amp pages | Sakshi

900 ఎకరాల్లో ఏపీ రాజధాని అడ్మినిస్ట్రేటివ్‌ సిటీ

Published on Sat, 03/25/2017 - 13:38

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాజధానిని అద్భుతంగా నిర్మిస్తామని మూడేళ్లుగా ఘనంగా చెప్పుకుంటున్న చంద్రబాబు ప్రభుత్వం  రాజధాని పరిపాలన నగరాన్ని 900 ఎకరాలకే పరిమితం చేయబోతోంది. అందులోనే అసెంబ్లీ, సచివాలయం,హైకోర్టు ఉండబోతున్నాయి.  నదీ అభిముఖంగా అమరావతి నగరం 27 కిలోమీటర్ల పరిధిలో ఉంటుందని ప్రకటించింది.

నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ రూపొందించిన డిజైన్లను రాష్ట్ర ప్రభుత్వం శనివారం అసెంబ్లీలో ప్రదర్శించింది.  డిజైన్ల కోసం రకరకాల సంస్థల సేవలు ఉపయోగించుకుంటున్న ప్రభుత్వం ఇప్పుడు  రాజధాని నిర్మాణంలో సలహాలు, సూచనలు తీసుకునేందుకు ప్రపంచ ప్రసిద్ధి చెందిన కన్సల్టెంట్లను నియమించుకునే ఆలోచనలో ఉంది. 

రాజధాని పరిధిలో మొత్తం తొమ్మిది థీమ్‌ సిటీల నిర్మాణం చేపడతామని ప్రకటించింది. అలాగే రాజధానికి దారితీసే ఏడు ప్రాధాన్య రహదారులకు ఉగాది రోజున సీఎం శంకుస్థాపన చేయనున్నారు. అయితే ఈ డిజైన్లు కూడా తుది డిజైన్లు కాకపోవడం గమనార్హం.  అయితే ఏప్రిల్‌ నెలాఖరు నాటికి తుది ప్రణాళిక ఖరారు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. 2018 డిసెంబర్‌ నాటికి ఐకానిక్‌ భవంతుల నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపింది.

​కాగా రాజధాని డిజైన్‌ ప్రజంటేషన్‌పై ప్రశ్నల పరంపరతో సర్కార్‌ ఉక్కిరిబిక్కిరి అయ్యింది. ఫోస్టర్‌ ప్రతినిధితో పాటు ఐఏఎస్‌ అధికారి శ్రీధర్‌కు ఎమ్మెల్యేలు ప్రశ్నలు సంధించారు. కొత్త రాజధాని డిజైన్‌లో రోడ్లు ఇరుకుగా ఉన్నాయని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు అనగా, క్యాపిటర్‌ వాటర్‌ బాడీస్‌కు నీళ్లు ఎక్కడ నుంచి తెస్తారని అధికారపార్టీ సభ్యుడు వేణుగోపాల్‌ రెడ్డి ప్రశ్నించారు. హైకోర్టు సరే, న్యాయమూర్తులు ఉండే ప్రాంతానికి డిజైన్‌ ఎలా ఉంటుందని వైఎస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌ అడిగారు.

అయితే ఫోస్టర్‌ ప్రతినిధి ఇంగ్లీష్‌లో సమాధానం చెప్పడంతో ఎమ్మెల్యేలు అసహనం వ్యక్తం చేశారు. దీంతో ఐఏఎస్‌ అధికారి శ్రీధర్‌ తెలుగులో అనువదించి సమాధాలు చెప్పారు. ఎమ్మెల్యేల ప్రశ్నల పరంపర కొనసాగడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు జోక్యం చేసుకుని ఇది తొలి కాపీ మాత్రమే అని చెప్పారు. ఇందులో చాలా మార్పులు ఉన్నాయని, ఎవరైనా సూచనలు ఇస్తే మార్పులు చేస్తామన్నారు.