దాళ్వా పంట చేతికొచ్చేనా!

Published on Fri, 03/27/2015 - 03:49

ఈ ఏడాది జిల్లాలో దాళ్వా వరి సాగు చేసిన రైతులు నీటికోసం అల్లాడుతున్నారు. జిల్లాలో 97,500 ఎకరాల్లో వరిసాగు చేయగా, ప్రస్తుతం పైర్లు పొట్ట దశలో ఉన్నాయి. ఈ దశలో కచ్చితంగా నీరు అవసరమని, లేకుంటే పంట చేతికొచ్చే అవకాశం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు.
 
మచిలీపట్నం : అధికారుల సమన్వయలోపం రైతులకు శాపంగా మారనుంది. ఈ ఏడాది రబీ సీజన్‌లో దాళ్వా పంట చేతికొస్తుందో, లేదో అనే అనుమానాలు రైతులను వెంటాడుతున్నాయి. అనధికారికంగా నీటిని కాలువలకు విడుదల చేసిన నేపథ్యంలో జిల్లాలో 97,500 ఎకరాల్లో దాళ్వా పంట సాగు చేశారు. ప్రస్తుతం వరి పైరు పొట్టదశలో ఉంది. ఈ సమయంలో పైరుకు నీరుకావాలని రైతులు చెబుతున్నారు. కాలువల ద్వారా వచ్చే కొద్దిపాటి నీటిని తాగునీటి చెరువులు నింపేందుకు ఉపయోగించాలని, పొలాలకు మళ్లిస్తే వారిపై కేసులు పెడతామని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు హుకుం జారీశారు.

ఓ వైపు పొట్టదశలో ఉన్న పంట పొలాలు ఎండిపోతుంటే నీరుఇవ్వలేని దుస్థితిలో రైతులకు సమాధానం చెప్పలేకపోతున్నామని నీటిపారుదలశాఖ అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండు శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో అటు పొలాలు, ఇటు తాగునీటి చెరువులకు సక్రమంగా నీరు అందని విచిత్ర పరిస్థితి నెలకొంది. వంతుల వారీపద్ధతిలో కాలువ శివారు భూములకు సాగునీటిని అందిస్తున్నామని అధికారులు చెబుతున్నా శివారు ప్రాంతాలకు ఆ నీరు చేరని దుస్థితి.

పెట్టుబడులు తడిసిమోపెడు
జిల్లాలోని మచిలీపట్నం, పెడన, కృత్తివెన్ను, బంటుమిల్లి, ముదినేపల్లి, నందివాడ, కైకలూ రు, కలిదిండి, మండవల్లి తదితర మండలాల్లో దాళ్వా సాగు చేశారు. కాలువల్లోని కొద్దిపాటి నీటిని ఆయిల్ ఇంజిన్లద్వారా పొలాలకు మళ్లించడంతో ఖర్చు తడిసిమోపెడైందని రైతు లు చెబుతున్నారు. ఎరువులు, డీజిల్ ఖర్చులు, పురుగు మందుల ఖర్చులు కలుపుకుని ఇప్పటి వరకు ఎకరానికి రూ. 25వేలు పెట్టుబడిపెట్టినట్లు తెలిపారు. ప్రస్తుతం వరిపంట పొట్టదశంలో ఉందని,నీరులేకుంటే ఎండిపోతుందని రైతులు భయపడుతున్నారు.

ఇటీవల నీటిపారుదల శాఖ ఎస్‌ఈ రామకృష్ణ, ఈఈ కె. రవి మచిలీపట్నం, పెడన నియోజకవర్గాల్లో పర్యటనకు వచ్చినప్పుడు సమస్యను వారి దృష్టికి తీసుకెళ్లినట్లు రైతులు చెబుతున్నారు. కనీసం ఈ నెల 20 వరకూ సాగునీటిని విడుదలచేయాలని కోరామన్నారు. అయితే దీనికి మూడు టీఎంసీల నీరు అవసరమని, పులిచింతల ప్రాజెక్టులో కూడా అంతకుమించి నీరు లేదని ఆయన తెలిపారని చెబుతున్నారు. అయితే నీరు విడుదల చేస్తారోలేదో ప్రశ్నార్థకమే.
 
తీరంలో సాగు ప్రశ్నార్థకం
సముద్రతీరంలోని గ్రామాల్లో దాళ్వా సాగు ప్రశ్నార్థకంగా మారింది. కృత్తివెన్ను మండలంలో నీలిపూడి, కొమాళ్లపూడి, చినపాండ్రాక, చందాల, చినగొల్లపాలెం, పడతడిక గ్రామాలకు చుక్కనీరు అందని పరిస్థితి నెలకొంది. కాలువ ద్వారా ఏమాత్రం నీరు వచ్చినా తాగునీటి చెరువులను నింపాలనే నిబంధన విధిస్తుండటంతో పొలాలకు నీరు ఇవ్వలేని దుస్థితి. 

కైకలూరు మండలం తామరకొల్లు, నరసాయపాలెం, మండవల్లి మండలం ఊటుకూరు, బందరు మండలం పెదపట్నం, తాళ్లపాలెం, గుండుపాలెం, రుద్రవరం తదితర గ్రామాల ఆయకట్టుకు సాగునీరు అందే పరిస్థితి లేదు. కృత్తివెన్ను మండలంలోని చినగొల్లపాలెం బ్రాంచ్ కాలువకు నీరు రాకపోవటంతో కాలువ అడుగంటింది. అధికారులు స్పందించి సాగునీటిని సక్రమంగా విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ