Electricity Bill Of Rs 7.97 Lakh Leaves Uppal House Owner Shocked - Sakshi
Sakshi News home page

Hyderabad: ఖాళీగా ఉన్న ఇంటికి  రూ. 7,97,576  కరెంట్‌ బిల్లు.. ఓనర్‌ షాక్‌!

Published Tue, Jun 20 2023 5:45 PM

7 97 Lakh Power Bill For Uppal House Owner Shocked - Sakshi

సాక్షి, ఉప్పల్‌: ప్రతి నెల రూ. 200 నుంచి రూ. 300 వరకు వచ్చే విద్యుత్‌ బిల్లు ఏకంగా రూ. 7,97,576 రావడంతో ఇంటి యాజమానుల గుండె ఆగినంత పనైంది. ఇదేమని విద్యుత్‌ అధికారులను ప్రశ్నిస్తే డీడీ కట్టి మీటర్‌ను చెక్‌ చేయించుకోవాలని, లేని పక్షంలో వచ్చిన బిల్లు కట్టాల్సిందేనని గద్దించారు. ఈ సంఘటన ఉప్పల్‌ ఏఈ పరిధిలో హైకోర్డు కాలనీలో చోటు చేసుకుంది.

బాధితురాలు చెప్పిన వివరాల ప్రకారం... ఉప్పల్‌ హైకోర్టు కాలనీకి చెందిన పాశం శ్రీదేవి పేరిట రెండు మీటర్లు ఉన్నాయి. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఉన్న ఖాళీ పోర్షన్‌కు ఉన్న విద్యుత్‌ మీటరుకు ప్రతి నెల రూ. 300లోపు మిని మం బిల్లు వచ్చేది. అయితే మే నెలకు సంబంధించి జూన్‌లో వచ్చిన బిల్లు ఆన్‌లైన్‌లో చెక్‌ చేయగా ఏకంగా రూ. 7,97,576లు రావడంతో ఇంటి యాజమానుల గుండె ఆగినంత పనైంది.

వెంటనే విద్యుత్‌ అధికారులను సంప్రదిస్తే నిర్లక్ష్య సమాధానం చెబుతూనే మీటరు టెస్టింగ్‌కు డీడీ కట్టుకొని చెక్‌ చేయించుకోవాల్సిందిగా లేని పక్షంలో వచ్చిన బిల్లు కట్టాల్సిందేనంటూ చేతులు దులిపేసుకున్నారు. దీంతో చేసేది లేక రూ. 150 డీడీ కట్టి మౌలాలిలో మీటర్‌ చెక్‌ చేయించారు. మీటరు డిఫెక్ట్‌ ఉన్నట్లు రిపోర్టులో రావడంతో ఊపిరి పీల్చుకున్నారు. దీనిపై వివరణ కోసం మాట్లాడేందుకు యత్నించగా ఉప్పల్‌ సర్కిల్‌ ఏడీఈ బాలకృష్ణ అందుబాటులోకి రాలేదు. 
చదవండి: పాలమూరులో ‘అవతారపురుషుడి’ హల్‌చల్‌

Advertisement
Advertisement