ఎవరి వాటా ఎంత?

Published on Fri, 06/26/2020 - 04:46

సాక్షి,  అమరావతి/రాజమహేంద్రవరం క్రైం/సాక్షి, గుంటూరు: చంద్రబాబు జమానాలో చోటు చేసుకున్న కార్మిక రాజ్య బీమా సంస్థ(ఈఎస్‌ఐ) స్కామ్‌లో ఎవరి వాటా ఎంత అనే లెక్కలు తేల్చేందుకు అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)  దూకుడు పెంచింది. ఈ స్కామ్‌లో 19 మంది ప్రమేయాన్ని గుర్తించిన ఏసీబీ ఇప్పటివరకు 9 మందిని అరెస్టు చేయడం, కోర్టు జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించడం తెలిసిందే. ఈ కేసులో కీలక ఆధారాలకోసం మరింత లోతుగా దర్యాప్తు చేపట్టాల్సి ఉందన్న ఏసీబీ వినతి మేరకు మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే  అచ్చెన్నాయుడును మూడు రోజులపాటు, మిగిలిన నిందితుల్ని రెండు రోజులపాటు కస్టడీకి తీసుకుని విచారించేందుకు కోర్టు అనుమతించింది.

ఈ నేపథ్యంలో గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడును ఏసీబీ అధికారుల బృందం గురువారం సాయంత్రం అక్కడే విచారించింది. మరోవైపు రాజమహేం ద్రవరం సెంట్రల్‌ జైలులో ఉన్న ఈఎస్‌ఐ మాజీ డైరెక్టర్లు జి.విజయకుమార్, సీకే రమేష్‌కుమార్, సూపరింటెండెంట్‌ ఎంకేపీ చక్రవర్తి, రిటైర్డ్‌ జాయింట్‌ డైరెక్టర్‌ వి.జనార్దన్, సీనియర్‌ అసిస్టెంట్‌ ఇవన రమేష్‌లను ఏసీబీ అధికారులు గురువారం తమ కస్టడీలోకి తీసుకుని విజయవాడ ఏసీబీ కార్యాలయానికి తరలించారు. నిందితులను సుదీర్ఘంగా విచారించిన ఏసీబీ అధికారులు వారిపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఒక్కొక్కరికి 14 నుంచి 19 ప్రధాన ప్రశ్నలు సంధించి కీలక విషయాలు రాబట్టే ప్రయత్నం చేశారు.

నిబంధనలు ఎందుకు ఉల్లంఘించారు?
ఈఎస్‌ఐలో మందులు, పరికరాల కొనుగోళ్లలో నిబంధనలను ఎందుకు ఉల్లంఘించారంటూ ఈ కేసులో మాజీ డైరెక్టర్‌ విజయ్‌కుమార్‌ను ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. ఆయన డైరెక్టర్‌గా వ్యవహరించిన 02–11–2017 నుంచి 07–05–2019 వరకు జరిగిన అనేక లావాదేవీలపై ప్రశ్నల వర్షం కురిపించినట్టు సమాచారం.  
► మీ పదవీకాలంలో సర్జికల్, ల్యాబ్‌ కిట్స్, ఫర్నిచర్, వైద్య పరికరాలు, బయోమెట్రిక్‌ మిషన్లు, మందులు ఎంత పరిమాణంలో కొనుగోలు చేశారు? వాటి కొను గోళ్లకు అధికారిక బడ్జెట్‌ ఎంత కేటాయించారు? వాటి కొనుగోళ్లలో బిల్లు చెల్లింపులు ఎలా చేశారు? ఓపెన్‌ టెండర్, ఇ–ప్రొక్యూర్‌మెంట్, స్మాల్‌ టెండర్‌ కొటేషన్స్‌ వంటి విధానాలు ఎందుకు అనుసరించలేదు?  
► కొనుగోళ్లకు ముందు ఈఎస్‌ఐ యూనిట్లలో ఎంత మేరకు మందులు అవసరమనేది నిర్ధారించారా?
► కడప, విజయవాడ జాయింట్‌ డైరెక్టర్‌ స్థాయిలో ఈఎస్‌ ఐలలో అవసరానికి మించి నిల్వ ఉంచిన మందుల విలువ రూ.6.9 కోట్లా, రూ.8.9 కోట్లా? అవసరం లేకుండా అంత విలువైన మందులెందుకు కొన్నారు.. వాటిని నిరుపయోగంగా ఎందుకు వదిలేశారు?
► రూ.లక్షకు మించి వైద్య పరికరాలు కొనుగోలు చేయాలంటే ఈ–టెండర్‌ పిలవాలనే నిబంధన ఎందుకు పాటించలేదు? నామినేషన్‌ పద్ధతిపై కొనుగోళ్లు ఎందుకు జరపాల్సి వచ్చింది? లెజెండ్, అవన్టర్, ఒమేని సంస్థల వద్ద ల్యాబ్‌ కిట్ల కొనుగోలులో విధానపరమైన నిబంధనలు ఎందుకు ఉల్లంఘించారు? అంటూ  ప్రశ్నించారు.

మూడు గంటలపాటు విచారణ..
► ఏసీబీ డీఎస్పీలు ప్రసాద్, చిరంజీవి, ఎం.సూర్యనారాయణరెడ్డిల నేతృత్వంలోని అధికారుల బృందం గురువారం సాయంత్రం  గుంటూరు జీజీహెచ్‌కు వచ్చింది. ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సుధాకర్‌ను కలిసి అచ్చెన్నాయుడును ఏసీబీ కోర్టు కస్టడీకి అనుమతించిన పత్రాలను సమర్పించారు. అనంతరం అచ్చెన్న ఉన్న పొదిల ప్రసాద్‌ మిలీనియం బ్లాక్‌లోని గదికి చేరుకున్న అధికారులు.. డాక్టర్‌ రాజ్యలక్ష్మి, న్యాయవాది హరిబాబు సమక్షంలో విచారణ ప్రక్రియను చిత్రీకరిస్తూ అచ్చెన్నను సాయంత్రం ఐదు నుంచి రాత్రి ఎనిమిది వరకు విచారించారు. 
► అధికారులు వరుసగా ప్రశ్నలు సంధించినట్టు తెలుస్తోంది. అయితే కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పిన అచ్చెన్న, మరికొన్ని ప్రశ్నలకు సమాధానం దాటేసినట్టు సమాచారం. టెలీ హెల్త్‌ సర్వీసెస్‌ ఇచ్చిన సిఫార్సు లేఖపైనే  విచారణంతా కొనసాగినట్టు తెలుస్తోంది. విచారణకు అచ్చెన్న సహకరించారని, ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని డీఎస్పీ ప్రసాద్‌ తెలిపారు.

అక్రమాలకు పాల్పడేలా మీపై ఎవరు ఒత్తిడి తెచ్చారు?
► నిబంధనలకు విరుద్ధంగా మందులు, పరికరాల కొనుగోళ్లలో అవినీతి, అక్రమాలకు ఆస్కార మిచ్చేలా మీపై ఎవరు ఒత్తిడి తెచ్చారు? మీ పాత్ర ఎంత? మీకు కలిగిన లబ్ధి ఎంత? అంటూ ఈ కేసులో ఎ–6 అయిన సూపరింటెండెంట్‌ ఎంకేపీ చక్రవర్తి, ఎ–8 అయిన రిటైర్డ్‌ జాయింట్‌ డైరెక్టర్‌ వి.జనార్దన్‌లను ప్రశ్నించారు. 
► నిబంధనలకు విరుద్ధంగా పెద్ద ఎత్తున మందుల సరఫరా డీల్‌ను ఎలా సాధించారు? ఇందుకు రాజకీయ నేతలను ఎలా ప్రసన్నం చేసుకున్నారు? మందుల కొనుగోళ్ల ఆర్డర్‌ మీకే దక్కేలా ఎవరె వరికి ఎంతిచ్చారు అంటూ ఎ–15 నిందితుడైన మందుల ఏజెన్సీ నిర్వాహకుడు వెంకట సుబ్బారావును ఏసీబీ ప్రశ్నించినట్టు సమాచారం.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ