్లో సమస్యలపై ప్రశ్నిస్తున్న ప్రజలు, ప్రతిపక్షం వైఎస్సార్‌సీపీ నాయకులపై అధికారపార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. గురువారం కృష్ణా జిల్లాలోని ఉయ్యూరు 17వ వార్డులో జరిగిన సభకు వైఎస్సార్‌సీపీ నేత కొలుసు పార్థసారథి హాజరై ఎన్నికల హామీలు అమలుకు నోచుకోలేవని, జీ+3 ఇళ్ల నిర్మాణాల్లో భారీ కుంభకోణం చోటుచేసుకుందని ఆరోపించారు. దీనిపై ఆవేశంతో ఊగిపోయిన పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌ తిట్ల పురాణం అందుకున్నారు. అదే అదనుగా టీడీపీ నాయకులు బరితెగించి దౌర్జన్యానికి దిగారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు సైతం ఎమ్మెల్యేకు వంతపాడారు. పార్థసారథిని బలవంతంగా సభ నుంచి బయటకు పంపేశారు. కాగా, యనమలకుదురు సభలో బోడే ప్రసాద్‌ మాట్లాడుతూ బిల్డర్లు గ్రామంలో గ్రూప్‌హౌస్‌ల నిర్మాణాలు చేస్తుండటంతో వారిని బెదిరించి రూ.కోటి వసూలు చేశానని, ఆ సొమ్ముతో రోడ్లు వేశానని చెప్పడం గమనార్హం.

విజయవాడ సెంట్రల్‌ 59వ డివిజన్‌ పరిధిలో జరిగిన గ్రామసభలో గతంలో ఇచ్చిన అర్జీలకు పరిష్కారం చూపలేదంటూ అఖిలపక్షం నాయకులు ఎమ్మెల్యే బొండా ఉమా, అధికారులను నిలదీశారు. వారిపై పోలీసులు విరుచుకుపడ్డారు. కార్పొరేటర్‌ అవుతు శైలజపై టీడీపీ కార్యకర్త దాడికి యత్నించాడు. శ్రీకాకుళం జిల్లా భామిని మండలం బత్తిలి సభలో సంక్షేమ పథకాలు అర్హులకు ఇవ్వలేదని వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు నిలదీయగా.. అడ్డుపడిన టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం వన్నెపూడిలో గ్రామసభను వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు అడ్డుకోవడంతో టీడీపీ మండలాధ్యక్షుడు బవిరిశెట్టి రాంబాబు వర్గీయులు కుర్చీలు, బల్లలతో దాడి చేశారు. దీంతో వైఎస్సార్‌సీపీ నాయకులకు గాయాలయ్యాయి.

గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలం వెల్లటూరులో స్థానిక సమస్యలు పరిష్కరించట్లేదంటూ ఓ యువకుడు అధికారపార్టీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులును నిలదీయగా.. పక్కనే ఉన్న పోలీసులు కలుగజేసుకుని నువ్వు వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుడివి.. సభలో గందరగోళం సృష్టించడానికి వచ్చావంటూ పక్కకు లాగేశారు. సీఎం చంద్రబాబు నివాసముంటున్న ఉండవల్లి గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో స్థానిక సమస్యలపై అధికారులకు ఫిర్యాదు చేసేందుకొచ్చిన ప్రజల్ని అధికారపార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో వారికి, ప్రజలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

విజయనగరం జిల్లా గంట్యాడ మండలం కిర్తుబర్తిలో అర్హులకు పింఛన్లు అందలేదని, సంక్షేమ పథకాలు కొంతమందికే అందజేస్తున్నారంటూ గ్రామస్తులు ఎమ్మెల్యే కె.ఎ.నాయుడును నిలదీశారు. మెరకముడిదాం మండలం చినబంటుపల్లిలో గ్రామ సమస్యలపైన, ఆంధ్రా పెర్రో అల్లాయిస్‌ పరిశ్రమలో కార్మికుల సమస్యలపైన ఎమ్మెల్యే కిమిడి మృణాళిని, జెడ్పీ చైర్‌పర్సన్‌ శోభా స్వాతిరాణిని అక్కడి ఉద్యోగులు  నిలదీశారు. వేపాడ మండలం పి.కె.ఆర్‌.పురంలో హామీలు నెరవేర్చలేనప్పుడు గ్రామసభలొద్దంటూ గ్రామస్తులు అధికారులు ఊళ్లోకి రాకుండా ట్రాక్టరు, ఆటో, ముళ్లకంచెలు వేసి అడ్డుకున్నారు.కర్నూలు జిల్లా పడిదెంపాడు, పూడూరుల్లో రోడ్డు సమస్య పరిష్కరించాలంటూ అధికారులను గ్రామాల్లోకి రాకుండా రోడ్డుపై టైర్లు వేసి నిప్పంటించారు. 

‘జన్మభూమి’ ఒత్తిడితో ఏఎస్‌ఐకి ఛాతీనొప్పి.. మృతి
కృష్ణా జిల్లా వీరులపాడు మండలం బొడవాడలో 20 ఏళ్లుగా నివాస స్థలాలు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని, ఇంకా ఎన్నిసార్లు అర్జీలివ్వాలని డీఆర్‌డీఏ పీడీ చంద్రశేఖర్‌రాజును ప్రశ్నించిన వారిపై పోలీసుల్ని ఉసిగొల్పారు. దీంతో ఆందోళనకు దిగిన వారిని అదుపు చేయడానికి ప్రయత్నించిన ఏఎస్‌ఐ మహబూబ్‌ బాషా ఒత్తిడికి లోనయ్యారు. విధులు ముగించుకుని వెళుతున్న సమయంలో ఛాతీనొప్పి రావడంతో  మృతిచెందారు. శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం కరవంజ గ్రామసభకు హాజరైన అడపా సత్యవతమ్మ అనే మహిళ సొమ్మసిల్లి పడిపోయింది. మధ్యాహ్నం అధికారులు మాట్లాడుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. 
 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ