23 నుంచి బీజేపీ ఆందోళనలు  | Sakshi
Sakshi News home page

23 నుంచి బీజేపీ ఆందోళనలు 

Published Mon, Aug 21 2023 2:04 AM

BJP: Elections Are Approaching The Activities Are Speeding Up - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో బీజేపీ తమ కార్యాచరణను వేగవంతం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 23 నుంచి ఆందోళనలను చేపట్టేందుకు ప్రణాళికను సిద్ధం చేసింది.

ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి సునీల్‌ బన్సల్, పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు కె.లక్ష్మణ్‌ల నేతృత్వంలో ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు పలు పార్టీ సమావేశాలను నిర్వహించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా నిరసనలు, ఆందోళనలకు యాక్షన్‌ ప్లాన్‌ రూపొందించారు. 

23 నుంచి ప్రజా ఆందోళనలు: కె.లక్ష్మణ్‌ అధ్యక్షతన జరిగిన ఉద్యమ కమిటీ సమావేశంలో.. ఈనెల 23 నుంచి నియోజకవర్గ, జిల్లా స్థాయిల్లో ఆందోళన కార్యక్రమాల ప్రణాళికను ఖరారు చేశారు. 23న అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల ఇళ్ల ముందు ధర్నాలు, నిరసనలు చేపట్టి.. ఆయా ఎమ్మెల్యేలు గత ఐదేళ్ల చేసిన అవినీతి, అక్రమాలు, హామీల ఉల్లంఘనపై చార్జిషిటును విడుదల చేస్తారు. 24న మంత్రుల ఇళ్ల ముట్టడి, ధర్నాలు చేపట్టి.. మంత్రుల అవినీతిపై చార్జిషిటును విడుదల చేస్తారు. 25న జిల్లా కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు నిర్వహించి.. కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేస్తారు. 

అమిత్‌షా పర్యటన, బస్సు యాత్రలపై..: 27న ఖమ్మంలో నిర్వహించే అమిత్‌షా సభకు ఏర్పాట్లపైనా రాష్ట్ర బీజేపీ నేతలు మరో సమావేశంలో చర్చించారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా చేపట్టాలని నిర్ణయించిన బస్సు యాత్రలపై స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారు. భద్రాచలం సీతారామ దేవాలయం, బాసర సరస్వతి దేవాలయం, అలంపూర్‌ జోగులాంబ దేవాలయాల నుంచి బీజేపీ బస్సుయాత్రలను ప్రారంభించనున్నారు. 

అధికార పార్టీ ఉల్లంఘనలపై ఫోకస్‌ 
మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్‌రెడ్డి నేతృత్వంలో జరిగిన బీజేపీ ఎలక్షన్‌ కమిషన్‌ ఎఫైర్స్‌ కమిటీ సమావేశంలో.. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా అధికార పార్టీ చేపట్టే కార్యక్రమాలపై ఎప్పటికప్పుడు స్పందించేలా చేపట్టాల్సిన చర్యలపై చర్చించినట్టు తెలిసింది.

ఇక ఈటల రాజేందర్‌ అధ్యక్షతన జరిగిన ఎన్నికల మేనేజ్‌మెంట్‌ కమిటీ సమావేశంలో.. నియోజకవర్గాల వారీగా పార్టీ అభ్యర్థుల విజయానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. కాగా సోమవారం పార్టీ అనుబంధ సంఘాలైన ఏడు మోర్చాల సమావేశాలను పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించనున్నారు.

Advertisement
Advertisement